Pulao masala Telugu Recipe with step by step instructions.English Version.

ఇంట్లో తయారు చేసిన పులావు మసాలా తో పులావు చేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. అయితే ఈ మసాలా రెసిపీ కొరకు వెతికిన వారికి ఎక్కువగా బిర్యాని మసాలా రెసిపీ దొరుకుతుంది. అప్పుడు మొదలవుతుంది కన్ఫ్యూషన్. అసలు పులావు మసాలా, బిర్యానీ మసాలా రెండూ ఒకటేనా? లేకపోతే వేరు వేరా?
రెండింటిలో వాడే సుగంధ ద్రవ్యాలు దాదాపు ఒకటే.కాకపొతే పులావు మసాలా లో ఘాటు తక్కువగా ఉండే సుగంధ ద్రవ్యాలు వేసి చేయాలి.లవంగాలు, జాజికాయ, జాపత్రి అన్నింటికన్నా ఘాటు ఎక్కువగా ఉంటాయి. సోంపు, ఏలకులు, అనాస పువ్వు, దాల్చినచెక్క లాంటివి ఘాటు తక్కువగా ఉండడమే కాకుండా మంచి సువాసన తో ఉంటాయి.
మనం బిర్యానీని మాంసం తో కలిపి వండుతాము.అందుకే మాంసం లోని నీచు వాసన ను డామినేట్ చేసే విధంగా బిర్యానీ మసాలా ను కొద్దిగా ఘాటుగా తయారు చేస్తారు. పులావ్ అయితే దాదాపు ఒట్టి అన్నంతోనే చేస్తారు కాబట్టి సున్నితమైన సువాసన తో మాత్రమే ఉండేలా పులావ్ మసాలా తయారు చేసుకోవాలి.
ఒకవేళ మీరు చికెన్ పులావు లేదా మటన్ పులావు లాంటివి చేస్తుంటే కనుక బిర్యానీ మసాలానే ఉపయోగించవచ్చు. వెజిటెబుల్ పులావు లేదా ప్లెయిన్ పులావ్ చేస్తుంటే ఈ పులావ్ మసాలా వేసి చేసుకుంటే బాగుంటుంది.పులావు మసాలా లో ఘాటు లేని సుగంధ ద్రవ్యాలు( సోంపు, ఏలకులు) శాతం ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి.
మీరు బయట కొన్న మసాలా ఎంతన్నా వేయండి కానీ ఎంతైనా ఇంట్లో చేసుకున్న పులావు మసాలా తో చేస్తే వచ్చే రుచి మాత్రం రాదు. అందుకే మీరు కూడా నాలానే మసాలా పౌడర్ ని ఇంట్లోనే తయారు చేసుకుని అసలైన రుచిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.
మీకు నచ్చే మరికొన్ని వంటలు
Homemade Biryani masala in Telugu
 Gutti Vankaya Biryani in Telugu
 Kothimeera Kodi Pulao Recipe in Telugu
 Prawns/Royyala Pulao Recipe in Telugu
 Beetroot Pulao Recipe in Telugu
 Chicken Tikka Pulao Recipe in Telugu
Click here for the English Version of the Recipe.

- ౩ tbsp ధనియాలు
- 1 tbsp సోంపు
- 15 నుండి 20 ఏలకులు
- 10 నుండి 12 లవంగాలు
- 2 బిర్యానీ ఆకులు
- 2 దాల్చినచెక్కలు అంగుళం పొడవు కలవి
- 1 జాపత్రి
- 1/8 ముక్క జాజికాయ
- ౩ మరాఠీ మొగ్గలు
- 1 అనాస పువ్వు
- పెనం వేడి చేసి అందులో ధనియాలు, సోంపు, ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు వేసి చక్కటి సువాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయాలి.
- స్టవ్ కట్టేసి రెండు నిమిషాలు చల్లారనివ్వాలి.
- ఈ లోపుగా ఏలకులు లోపల నుండి గింజలు బయటకు తీసేసి బయట తొక్కలు పడేయాలి.
- మసాలా దినుసులన్నింటిని మిక్సిలో వేసి మెత్తగా పొడి కొట్టాలి.
- మూత బిగుతుగా ఉన్న డబ్బాలో పులావు మసాలా ను స్టోర్ చేసుకోవాలి.

Leave a Reply