Site icon Maatamanti

దేశాన్ని చుట్టి రావాలి అన్న నా కల నెరవేరుతుందా?

నిన్న సాయంత్రం మరియు ఇవాళ పొద్దున Hotstar లో ఒక డాక్యుమెంటరీ చూశాను. చూసినంత సేపు నా కళ్ళు చెమ్మతో నిండిపోయాయి, నాసిక ఎర్రగా మారిపోయింది, రోమాలు నిక్కబొడుచుకునే ఉన్నాయి. ఆ డాక్యుమెంటరీ ప్రోగ్రాం పేరు India From Above. అత్యాధునిక డ్రోన్ల సహాయంతో నింగి నుండి మన భారతదేశం లో ఎన్నో చారిత్రాత్మక మరియు స్థల ప్రాముఖ్యత గల ప్రాంతాలను అద్భుతంగా చూపించారు.

పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుండి బతుకు కోసం పోరాటం, స్టేటస్ కోసం పాకులాట ఇదే మన జీవితం.  అసలు మన గురించి ఆలోచించుకునే సమయం దొరకదు. చివరికి అంతా అయిపోయాక ఒక రోజు వెనక్కు తిరిగి చూసుకుంటే  అసలిన్ని రోజులు మనమేం చేశాము? మన జీవితానికి అర్ధం ఏమిటి? అనే ప్రశ్నలు వేధిస్తుంటాయి. మనం చనిపోయే లోపు మనల్ని మనం తెలుసుకోవాలి. మనల్ని మనం తెలుసుకోవాలి అంటే మన ఇంట్లో మనం కూర్చుంటే కాదు. కేవలం మన స్నేహితులు, బంధువులతో ఎంజాయ్ చేయడం కాదు.  వివిధ ప్రాంతాలు తిరగాలి, రకరకాల మనుషులతో మాట్లాడాలి. ఆ ప్రయాణం లో మనల్ని మనం తెలుసుకోగలుగుతాము. జీవించడం అంటే జీవితానికి అర్ధం తెలుసుకుని బ్రతకడం.

నాకు వేరే ప్రదేశాలకు వెళ్లడం, అక్కడి మనుషులను వారి జీవన విధానాన్ని గమనించడం అంటే చిన్నప్పటి నుండీ అత్యంత ఇష్టం. నా బాల్యం అంతా అలానే గడిచింది. కానీ నేను 6 వ తరగతి లో ఉన్నప్పటి నుండి నాకు అకస్మాత్తుగా ఎలర్జీ రావడం మొదలైంది. ఏది ముట్టుకున్నా ఒళ్ళంతా దద్దుర్లు రావడం లేదా ఉబ్బిపోవడం లా అన్నమాట. నాకెంతో ఇష్టమైన వీధి కుక్క పిల్లల్ని ఎత్తుకుంటే దద్దుర్లు, బెండ మొక్కల నుండి బెండకాయలు కోస్తే  దద్దుర్లు, RTC బస్సు ఎక్కి అందులో తుప్పు పట్టిన కిటికీ కానీ, బస్సు మధ్యలో ఉండే pole కానీ పట్టుకుంటే దద్దుర్లు, సినిమా హాల్ లో విరిగిపోయిన హ్యాండ్ రెస్ట్ మీద చేయి పెట్టి కూర్చుంటే 5 నిమిషాల్లో చేయంతా ఉబ్బిపోయేది. ఒకసారైతే ఏమైందో గుర్తులేదు కానీ 9 వ తరగతి లో ఉన్నప్పుడు అచ్చు ‘ఐ’ సినిమాలో విక్రమ్ లా కురూపిలా నా ముఖం చేతులు పెదాలు అన్నీ ఉబ్బిపోయినట్లు అయిపోయాయి.

