Site icon Maatamanti

Weight loss Plan Telugu-బరువు తగ్గించుకునేందుకు ప్రణాళిక

బరువు తగ్గాలి అని నిర్ణయించుకున్నాక మీరు తప్పక ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.ఆ ప్రణాళిక ను తప్పకుండా పాటించి తీరాలి. మీరు ఎపుడైనా వినే ఉంటారు. కొద్దిగా బొద్దుగా ఉండే సినిమా తారలు సడన్ గా నాజూక్కా మారిపోతారు. అది నిజంగా వాళ్ళ పట్టుదల కి నిదర్శనం. వాళ్లకు ప్రణాళిక చేసుకునే సమయం ఉండదు కాబట్టి వాళ్ళు ఒక ఫిట్నెస్ ట్రైనర్ ను, డైటీషియన్ ను నియమించుకుంటారు. వారు చెప్పినట్లే తు.చ తప్పకుండా పాటిస్తారు. అందుకే అంత త్వరగా తగ్గిపోతారు. అందంగా నాజూగ్గా మారిపోతారు.

కాస్త పట్టుదల, సహనం ఉంటే మనం కూడా  ఫిట్నెస్ ట్రైనర్, డైటీషియన్ లాంటి వాళ్ళ అవసరం లేకుండానే నాజూక్కా మారవచ్చు. ప్రణాళిక చేసుకోవడానికి ముందు మీరు మానసికంగా సిద్దం కావాలి. రేపు చేద్దాం మాపు చేద్దాం అని వాయిదాలు వేసుకోకూడదు. అనుకున్న రోజు నుండి కచ్చితంగా మొదలు పెట్టాలి.బరువు తగ్గటమంటే తిండి మానేయడం కాదు, విపరీతంగా ఎక్సర్సైజులు చేయడం కాదనే విషయాన్ని ముందు మీరు తెలుసుకోవాలి.

 

ఇప్పుడు ఎలా ప్రణాళిక చేసుకోవాలో చెప్తాను(ఇవి కచ్చితంగా పాటించాలి)

నేను క్రింద ఇచ్చిన ప్రతీ సూచన నేను స్వయంగా పాటించి మీకు చెప్తున్నాను. నేను, నా హస్బెండ్ ఇద్దరం 15 కేజీలు బరువు కేవలం 2 నెలలలోనే వదిలించుకున్నాము. ఇప్పుడు మాకు శరీరం ఎంతో తేలికగా ఉంది. ఇంతకు ముందు ఉన్న చిన్న చిన్న హెల్త్  ప్రాబ్లెమ్స్ కూడా పోయాయి.సన్నగా ఉన్నప్పుడు మేము ఉపయోగించిన దుస్తులన్నీ మళ్ళీ వేసుకోగలుగుతుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది.మీరు కూడా క్రింద నేను చెప్పిన ప్రణాళిక ను పాటిస్తూ సరయిన జీవన శైలితో ఉంటే తప్పక నాజూగ్గా మారతారు.

మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ముందు ఒకసారి అన్ని అవసరమైన టెస్ట్ లు చేయించుకోవాలి. ఇప్పుడు అన్ని టెస్ట్ లు కలిపి ఒక ప్యాకేజిలా చేస్తున్నారు. టెస్ట్ తో పాటు ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. ఖర్చు కూడా తక్కువే అవుతుంది. అన్నీ నార్మల్ గా ఉంటే పర్వాలేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ చెప్తారు కదా. డాక్టర్ సూచించిన విధంగా మందులను ఉపయోగించడం మొదలు పెట్టాలి. అసలు అన్నీ నార్మల్ గా  ఉంటే ఏ బాధా లేదు.

టెస్ట్ లు ఎందుకు చేయించుకోవాలంటే, మనకు కొన్ని జబ్బులు వాటి తాలూకు లక్షణాలు త్వరగా బయట పడవు.ఓపికున్నంత వరకు మన శరీరం భరిస్తూనే ఉంటుంది.ఇక శరీరం తనంతట తాను ఆ జబ్బుని రికవర్ చేయలేను అనుకున్నప్పుడే ఆ జబ్బు లక్షణాలను బయట పెడుతుంది.ఉదాహరణకు, ఆరోగ్యంగా ఉన్న ఒక సాధారణ మనిషి శరీరంలో LDL(చెడు) కొలెస్ట్రాల్ శాతం 100 – 129 వరకు ఉంటే పర్వాలేదు. కొంతమందికి ఇది చాలా ఎక్కువగా సాధారణ స్థాయి కన్నా మించి ఉంటుంది. కానీ మన శరీరం మనకు ఆ విషయాన్ని కొన్ని రోజుల వరకు ఏ జబ్బు రూపంలో ను బయట పెట్టదు. మనం అంతా బాగానే ఉంది అన్న అపోహ లో ఉంటాము.కానీ అకస్మాత్తుగా ఏ గుండె జబ్బు రూపంలోనో బయట పెడుతుంది.ఇప్పుడు నేను టెస్ట్ లు చేయించుకోమని ఎందుకు చెప్పానంటే, టెస్ట్ రిపోర్ట్ లలో మనకున్న సమస్య ఏంటో తెలిసి పోతుంది కాబట్టి దాని ప్రకారం మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ ఎలా బరువు తగ్గాలనే ఒక ఐడియా మనకు వస్తుంది. అదే కాకుండా భయంతో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాము ఇంక ఆరోగ్యం విషయం లో నిర్లక్ష్యం చేయము. బరువు తగ్గాలనే పట్టుదల పెరుగుతుంది.

