Site icon Maatamanti

మా వ్యవసాయ ప్రయాణం వెనుక కథ ఇదీ

చాలా మంది నన్ను ఎప్పటి నుండో అడుగుతున్న ప్రశ్న, ” మీకు అసలు పొలం కొనాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది??” అని. ఎలా కొనాలి అని చెప్పే ముందు అసలు మాకు ఫార్మ్ కొనాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది. ఆ ప్రక్రియ ఎలా మొదలైంది అనేది చెప్పాలి.  లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది కాస్త ఓపికగా చదవగలరు.

నా చిన్నప్పుడు తెలుగు పాఠంలో ఒక పద్యం ఉండేది “అవని విధీర్ణమైనను, హిమాద్రి యది చలించుట గల్గినన్, మహార్ణవమది ఇంకినన్, రవి చంద్రులు తేజమేగినన్……. కువలయ నాథ నీకొక కుత్సిత భావము కలుగనేర్చునే ” ఇలా ఉండేది. పదాలు సరిగ్గా గుర్తు లేవు. కానీ దాదాపుగా ఇలా ఉండేది. దాని అర్ధం “భూమి విడిపోయినా, పెద్ద మంచు పర్వతం కదిలినా, మహాసముద్రం ఇంకిపోయినా, సూర్య చంద్రులు కాంతిని కోల్పోయినా పర్లేదు కానీ … నీకు ఇలాంటి ఆలోచన మాత్రం రాకూడదు” అని భావం. అందులో మొదటి మాటలు నా మనసులో చాలా లోతుగా పాతుకుపోయాయి…. ఏది ఏమైనా ఎంత కష్టమైనా సరే మన జీవితం మనకు నచ్చినట్లు జీవించాలి. అలా నచ్చినట్లుగా జీవించగలిగితేనే మన పట్ల మనకు ప్రేమ పెరుగుతుంది. మనల్ని మనం ప్రేమించుకోగలిగితేనే  మనము ఇతరుల మీద ప్రేమ, ఆరాధన, కరుణ చూపించ గలుగుతాము. దుఃఖాన్ని, సుఖాన్ని, కన్నీళ్ళని, కష్టాల్ని అన్నింటినీ ఒకేలా స్వీకరించ గలుగుతాము. ఇవన్నీ నా స్వీయ అనుభవంతో తెలుసుకుని మనఃస్ఫూర్తిగా రాస్తున్న మాటలు.

నా చిన్నప్పుడు నా బాల్యం అంతా చాలా అందమైన అటవీ ప్రాంతాల్లో గడించింది. మా అమ్మ తరపు తాత, నాన్న తరపు తాత ఇద్దరూ రైతులే. వేసవి సెలవుల్లో వాళ్ళ దగ్గరకు వెళ్లినా అందమైన పచ్చని పొలాలు. ఇలా నా బాల్యం నుండి 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు అంతా పచ్చని చెట్లున్న ప్రాంతాల్లో పెరగడం వల్ల, నా తల్లిదండ్రులు ప్రకృతి పట్ల చూపించే ప్రేమ వల్ల నాకూ ప్రకృతిని ప్రేమించడం, ఆరాధించడం, ప్రకృతితో మౌనంగా మాట్లాడడం తెలిసింది.