ఇలా ఎందుకవుతుందో ఏ డాక్టర్ చెప్పలేదు కానీ, ఆ బాధ పడేకన్నా చాలా చాలా శుభ్రంగా జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం తెలుసుకున్నాను. అప్పటి నుండే నా అతి శుభ్రం జబ్బు మొదలైంది. “నీకు ఈ ప్రాబ్లెమ్ ఉంది అంటే పెళ్లి కాదు. ఇలాంటివి ఎవరికీ చెప్పకూడదు. మెల్లిగా అదే తగ్గిపోతుంది  అమ్మా” అనేవారు నాన్న. పెళ్లయినాక కాస్త తగ్గింది కానీ పూర్తిగా తగ్గలేదు. కాలికి మెట్టెలు పెట్టుకుంటే వేళ్ళు అంతా దురదలు. అందుకే అవి తీసేయాల్సి వచ్చింది.  స్వేద రంధ్రాలను మూసి పెట్టేసే సౌందర్య ఉత్పత్తులు వాడానూ అంటే ఇక అంతే. ఒక రోజు ఒక మాల్ కి వెళ్ళాను. అక్కడ ఖాదీ సబ్బులు కొనుక్కుందామని ఒక షాప్ కి వెళ్తే అక్కడ సౌందర్య ఉత్పత్తుల్ని ప్రమోట్ చేసే ఒక అమ్మాయి “మేడం ఇది కొనండి చాలా బాగుంటుంది. మీ స్కిన్ కలర్ తో కలిసిపోతుంది” అని చెప్పింది. అది రాసుకుంటే నేనెక్కడ కలిసిపోతానో నాకూ, నా పక్కన ఉన్న మా ఆయనకీ, మా అమ్మాయికి తెలుసు. “ఒద్దు అమ్మా” అని చెప్పాను. షాప్ అంతా తిరిగి మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి “మేడం ఒక్కసారి ట్రై చేయొచ్చు కదా ” అంది.

నిజంగా ఒకరిని convince చేసి ఒప్పించడం ఎంత కష్టం కదా. అసలామ్మాయి స్థానంలో నేను ఉంటే అలా బ్రతిమలాడగలనా అనిపించింది. నాకిష్టం లేకపోయినా ఆ అమ్మాయి కోసం ఒప్పుకున్నాను. ఆ అమ్మాయి నా ముఖానికేదో రాసింది. ఫౌండేషన్ ఇలాంటివేవో ఉంటాయి కదా అదన్నమాట.  ఒక పక్క ఆ అమ్మాయి రాస్తుంటేనే నాకు కింద కాళ్ళ మీద దురదలు స్టార్ట్ అయ్యాయి. కొంచెం రాశాక చూస్తే ఎందుకో ఆ అమ్మాయికే నా ముఖం నచ్చలేదేమో పేపర్ నాప్కిన్ లాంటిది ఇచ్చి ముఖం తుడుచుకోమంది. షాప్ నుండి బయటకు వచ్చాక ఒళ్ళంతా దురదలు. ఇలాంటి బాధ నేను కొన్ని సంవత్సరాలుగా పడుతున్నాను. అసలింట్లో నుండి బయటకు వెళ్ళను, షాపింగ్ అరుదు , సినిమా చాలా అరుదు, వేరే ఊరు వెళ్ళలేను, వేరే వాళ్ళింట్లో బాత్ రూమ్స్ వాడలేను. వేరే వారు మా ఇంటికి వచ్చి సోఫా లో కాళ్ళు పెడితే ఇష్టపడను. పెళ్లిళ్లకు ఫంక్షన్స్ కు వెళితే అక్కడ ఎక్కువ గుంపులుగా జనాలు ఉంటారు అని వెళ్ళను. నాకు ఏదైనా ఆరోగ్య సమస్య రావడం అరుదు.వచ్చినా హాస్పిటల్ కి వెళ్ళాలి అంటే చచ్చేంత భయం. అక్కడ ఎవరికీ కంటికి కూడా కనిపించని వైరస్లు, బాక్టీరియా లు నాకు మాత్రమే పిశాచాల్లా కనిపించి నన్ను భయపెడతాయి. అసలు ఎక్కడ హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయంతోనే చాలా జాగ్రత్తగా ఉంటాను.

