Site icon Maatamanti

Sprouted Moong Dal Pesarattu Telugu Recipe-పెసరట్టు

sprouted moong dal pesarattu telugu recipe

Sprouted Moong Dal Pesarattu Telugu Recipe with step by step instructions.English Version.

పెసరట్టు ఉప్మా అనేది ఆంధ్రా ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ వంటకం.విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో తెల్లారక ముందే టిఫిన్ హోటల్స్ తెరుస్తారు.వేడి వేడి టిఫిన్లు తెల్లారేసరికి వడ్డించడానికి సిద్ధంగా ఉంటాయి.వేడి వేడి ఇడ్లీలు, దోసెలు, పూరీలు, వడలు, మైసూరు బోండాలు, ఊతప్పం, రవ్వ దోసె, పెసరట్టు ఉప్మా లాంటి టిఫిన్లు నోరూరిస్తుంటాయి.

నా చిన్నప్పుడు మా నాన్న అప్పుడపుడు హోటల్ కి తీసుకెళ్ళి టిఫిన్ తినిపించేవారు.అక్కడికి వెళ్ళాక ఏది చూసినా తినాలనిపించేది.అసలేది ఆర్డర్ చేయాలో అర్ధం అయేది కాదు.పూరీ కూర నా ఫేవరెట్.కానీ దోసె కూడా ఇష్టమే.నాది చిన్న పొట్ట కదా ఎంతని తినగలను.అందుకే ఒక పూరీ నేను తిని ఇంకో పూరీ మా నాన్నకు ఇచ్చేసేదాన్ని.మా నాన్న దోసెలో సగం తీసుకునేదాన్ని.ఇప్పటికీ అంతే చేస్తాను.కాకపొతే మా నాన్న బదులు మా ఆయన తో టిఫిన్ షేర్ చేసుకుంటాను.ఆ విధంగా రెండు మూడు రకాల టిఫిన్స్ టేస్ట్ చేసినట్లు ఉంటుంది.సరిపడిననంత తిన్నట్లు ఉంటుంది.

మా చిన్నప్పుడు సెలవులలో మా నాయనమ్మ గారింటికి వెళ్లి నప్పుడు మా తాత గారు, నాయనమ్మ నేతి పెసరట్టు, జీడిపప్పు నేతి ఉప్మా చేసి అరటి ఆకులో కానీ, బాదం ఆకులో కానీ కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లతో వడ్డించేవారు పిల్లలందరికీ.ఎంత రుచిగా ఉండేదంటే ఆ రుచి వర్ణనాతీతం.తలచుకుంటే ఇప్పటికీ నోట్లో నీల్లూరతాయి.ఫుల్ గా లాగించేసి పొలం లోకి వెళ్లి మామిడి చెట్లకు కాలువలు కడుతూ మధ్యాహ్నం వరకు ఆడుకునేవాళ్ళం.జీవితం చాలా  గొప్పది.అందులో బాల్యం ఒక అద్భుతం.చెడు అయినా  మంచి అయినా బాల్యం తాలూకు జ్ఞాపకాలు మిగిలిన జీవితానికి పచ్చబొట్లు.అవి ఎప్పటికీ చెరిగిపోవు.

పెసరట్టు తో మొదలు పెట్టి పాత కాలానికి వెళ్ళిపోయాను కదండీ.సరే మళ్ళీ పెసరట్టు దగ్గరకు వచ్చేస్తాను.నేను ఈ పెసరట్టును మొలకెత్తిన పెసలతో చేశాను.మామూలు పెసలకన్నా మొలకెత్తిన పెసలలో ఎక్కువ ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి.అంతే కాకుండా అవి సులభంగా అరుగుతాయి.మొలకెత్తిన పెసలని ఉత్తిగా తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు.ఎలాగో కష్టపడి తినడానికి ప్రయత్నిస్తుంటారు.అలాంటివారు ఇలా మొలకెత్తిన పెసర్లతో అట్లు వేసుకుని తినవచ్చు.మీరు కూడా ఈ recipe ని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Poornam Boorelu Recipe in Telugu
Pancake with bread Recipe in Telugu
Dry Fruit Bobbatlu Telugu Recipe
Chinese Egg Noodles Recipe in Telugu
Saggubiyyam Payasam Recipe in Telugu

Click here for the English Version of the Recipe.