నా కూతురికి కూడా అదే నేర్పించాలి. అందులోని ఆనందాన్ని తనకు కూడా తెలియచేయాలి అని ఎప్పుడూ మనసులో గట్టిగా అనుకునేదాన్ని. సచిన్, నేను  ప్రతి రోజూ ఉదయం కాఫీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకుంటాము. మా ఇంట్లో బట్టలు మేమే ఇస్త్రీ చేసుకుంటాము. బయట ఎవరికీ ఇవ్వము. కాఫీ తాగాక సచిన్ తన ఆఫీస్ బట్టలు ఇస్త్రీ చేసుకుంటుంటే నేను తన పక్కనే కూర్చుంటాను. కబుర్లు చెప్పుకుంటాము. మా పెళ్లయిన దగ్గర నుండి ఇది మా దినచర్య లో భాగం. మా కబుర్లలో మేము మా గురించి మాత్రమే మాట్లాడుకుంటాము. వీటిల్లో ఎక్కువగా మాట్లాడుకునేది రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉండాలి. జీవితాంతం సంపాదన కోసం పరుగులు పెట్టకూడదు. ఒక్కసారి మా అమ్మాయి తన లైఫ్ లో సెటిల్ అయిపోతే ఇంక మాకు సంపాదించాల్సిన అవసరం లేదు. అప్పుడు లైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది అని సచిన్ నన్ను ఎప్పుడు అడుగుతుండేవారు.  “శని ఆదివారాలు ఇలా వృథాగా గడపడం నాకు నచ్చడం లేదు. ఏదో ఒకటి చేయాలి కానీ ఏమి చేయాలి” అని సచిన్ ఎపుడూ అంటుండేవారు నాతో.

మన  రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉండాలి అని నేను తనను అడిగితే ” నువ్వు వేరే ఊర్లకు టూర్ కి రమ్మంటే రావు. ఎంత మంచి నీట్ గా ఉన్న ప్లేస్ లో రూమ్స్ బుక్ చేస్తాను అన్నా రావు. అందుకే మనం ఒక పాత Force వెహికల్ కొనుక్కుని దాన్ని  Caravan గా modify చేయించుకుని అందులోనే చిన్న కిచెన్, బాత్రూమ్, TV  , బెడ్స్ ఉండేలా చేయించుకుందాము. దేశం మొత్తం కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అందులో చుట్టి వద్దాము.” అనేవారు.( దానికి సంబంధించిన background వర్క్ ఆల్రెడీ ఒక సంవత్సరం నుండి మొదలయిపోయింది అనుకోండి అదే వేరే విషయం). అదే ప్రశ్న తను నన్ను అడిగితే  ప్రతిసారీ  నేను  ” పచ్చని చెట్ల మధ్య చిన్న కుటీరం లాంటి ఇల్లు ఒకటి, 1 కుక్క పిల్ల, ఓ నాలుగు కోళ్లు, 1 ఆవు, నాలుగు కూరగాయ మొక్కలు ఉంటే చాలు” అని చెప్పేదాన్ని. నా మనసుకు అద్దంలా, నా భావాలకు రూపం లా “మిథునం” సినిమా తీశారు. ఆ సినిమా ను  నేను మా ఆయన కలిసి ఎన్ని సార్లు చూశామో, ఏడ్చామో  చెప్పలేను. అక్షరాలా లక్షణంగా అదే మేము కోరుకున్న జీవితం.

కానీ అదంతా మా రిటైర్మెంట్ తర్వాత జరగాలి అనుకున్నాము. మనము మనసులో ఏదైనా మంచి జరగాలి అని గట్టిగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పే లాంటి ఒకటి జరిగింది. 2016 సంవత్సరం మే, జూన్ నెలల్లో సచిన్ ఆఫీస్ పని విపరీతంగా ఉంది. ఎంత అంటే ఆ రెండు నెలలు శని ఆదివారాలు కూడా రోజంతా అక్కడే ఉండి పనిచేసేంత. మా అమ్మాయికేమో వారంలో ఒక రోజైనా వాళ్ళ నాన్నతో కలిసి బయటకు వెళ్లడం అలవాటు. నేనెప్పుడూ బయటకు సరదాగా వెళ్లి వద్దాము అంటే అస్సలు వెళ్లేదాన్ని కాదు. నేను రాను అనేసరికి వాళ్ళు వెళ్లకుండా ఆగిపోయేవారు. ఒక్కోసారి గొడవ కూడా అయ్యేది మా మధ్య. నీ వల్ల మేము ఎక్కడికి వెళ్లలేకపోతున్నాము అనేవారు. నాకేమో ఆ షాపింగ్ మాల్స్, రోడ్ల మీద క్రిక్కిరిసి ఉండే వాహనాలు జనాలను చూస్తే అస్సలు ఊపిరాడదు. తర్వాత చెప్పేశాను నేను రాను నా గురించి ఆగకండి మీకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళండి అని. సచిన్ మా అమ్మాయిని తీసుకుని బాస్కెట్ బాల్ ఆడడానికి వెళ్లేవారు. ఒక్కో వారం పుల్లెల గోపీచంద్ అకాడమీ  లో మా అమ్మాయిని స్విమ్మింగ్ కి తీసుకెళ్లేవారు. ఒక్కోసారి బాడ్మింటన్ ఆడేవారు.