కొన్ని సార్లు ఒక్క eye-brows చేయించు కోవడం కోసం మాత్రమే బ్యూటీ పార్లర్ కి వెళ్ళాను. ఆ తర్వాత eye-brows చేసే వారు నోట్లొ దారం పెట్టుకుని చేస్తుంటే చిన్న చిన్న ఉమ్ము తుంపరలు నా ముఖం మీద పడడం నేను గమనించాను. అది కూడా మానేశాను. ఆ పని అలానే చేయాలి. పాపం ఇంకెలా చేస్తారు మరి?  కరోనా వచ్చి అందరూ ఇళ్లల్లోనే ఉండిపోవడాన్ని వింతగా, కష్టంగా భావించారు. ఉరుకూరికే చేతులు కడుక్కోవడం మొదలు పెట్టారు. కానీ నాకది కొత్త కాదు. నాకసలు తేడా నే తెలీలేదు. ఇంత అతి శుభ్రం జబ్బు ఉన్న నేను నిజంగా దేశంలో అన్ని ప్రాంతాలు తిరిగి చూడగలనా? రకరకాల మనుషుల్ని కలవగలనా? అలా చూడాలి అన్న నా కల నెరవేరుతుందా? 

నేను చూసిన ఆ డాక్యుమెంటరీ లో పైన డ్రోన్ షాట్స్ చూస్తే అంతా అందంగా, కన్నుల పండుగగా, ఆనందంగా ఉంది. కానీ కింద దగ్గర నుండి చూస్తే నిజంగా అలా ఉంటుందా?

నాకు పరమ శివుడంటే మహా ప్రాణం. అలా అని గంటల తరబడి పూజలు చేస్తాననుకునేరు. అసలు పూజలు చేయను. ఆయన ఎలా ఉంటాడో(అయనకున్న రకరకాల మనస్తత్వాల్ని)అలా ఆయన్ను అనుకరిస్తుంటాను.  ఆయన అందరికీ దేవుడెమో కానీ నాకు మాత్రం బెస్ట్ ఫ్రెండ్. అనేక సందర్భాల్లో నాకు కలిగే రకరకాల భావాలూ, భావుకతలు, భావోద్వేగాలు ఆయనతో మౌనంగా పంచుకుంటాను. మానససరోవరం దగ్గర మేమిద్దరం మాత్రమే ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటున్నట్లు ఊహించుకుంటూ ఉంటాను. నా జీవితంలో ఒక్కసారైనా అక్కిడికి వెళ్ళాలి ఆ సరోవరాన్ని నిజంగా చూడాలి అనేది నా బలమైన కోరిక.

ఒకప్పుడు(ఇంటర్నెట్ సౌకర్యం లేనప్పుడు) నా ఊహలో మానససరోవరం ఇలా ఉండేది. చుట్టూ ఎతైన కొండలు, ఆ కొండల మీద పరచుకున్న పచ్చదనం ఆ పచ్చదనాన్ని దుప్పటిలా  కప్పేసిన వెండి మంచు. నీలి మేఘాల రంగును అలవోకగా దొంగిలించి, ఎంత నడిచినా అక్కడే ఉంటానని తెలిసి కూడా తన గజగమన తరంగాల తో హుందాగా, వయ్యారంగా ఒడ్డుకు నడుస్తున్నట్లు హొయలొలికించే సుందరమైన ‘మానససరోవరం’. ఇదీ నా ఊహలోని మానస సరోవరం.