రెండోది మీరు ఎంత బరువు ఉన్నారో చూసుకోవాలి. కచ్చితంగా ఒక వెయింగ్ స్కేల్ కొని ఇంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి రోజూ బరువు చూసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ స్కేల్ అయితే మంచిది. బరువు యాక్యురేట్ గా చూపిస్తుంది. ఇది మరీ ఎక్కువ ఖరీదు కూడా ఉండదు. 1000 రూపాయల లోపే ఉంటుంది. దుస్తులు లేకుండా ఒకసారి బరువు చూసుకోవాలి. తర్వాత మీరు నిద్ర పోయేటప్పుడు వేసుకునే దుస్తులను వేసుకొని మళ్ళీ చూసుకోవాలి. ఈ బరువు లో నుండి మీ అసలు బరువు తీసేస్తే దుస్తుల బరువు ఎంత ఉంటుందో తెలుస్తుంది కదా. ఇక అప్పటి నుండి రోజు ఉదయం నిద్ర లేవగానే (మూత్ర విసర్జన చేసిన తరవాత) బరువు చూసుకోవాలి. మీకు చూపించిన బరువు లోనుండి దుస్తుల బరువు తీసేస్తే ఆ రోజు మీరెంత బరువున్నారో తెలిసి పోతుంది. వెంటనే అది ఆ తేది పక్కన నోట్ చేసి పెట్టుకోవాలి.

ఒక పుస్తకం పెట్టుకుని అందులో మీరు మీ ప్రణాళిక ను మొదలు పెట్టిన తేది, ఆ రోజున మీరున్న బరువు నోట్ చేసుకోవాలి. రోజూ తేదీ ప్రకారం మీరు ఆ రోజు ఏమి తిన్నారో, మీకు ఎలా అనిపించిందో మరుసటి రోజు ఎంత బరువు ఉన్నారో ప్రతి రోజు తప్పకుండా నోట్ చేసుకుంటూ ఉండాలి.అప్పుడు మీకు ఏ ఆహారం తిన్నప్పుడు ఎంత బరువు తగ్గుతున్నామనే అవగాహన వస్తుంది.బరువు తగ్గుతూ వస్తున్న విషయాన్ని మీరు నోట్ చేస్తున్న కొద్దీ మీలో ఉత్సాహం, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.ఇంకా శ్రద్దగా ప్రణాళికా నియమాల్ని పాటిస్తారు.అదే పుస్తకంలో మీ టార్గెట్ వెయిట్ ముందే రాసుకొని ఉంచండి. మొదటి పేజిలో మీరు సన్నగా ఉన్నప్పటి ఫోటో ఏదైనా ఉంటే అది అతికించండి. మీరు ఇంతకు ముందు ఎలా ఉండేవారో చూసుకున్నప్పుడల్లా మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకున్నట్లు అవుతుంది.

ఏ ఆహారం తీసుకున్నా స్పూన్ తో తినడం అలవాటు చేసుకోండి. చేత్తో అయితే ఎక్కువ తింటాము.స్పూన్ తో ఎంతైనా కొద్దిగా తక్కువ తింటాము.ఆహారాన్ని బాగా నమిలి చాలా నెమ్మదిగా తినాలి.గబగబా అస్సలు తినకూడదు. మాట్లడుతూనో, టీవీ చూస్తూనో తినకూడదు.అలా తింటే ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తాము. రాత్రి 7.30 నుండి 8 గంటల లోపే భోజనాన్ని ముగించండి.ఎందుకంటే 8 తర్వాత మనం ఎక్కువ పని చేయము కదా.రిలాక్స్ డ్ గా ఉంటాము. తిన్న ఆహారం నుండి విడులైన శక్తి మన శరీరానికి అవసరం లేకపోవడం వల్ల అది కొవ్వుల రూపంలో నిల్వ చేస్తుంది.అందుకే రాత్రి భోజనాన్ని వీలయినంత త్వరగా ముగించండి.

పైన ప్రణాళికలన్నింటిని కష్టమనిపించినా తు.చ తప్పకుండా ఒక వారం రోజులు పాటిస్తే తర్వాత మీకే అలవాటయిపోతుంది :).

అధిక బరువు-మీరు అర్ధం చేసుకోవాల్సిన విషయాలు

Weight loss Telugu Tips Part-1 వెయిట్ లాస్ టిప్స్

కీటో డైట్ ను ఎలా ప్రారంభించాలి?

కీటో డైట్ అంటే ఏమిటి?

Exit mobile version