ఆ సంవత్సరం మే, జూన్ నెలలు మొత్తం మా అమ్మాయిని బయటకు తీసుకెళ్లలేదు. నన్ను తీసుకెళ్లమని అడిగేది నేను రాను అని తెలిసినా. జూలై నెల సగం అయ్యేసరికి ఆ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యి కాస్త పని ఒత్తిడి తగ్గింది సచిన్ కి. ఇక వచ్చే శనివారం ఆఫీస్ కు వెళ్లనవసరం లేదు. కాస్త మా అమ్మాయిని బయటకు తీసుకెళ్లవచ్చు..ఈసారి నేను కూడా వెళ్ళాలి అనుకున్నాను. కానీ సచిన్ శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చాక “నేను నా ఫ్రెండ్ తో కలిసి దగ్గర్లో ఉన్న వేరే ఫ్రెండ్ ఊరు వెళ్ళాలి. అక్కడ వాళ్ళ ఊర్లో పొలంలో ఇల్లు ఏదో షెడ్ లు వేశారట. అవి చూడడానికి రమ్మన్నాడు. ఖచ్చితంగా వెళ్ళాలి” అన్నారు. నాకు విపరీతంగా కోపం వచ్చింది. “దొరక్క దొరక్క మళ్ళీ శెలవు దొరికింది. ఆ రోజు కూడా నువ్వు ఇలా వెళ్తే ఎలా” అన్నాను. తనకు అసలు మమ్మల్ని వదిలి బయట ఫ్రెండ్స్ తో తిరిగే అలవాటు లేదు. ఒక్కసారి కూడా వెళ్ళరు.

అలాంటిది ఆ రోజు ఎందుకో నాకు ఇష్టం లేకపోయినా “తొందరగా వచ్చేస్తాను అనవసరంగా అలగకు” అని చెప్పి వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు వచ్చారు.  నా కోపం ఇంకా ఎక్కువైంది. తల తిప్పి మొహం కూడా చూడలేదు.  తను పిలుస్తున్నా పలకలేదు. సరే నువ్వు నాతో మాట్లాడొద్దు నా మొహం చూడొద్దు ఒకసారి ఇది చూడు అని తన సెల్ లో తీసిన ఒక వీడియో నా ముందు ఉంచారు. చిట్లించిన మొహం తోనే వీడియో చూడడం మొదలు పెట్టాను. ముందు సచిన్ తన ఫ్రెండ్ మాట్లాడుకుంటూ కనిపించారు. తర్వాత కెమెరా కొద్దిగా కదలాగానే పచ్చని మొక్కలు, టమాటో మొక్కలు కనిపించాయి. నాకు తెలీకుండానే నా ముఖం శాంతంగా మారిపోయింది. ఇంకో నిమిషానికి చెప్పలేనంత సంతోషం. ఇది మా అమ్మాయి ఇప్పటికీ గుర్తు చేస్తూ ఉంటుంది.