నా జీవితంలో నేను స్వయంగా ఎదుర్కున్న  కొన్ని అనుభవాల వల్ల వాస్తవాల  కన్నా ఊహలే అందంగా ఉంటాయి అని బోధపడింది. 2004 ద్వితీయార్ధంలో  మొదటిసారి నేను  ఇంట్లో ఇంటర్నెట్ పెట్టించుకున్నాను.  అప్పుడు అందులో మానస సరోవరం ఎలా ఉంటుందో కనీసం ఫోటోలు అయినా చూడొచ్చు అన్న ఆలోచన స్ఫురణకు రాలేదు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న చందాన ఏదేదో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్న ఆరాటంలో ఆ విషయం ఆలోచించలేదు. c,c++,  Oracle,Html….  z++, Miracle(హ హా ఊరికే సరదాకు అన్నాను లెండి) ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉన్నాను. నాకు గుర్తుండి అప్పటికి Youtube కూడా లేదు.

కానీ ఎప్పుడైతే యూట్యూబ్ కి ప్రాముఖ్యత పెరిగిందో అప్పుడు నేను కూడా వీడియోస్ చూడడం మొదలు పెట్టాను. ఎక్కువగా చదువుకు సంబంధించినవే చూసేదాన్ని. ఎప్పుడైతే GROUPS కి ప్రిపేర్ అవుతున్నానో అప్పుడు మాత్రం చరిత్రకు సంబంధించిన విషయాలు, స్థలాలు బాగా విపరీతంగా చూసేదాన్ని. నా సహ వీక్షకులు నా కూతురు, మా కింద ఇంట్లో వారి అబ్బాయి హర్ష(అప్పుడు 6 years వయస్సు వాడికి). అవి చూసేటప్పుడు నేను వారిద్దరికీ వాటి గురించి నాకు తెలిసింది చెప్పేదాన్ని. మా అమ్మాయి నన్ను ఒక్కోసారి మధ్యలో ఆపి “ఎందుకమ్మా? చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత పెట్టె తెరిచి రజినీకాంత్ కి నగలు చూపించేటప్పుడు ఎక్సైట్ అయినట్లు అలా ఎక్సైట్ అవుతూ చెప్తావు. కాస్త కూల్ గా చెప్పు” అనేది.

చరిత్ర పుస్తకాలు చదివేటప్పుడు, ఆనాటి కాలాన్ని ఊహించుకుంటూ నేను కూడా వర్చ్యువల్ గా అక్కడే ఉన్నట్లు ఊహించుకుంటూ చదివేదాన్ని. కొన్ని స్థలాలు, ప్రాంతాలు యూట్యూబ్ లో చూస్తూ ఫీల్ అవుతూ చదివేదాన్ని. అలా నేను చూసిన వాటిలో నాకు బాగా నచ్చింది Angkor wat Temple . నా జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి ఆ దేవాలయాన్ని చూడాలి అని నా ఆశ. అది నాకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది. అది కంబోడియా లో ఉంది.  సూర్యవర్మన్ అనే రాజు కట్టించిన అతి పెద్ద విష్ణు దేవాలయం. వీడియో లో చాలా చాలా అందంగా అనిపించింది.  అలా చూస్తున్నప్పుడే నాకు మానస సరోవరం ఎలా ఉంటుందో చూస్తే బాగుంటుంది కదా అనిపించింది. కానీ ఎందుకో చూడలేదు. నేను అప్పటివరకు ఉహించుకున్నట్లుగా అది లేకపోతే నేను భరించలేను. అలా ఒక సంవత్సరం చూడకుండా ఉన్నాను. తర్వాత ఒకరోజు ఏదో బాగా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఇక చూడాల్సిందే అనుకుని చూశాను.