Sprouted Moong Dal Pesarattu Telugu Recipe
Prep Time
16 hrs
Cook Time
5 mins
Total Time
16 hrs 5 mins
 
Course: Breakfast
Cuisine: Andhra, Hyderabadi, South Indian, Telangana
Author: బిందు
Ingredients
నానబెట్టుట కొరకు
  • 1 కప్పు పచ్చ పెసలు
  • ½ కప్పు బియ్యం
  • తగినంత నీళ్ళు నానబెట్టుటకు
పిండి కొరకు
  • 1 కప్పు ఓట్స్
  • 1 అంగుళం అల్లం ముక్క
  • 1 పచ్చి మిరపకాయ
  • ½ tsp జీలకర్ర
  • ఉప్పు తగినంత
  • నీళ్ళు తగినంత
స్టఫ్ కొరకు
  • 1 మీడియం ఉల్లిపాయ తరుగు
  • 2 క్యారెట్ ల తరుగు
  • ¼ కప్పు కొత్తిమీర తరుగు
  • ½ అంగుళం అల్లం తరుగు
  • 1 పచ్చి మిరపకాయ తరుగు
  • 1 tsp నూనె
దోసె కొరకు
  • 1 tsp నూనె ఒక్కో దోసెకు
Instructions
నానబెట్టుట మరియు మొలకెత్తించు విధానం
  1. ఉదయాన్నే ఒక కప్పు పచ్చ పెసలను నానబెట్టాలి.
  2. సాయంత్రం వరకు నాననిచ్చి రెండు మూడు సార్లు శుభ్రం గా కడిగి నీళ్ళు పూర్తిగా వొంపేయాలి.
  3. ఒక శుభ్రమైన కాటన్ వస్త్రం లో కానీ జల్లెడ లో కానీ ఉంచి పెసలను మూసేసి రాత్రంతా వదిలేయాలి.
  4. తెల్లవారే సరికి కొద్ది కొద్దిగా మొలకలు వచ్చి కనిపిస్తాయి.
  5. అప్పుడు బియ్యం కూడా 3 నుండి 4 గంటల పాటు నానబెట్టాలి.
  6. బియ్యం నానే సరికి మొలకలు ఇంకొంచెం పెద్దవి అవుతాయి.
పిండి తయారీ
  1. మిక్సీ జార్ లో మొలకెత్తిన పెసలు, నానబెట్టిన బియ్యం, ఓట్స్, అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఉప్పు వేయాలి.
  2. తగినంత నీళ్ళు పోసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్లుగా పిండి రుబ్బుకోవాలి.
  3. ఈ పిండిని పొంగే వరకు ఆగకుండా వెంటనే ఉపయోగించాలి.
పెసరట్టు తయారీ
  1. పెనంలో 1 tsp నూనె వేడి చేసి అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, అల్లం, క్యారెట్, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు వేయించి పక్కన పెట్టేసుకోవాలి.
  2. అదే పెనంలో రెండు గరిటెల పెసరట్టు పిండి పోసి చక్కగా గుండ్రంగా పెనం అంతా పరచుకునేలా తిప్పాలి.
  3. 1 tsp నూనె దోసె చుట్టూరా వేసి చక్కగా రోస్ట్ అయ్యే వరకు కాల్చాలి.
  4. దోసె మధ్యలో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్ తరుగుల మిశ్రమం వేసి దోసెను మడిచి వేడి వేడిగా ఉప్మా తో గానీ, కొబ్బరి చట్నీ తో గానీ, తీపి అల్లం చట్నీ తో గానీ వడ్డించాలి.

Sprouted Moong Dal Pesarattu Telugu Recipe Video

[embedyt] https://www.youtube.com/watch?v=LjjQa1Wv0BU[/embedyt]

 

Exit mobile version