సచిన్, సచిన్ ఫ్రెండ్ కలిసి వెళ్లిన ఆ పొలం వాళ్ళిద్దరి ఆఫీస్ కోలిగ్ ది. వాళ్ళకి అక్కడ 50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వారసత్వ భూమి. అందులో తను పాలీహౌస్ షెడ్స్ రెండు వేయించారు. వాళ్ళ కుటుంబం ఉండడానికి ఇంకో ఇల్లు farm house లాంటిది కట్టించారు. ఆ రోజు తను అసలా షెడ్లు ఎలా వేయించిందీ, అందులో ఎలాంటి పంటలు పండుతాయి? ఏంటి అనేది కొంత చెప్పారు ఆ వీడియో లో. నేను ఆ వీడియో చూసిన వెంటనే సచిన్ వైపు తిరిగి “ప్లీజ్ రేపు ఆదివారం కదా నన్ను అక్కడికి తీసుకెళ్లవా” అని అడిగాను. ” నువ్వు నన్నేమి తీసుకెళ్లమని అడగనవసరం లేదు. నేను రేపు ఫ్యామిలీ తో కలిసి వస్తాను” అని ఆల్రెడీ మా ఫ్రెండ్ తో చెప్పేశాను” అన్నారు. ఇక ఆ రోజు రాత్రి నిద్ర లేదు. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూశాను.

పొద్దున్నే లేచి త్వరగా బయలుదేరి వెళ్ళాము. మేము ఇంకా సచిన్ తో పాటు వెళ్లిన ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. వెళ్ళగానే అక్కడ ఎంతో నచ్చింది. వెళ్లే దారి మొత్తం అడవి. ఓ నాలుగు సార్లు వర్షం పడడంతో మొత్తం పచ్చగా, ఆకాశం మబ్బుగా ఉంది. సచిన్ ఫ్రెండ్ మళ్ళీ నాకు కూడా చెప్పారు..అసలా పాలీ హౌస్ షెడ్ ఎలా కట్టారు. ఎంత కష్టపడిందీ అన్నీ చెప్పారు. ఒక్క షెడ్ కి అయిన ఖర్చు 40 లక్షలు అని  చెప్పారు. “అందులో గవర్నమెంట్ 75 % సబ్సిడీ ఇస్తుంది. మనం 25% పెట్టుకోవాలి. ఆ సబ్సిడీ అమౌంట్ రిలీజ్ అవ్వడానికి లేట్ అవుతుంటే మొత్తం నేను స్వయంగా ఖర్చు పెట్టి కట్టించాను” అని చెప్పారు.

సరే ఇంటికి వచ్చాము. “ఎలాగైనా మనం కూడా అలాంటి షెడ్ కట్టాలి. అందులో మొక్కలు పెంచాలి” అన్నాను సచిన్ తో.  ఆయనేమో ఉత్తి షెడ్ కట్టడానికే 40 లక్షలు అన్నాడు. మన దగ్గర స్థలం కూడా లేదు ఎలా అన్నారు. నాకు మా అమ్మ నుండి నాన్న నుండి వారసత్వంగా వచ్చిన పొలాలు వేరే ఊర్లలో ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్లి అలా చేయాలి అంటే కుదరదు కదా. అంటే ఇప్పుడు ముందు ఇక్కడ మా సొంతగా పొలం కొనాలి. కనీసం మూడు ఎకరాలన్నా కొనాలని మా ఆలోచన.

పొలం వెతకడం ఆ మరుసటి వారం నుండే మొదలు పెట్టాము. సచిన్ కొలీగ్ పొలం పక్కన ఆనుకుని ఉన్న పొలం చాలా ఎక్కువ ధర ఉంది. అందుకే అది వద్దులే అనుకున్నాము. ఆయనకేదైనా తెలిస్తే చెప్పమని అడిగాము. తాను కూడా అప్పటి వరకు ఆ ఊర్లో లేరు కాబట్టి నాక్కూడా పెద్దగా ఎవరూ తెలీదు” అని చెప్పారు. అసలాయన వాళ్ళ పొలానికి పిలిచి అది చూపించడమే ఎక్కువ ఇంకా ఎక్కువ అడిగి ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాము. అక్కడ మరే బ్రోకింగ్ ఏజెంట్స్ తెలీదు మాకు. ఎవర్ని అడగాలో తెలీదు. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. కానీ ఈ ఏజెంట్స్ ఎక్కువగా టీ దుకాణాల వద్ద, కిళ్లీ కొట్టుల దగ్గర ఉండచ్చేమో అనే భావనతో ఆ ఏరియా లో కనిపించిన ప్రతీ టీ కొట్టు దగ్గర బండి ఆపడం ఇక్కడేవైనా పొలం అమ్మకానికి ఉన్నాయా” అని దుకాణ దారుని అడగడం. అలా కొన్ని చోట్ల అడిగాక ఒకతను అదుగో అక్కడ నాకు తెలిసిన బ్రోకర్ ఒకతను ఉన్నాడు. తనను అడగండి” అని చెప్పాడు.