యూట్యూబ్ లో టైపు చేయగానే వీడియో లిస్ట్ వచ్చింది. మొదటిది క్లిక్ చేసి చూశాను. అక్కడ సరోవరం దగ్గర కొంతమంది యాత్రికులు ఉన్నారు. వాళ్ళందరూ నీళ్ళలోకి దిగి దణ్ణం పెడుతున్నట్లుగా వరుసగా నిల్చున్నారు. పసుపు కుంకుమలు లాంటివి తెచ్చి చిన్న చిన్న పూజలు లాంటివి చేస్తున్నారు. అది చూసి నేనెందుకో సహించలేకపోయాను. అక్కడ అత్యంత స్వచంగా ఉన్న నీటిని కలుషితం చేయడం చూడలేకపోయాను. అసలక్కడికి వెళ్ళాక ఏ పూజలు అవసరం లేదు. ఒక్క 5 నిముషాలు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటే చాలు. అలా చేస్తే లక్ష పూజలు చేసినా రాని ప్రశాంతత, పుణ్యం లభిస్తాయి. ఇంకో వీడియో చూస్తే ఇంకేమేమి చూడాల్సి వస్తుందోనన్న భయంతో మళ్ళీ ఇంతవరకు చూడలేదు. నా ఊహని బ్రతికించుకోవాలి అంటే తప్పదు మరి.

మనం ఎంతో పవిత్రంగా భావించే మన నదులన్నింటినీ ఒక్క నదిని కూడా వదిలిపెట్టకుండా అన్నింటినీ సర్వ నాశనం చేశాము. నదీ స్నానాలు , పూజల పేరుతో ప్లాస్టిక్ కవర్లు,  బాటిల్స్ ఇలాంటి చెత్త అంతా తెచ్చి అక్కడ వదిలి వెళ్తుంటాము.  నేను చివరి సారిగా 3 సంవత్సరాల క్రితం వెళ్లిన గుడి యాదాద్రి. మా అమ్మాయి తల నీలాలు ఆ స్వామికి ఇస్తానని మొక్కుకున్నాను. మొక్కు తీర్చుకోవడానికి వెళ్తే అక్కడ పరిసరాలు చూసి నా బాధ వర్ణనాతీతం. అడుగడుగునా ఉమ్ములు.  అక్కడ స్నానం చేయడానికి రూమ్ బుక్ చేసుకుందాము అంటే “ఎందుకండి 5 నిమిషాలకు రూమ్. కరెక్ట్ గా ఇంకో అరగంటలో చాలా మంది భక్తులు వచ్చేస్తారు రద్దీ పెరుగుతుంది. దర్శనం లేట్ అవుతుంది. టైం వేస్ట్ చేయకుండా అక్కడ పబ్లిక్ స్నాన గదులు ఉన్నాయి వెళ్ళండి” అన్నారు. సర్లే అని వెళితే అక్కడో  నరకం. అన్ని బాత్రూమ్స్ నిండిపోయి ఉన్నాయి. జనాలు క్యూలో ఉన్నారు. అక్కడ చాలా చాలా అపరిశుభ్రంగా ఉంది. కళ్ళు మూసుకు నిలబడ్డాను. చివరకు నాకు మా అమ్మయికి చెరో బాత్రూమ్ దొరికాయి. అందులో కి వెళ్తే బకెట్ లేదు. మగ్ మాత్రమే ఉంది.  బాత్ రూంలో నాలుగు మూలల వాడిన శానిటరీ పాడ్స్ చాలా ఉన్నాయి. భరించలేని వాసన. ఆ క్షణానే చనిపోవాలి అనిపించింది. మా అమ్మాయి తన బాత్రూం కూడా అలానే ఉంది అని చెప్పింది. తర్వాత బయటకు వచ్చి గుడిలోపలికి వెళ్ళాక కూడా నాకు ఆ బెరుకు, అసహ్యం పోలేదు. మళ్ళీ ఆ తర్వాత ఇంతవరకు ఆ గుడికి వెళ్ళలేదు. ఇప్పుడు అలా లేదేమో మారిపోయి ఉండవచ్చు. కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు కదా. కానీ ఎంత అభివృద్ధి చేస్తే ఏంటి? జనం మారనంత వరకు స్వర్గాన్ని నిర్మించినా చెత్త చేస్తారు.