అలా మొదలైంది మా వెతుకులాట. కొన్ని పొలాలు మేము ఊహించిన దాని కంటే తక్కువకే చూశాము. కానీ అక్కడ పండిన పంటని మార్కెట్ కి తీసుకెళ్లడానికి అసలు దారి లేదు. రోడ్ లేదు. పక్క పక్కనే అనుకుని వేరే పొలాలు ఉన్నాయి. అలా అయితే కష్టం అని వద్దు అనుకున్నాము. ఇలా నెల రోజుల పాటు వారంలో కనీసం 4 రోజులు సచిన్ ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరూ వెతకడానికి వెళ్లి వస్తూనే ఉన్నారు. శని ఆదివారాలు పూర్తిగా వెతకడానికి వెళ్లేవారు. మాములు రోజుల్లో ఉదయాన్నే లేచి వెళ్లి చూసి మళ్ళీ అటు నుండి అటే రింగ్ రోడ్ మీదుగా 11 గంటలకల్లా ఆఫీస్ కి వెళ్ళిపోయేవారు. ఒక శనివారం రోజు సచిన్ నాకు ఫోన్ చేసి “ఇప్పుడే ఒక పొలం చూశాను. అరకు లో లాగ అందంగా ఉంది. ఒక పక్క కొండ దాని మీద అడవి ఉంది నువ్వు చూస్తే ఇక్కడి నుండి రావు. కాకపోతే బాగా విపరీతంగా ఎత్తు పల్లాలు ఉన్నాయి. మనం అనుకున్న షెడ్లు వేయాలి అంటే ల్యాండ్ అంతా లెవెల్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది” అన్నారు. అదే రోజు ఇంకోటి కూడా చూశారు.

మరుసటి రోజు ఆదివారం “నీకు ఇవాళ రెండు పొలాలు చూపిస్తాను. వాటిలో నీకు ఏది నచ్చితే అది ఫైనల్” అన్నారు. వెళ్ళాము. ఫస్ట్ ఆ అరకు లా ఉన్న పొలానికి వెళ్దామన్నాను. అది చూశాక “వేరే పొలం చుట్టూ ఏమి ఉంటుంది” అని అడిగాను. “ఒక వైపు ఊరు, మూడు వైపుల ఆనుకుని వేరే వాళ్ళ పొలాలు ఉంటాయి” అని చెప్పారు. అప్పుడు నేను “ఇంక అది చూడాల్సిన అవసరం లేదు ఇదే ఫైనల్ చేద్దాం” అన్నాను. సచిన్ కి కూడా మనసులో అదే నచ్చింది.  అందువల్ల ఆ రోజే అప్పుడే కొంత అడ్వాన్స్ ఇచ్చి ఒక టెంపరరీ అగ్రిమెంట్ రాయించుకున్నాము. రిజిస్ట్రేషన్ కి నెల రోజులు గడువు ఉండేలా చూసుకున్నాము. ఆ పొలం 3 ఎకరాల 17 గుంటలు. అదే రోజు ల్యాండ్ సర్వే కూడా చేయించాము. వారు చెప్పినంత విస్తీర్ణం ఉందా లేదా అని తెలుసుకోవడానికి.