ఇప్పుడు నేనేదైనా గుడికి వెళ్ళాలి అంటే పెద్దగా ప్రాముఖ్యత లేని అసలు ఎక్కువ మంది రాని గుడికి మాత్రమే వెళ్ళగలను. ఇలా నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్న ప్రదేశాల్లో మానస సరోవరం ఒకటి. మా అమ్మ చనిపోయే కొద్ది రోజుల ముందు నాకు చెప్పిన లడఖ్(ఏదో పుస్తకం లో లడఖ్ ప్రాంతం అక్కడి ప్రజల జీవన విధానం గురించి చెప్తుంటే సగం మాత్రమే విన్నాను.)మిగతా సగం తెలుసుకోవడానికి వెళ్ళాలి అనుకున్నాను. అరుణాచల్ ప్రదేశ్ కూడా ఎంతో అద్భుతమైన ప్రదేశం. అక్కడ నాన్న 3 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ ఒక డామ్(Poonch River మీద కట్టిన డ్యామ్)కి జనరల్ మేనేజర్ గా పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడు నాన్న నాతొ ఎన్నో ఫోటోలు, వీడియోలు షేర్ చేసేవారు. అక్కడి ప్రజల జీవన విధానం, అలవాట్లు ఫోన్లోనే కళ్ళకు కట్టినట్లుగా చెప్పేవారు.

నాన్న గుజరాత్ లో ఉన్నప్పుడు అక్కడకు వెళ్ళాను. అక్కడ వారం రోజులు ఉన్నాను. గుజరాత్ లో మాత్రం చాలా అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలు, ప్రదేశాలు ఉన్నాయి. అక్కడి ప్రజల జీవన విధానం కొంతవరకు అవగతమైంది. కొంత నాన్న చెప్పారు.

నేను కొన్ని సంవత్సరాలు ముంబై లో ఉన్నాను. ముంబై అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఒక్కరోజు కూడా నాకు నా స్వంత రాష్ట్రాన్ని కానీ,  మనుషుల్ని కానీ వదిలి వెళ్లిపోయానే అన్న భావన కలుగ లేదు. పైగా తిరిగి వచ్చేసే ముందు చాలా బాధ పడ్డాము. నాకు ముంబై అంటే ఎందుకు ఇష్టమంటే, ప్రతీ మనిషి జీవితంలో ఒక మార్పు లేదా పరిణితి చెందే దశ ఏదో ఒక సందర్భంలో వస్తుంది. అప్పుడు మనకు ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అది నాకు ముంబై లో ఉన్నప్పుడు కలిగింది. అక్కడ నాకు ఎంతో ఏకాంత సమయం ఉండేది. నన్ను నేను తెలుసుకోవడానికి, తర్కించుకోవడనికి ఆ సమయాన్ని వాడుకున్నాను. అక్కడి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకున్నాను. ఇవన్నీ నేను మీతో వేరే పోస్ట్ లో షేర్ చేసుకుంటాను.

ఎప్పుడైనా మనసులో ఏదైనా భావం కలిగినప్పుడు వెంటనే దాన్ని చెప్పేయాలి అనిపిస్తుంది నాకు. మాటల్లో చెప్తే 5 నిమిషాలే ఉంటుంది. అదే రాతలతో చెప్తే ఎన్ని రోజులయినా నా భావాలకు చెదరని రూపం ఉంటుంది కదా అనే ఆశ. అందుకే నాకు అనిపించిన వెంటనే ఇవాళ ఇలా రాయడం మొదలు పెట్టాను. ఇలా రాసి అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాను.  TV షోలు , రకరకాల  వీడియోలు చూడడానికి  ఎక్కువ ఆసక్తి చూపుతున్న ఈ రోజుల్లో కూడా కాస్త చదివే అలవాటు ఉన్న కొంతమంది అవన్నీ పక్కన పెట్టి  నా బ్లాగ్ కి వచ్చి చదువుతున్నారు. నా బ్లాగ్ statistics లో ట్రాఫిక్ చూసి అది తెలుసుకున్నాను. చాలా సంతోషం. పాఠకులకు నా ధన్యవాదములు.

Exit mobile version