“అడ్వాన్స్ అయితే ఇచ్చాము ఇంకా డబ్బు కావాలి అసలెలా ” అనుకున్నాము. ఆ క్షణాన మా దగ్గర ఉన్న సేవింగ్స్ డబ్బుకి ఒక్క ఎకరం మాత్రమే వస్తుంది. వెంటనే ముందు గుర్తుకొచ్చింది బంగారం. నేనెటూ పెద్దగా ఏమీ వేసుకోను. అనవసరంగా అవి లాకర్ లో మురిగే కన్నా తాకట్టు పెడితే బాగుంటుంది అనుకున్నాము.

నేను మా ఆయన్ను బంగారం కొను ఆ గొలుసు కావాలి ఈ నెక్లెస్ కావాలి అని ఒక్కసారి కూడా అడగలేదు. ఎప్పుడైనా కాస్త డబ్బు పోగై పద ఏదైనా గోల్డ్ కొందాము అని మా ఆయన అంటే అది నాకొద్దు దాని బదులు కెమెరా కొను, లెన్స్ కొను, లేదా కంప్యూటర్ కొను” అని అడిగేదాన్ని. “అసలు నీలాంటి ఆమెని నేనెక్కడా చూడలేదు తల్లీ ఎవరైనా బంగారం కొనిస్తాను అంటే ఎగిరి గంతేస్తారు నువ్వేమో తేడాగా ఇలాంటివి అడుగుతావు. నువ్వు కోరుకుంటేనే నీకు బంగారం వస్తుంది. వద్దు అనుకుంటే లేకుండా పోతుంది” అనేవారు. కానీ ఆ రోజు మొదటిసారి తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్న రోజు నాకు బంగారం ఎందుకు ఇంపార్టెంట్ అనేది బాగా తెలిసొచ్చింది. నేను వేసుకున్నా వేసుకోకపోయినా ఇంకెప్పుడూ బంగారాన్ని వద్దు అనుకోకూడదు అని ఆ రోజు అనుకున్నాను.

కొంతేమో వేరే పొలాల మీద వచ్చిన కౌలు తాలూకు డబ్బు మేము 3 ఇయర్స్ నుండి మాకు అవసరం రాలేదు కాబట్టి ముట్టుకోలేదు. అప్పటికి అవి నా పేరు మీద రాసి కూడా 5 ఇయర్స్ అయింది. నా నుండి సంక్రమించినదేది వాడడానికి సచిన్ ఇష్టపడరు. అప్పుడు వాడడానికి చాలా బ్రతిమాలాడాల్సి వచ్చింది. ఇంకొంత  పర్సనల్ లోన్ తీసుకొన్నాము. మొత్తానికి ఎలాగోలా పొలం కొనడానికి కావాల్సిన డబ్బు సమకూరింది.

ఆ అమ్మే అన్నదమ్ములు లంబాడీ తెగ కు చెందినవారు. వారికి ఆ పొలమే కాకుండా ఇంకా వేరే పొలాలు కూడా ఉన్నాయి. చెల్లి పెళ్లి చేయడానికి అమ్ముతున్నాము అన్నారు. పైగా మాకు అమ్మాలి అనుకున్న పొలం మీద ఆల్రెడీ ఐసీఐసీఐ బ్యాంకు లో 3.50 లక్షలు లోన్ తీసుకున్నారు. మేము ఆ పొలం కొనాలి అంటే ముందు వారు బ్యాంకు కి ఆ బాకీ చెల్లించాలి. కానీ వారి దగ్గర ఆ డబ్బు లేదు. మేము ఇచ్చే డబ్బుతోనే చెల్లించాలి. వాళ్ళ చేతికి ఇస్తే మళ్ళీ బ్యాంకు కు ఇచ్చే లోపల ఏదైనా అవసరం వస్తే వాడేస్తారేమోననే భయంతో మేమే ఆ బ్యాంకు కు వెళ్లి అక్కడ ఆఫీసర్ తో మాట్లాడి, ఆ లోన్ బాకీ చెల్లించి డాక్యూమెంట్స్ విడిపించి, ఆ డాక్యుమెంట్ పై బ్యాంకు వారి రిజిస్ట్రేషన్ కాన్సల్ చేయించి మా దగ్గర పెట్టుకున్నాము. అది కాకుండా ఇంకొంత మొత్తం వాళ్లకు అర్జెంటు పెళ్లి ఖర్చుల కోసం కూడా ఇచ్చాము. వారికి డబ్బు ఇచ్చిన ప్రతి సారి సాక్ష్యం కోసం వీడియో తీశాము. వాళ్ళతో మాట్లాడిన ప్రతీ ఆడియో రికార్డు చేశాము. అవన్నీ ఇప్పటికీ అన్నీ భద్రంగా దాచాను.

1953 వ సంవత్సరం నుండి పహాణీ/అడంగల్  కాపీ లు మండల ఆఫీస్ నుండి సేకరించాము. ROR/ఫారం-1బి తీసుకున్నాము. ఇలా ఒక ల్యాండ్ కొనడానికి ఎటువంటి డాక్యుమెంట్ లు వెరిఫై చేసుకోవాలి అనేది క్షుణ్ణంగా తెలుసుకుని మరీ రెడీ గా పెట్టుకున్నాము.

ఈలోపు మాకు తెలిసిన వారెవరో “అసలు ట్రైబ్స్ దగ్గర ల్యాండ్ కొనకూడదు. కొన్నా అది చట్ట రీత్యా వర్తించదు” అని చెప్పారు. మాకు గుండెల్లో బాంబ్ పేలినట్లయింది. అసలారోజంతా మేము తిండి తినలేదు నిద్ర పోలేదు. దాదాపు సగం డబ్బు ఇచ్చేశాము. ఇప్పుడు అది తిరిగి కూడా రాదు. ఇదేమి ఖర్మ అని ఇద్దరం బాగా బాధపడ్డాము. సచిన్ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య హై కోర్ట్ లాయర్. ఆయన చాలా ఫేమస్. అసలాయన తో మాట్లాడాలి అంటేనే ఖర్చు అవుతుంది. అలాంటిది ఆయన సచిన్ దగ్గర ఏమి తీసుకోకుండా ఆ ల్యాండ్ డాకుమెంట్స్ మొత్తం బాగా పరిశీలించి ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు. తీసుకోండి అని చెప్పాక కానీ మా మనసు కుదుట పడలేదు. ఎటువంటి సమస్య ఎందుకు రాలేదు అంటే అది వారికి ప్రభుత్వం వారు ఇచ్చిన భూమి కాదు కాబట్టి.

సరే ఇక అంతా ఒకే రిజిస్ట్రేషన్ ఆగస్టు 12 శ్రావణ శుక్రవారం రోజు పెట్టుకున్నాము. ఇంకా 15 రోజులు గడువు ఉంది. ఈలోపు మాకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. మీరు ఆ ల్యాండ్ కొనడానికి వీలు లేదు. కొంటే ఏమవుతుందో మీరే చూస్తారు అని కాల్ లు వచ్చాయి. ఎవరో తెలీదు unknown నెంబర్. బట్ మాకు తెలిసింది ఏంటంటే ఎవరో బాగా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి తాలూకు వ్యక్తి. అతను మాకే కాకుండా వేరే వాళ్ళతో కూడా వాళ్లని కొనద్దని చెప్పు అని మాకు చెప్పించాడు. బహుశా మేము కొనాలి అనుకున్న ల్యాండ్ ని అతను తనకు తెలిసిన వాళ్ళకి తక్కువ ధరకి ఇప్పిస్తాను అని ప్రామిస్ చేసి ఉంటాడు.

నేను సచిన్ అస్సలు ఏమాత్రం భయపడలేదు. ఏమి చేస్తాడో చూద్దాం. మనం చట్ట ప్రకారం వెళ్తున్నాము. నిజాయితీ గా ఉన్నాము. ఈ రెండు చాలు అలాంటి పేడ పురుగుల్ని తొక్కి పెట్టడానికి అనుకున్నాము. మేము ఇద్దరం పెద్దలకు తెలీకుండా వివాహం చేసుకోవడం వల్ల ఒక  సంవత్సరం పాటు వారి నుండి దూరం అయ్యము. తరువాత వాళ్ళు మాతో మాట్లాడడం మొదలు పెట్టినా మేము వారి దగ్గర నుండి ఎటువంటి ఆర్ధిక సహాయం తీసుకోలేదు. ఇద్దరం కలిగిన కుటుంబాల్లోనే పుట్టాము. కష్టం అంటే ఏంటో తెలీకుండా పెరిగాము. కానీ మాకు 21 సంవత్సరాల వయసులో పెళ్లి. ఇద్దరిదీ ఒకే వయస్సు. లోకం అంటే తెలీని వయసులో జీవితం ప్రారంభించాము. దాదాపు 8 సంవత్సరాలు చాలా చాలా చాలా కష్టాలు పడ్డాము. బట్ మా ఇద్దరికీ ఎంత ఆత్మాభిమానం అంటే చచ్చిపోయినా పర్లేదు కానీ ఎవరినీ యాచించకూడదు. తల్లిదండ్రులనైనా చివరికి దేవుడినైనా. ఇది మా నియమం. “ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే భార్యా భర్తలిద్దరూ కొట్టుకోకూడదు. వాళ్లిద్దరూ కలిసి ఒకటిగా ఉండి ఆ ప్రాబ్లెమ్ ను తరిమి కొట్టాలి” ఇది మాకు మేము విధించుకున్న నిబంధన , మేము పాటించిన సూత్రము , మా ప్రగతికి కారణము. ఆ 8 సంవత్సరాలలో పడుతూ లేస్తూ,మోసపోతూ వచ్చాము. కొన్ని నెలల పాటు కేవలం పచ్చడి అన్నం మాత్రమే తిన్న రోజులు ఉన్నాయి. నా కూతురుకు 106 జ్వరం వస్తే హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి 100 rs కూడా లేని రోజును మేము చూశాము. ఆ రోజు నా బిడ్డ చనిపోతుంది అనుకున్నాను. అసలెవరికీ చెప్పలేదు. అయినా ఎవర్నీ రూపాయి అడగలేదు. కానీ చివరికి మా ఇద్దరి తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకునే స్థాయికి చేరుకున్నాము. మా ఇద్దరిలో అంతులేని ఆత్మ విశ్వాసం, దేనినైనా ఎదుర్కోగల ధైర్యం నిండుగా ఉన్నాయి. అందువల్ల ఆ బెదిరింపు కాల్ మమ్మల్నిఏమాత్రం  భయపెట్టలేకపోయింది.

చివరికి నర్సాపూర్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్ళాము. అక్కడ కూడా ఆ ఫోన్ కాల్ వచ్చింది. చాలా మంది జనాలు ఉన్నారు. లేట్ అయిపోతుంది. సంతకాలు పెట్టడం కోసం ఆ ఇద్దరు అన్నదమ్ములే కాకూండా భార్యా పిల్లలు, తల్లీ తండ్రిని కూడా తీసుకెళ్ళాము. అక్కడ లేట్ అవుతుంది అని సంగారెడ్డి రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్ళాము. అప్పుడు మెదక్ జిల్లా పరిధి లో రెండు రిజిస్ట్రార్ ఆఫీస్ లు ఉండేవి. అప్పటికింకా సంగారెడ్డి మెదక్ జిల్లాలో భాగం గానే ఉంది. పెద్ద వర్షం లో మళ్ళీ వీళ్లందరినీ పెద్ద ఆటో లో అక్కడికి తీసుకెళ్లి సాయంత్రానికి రిజిస్ట్రేషన్ పని పూర్తి చేయించాము. విచిత్రంగా మాకు ఆ తర్వాత ఫోన్ కాల్ రాలేదు. వస్తే అప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేద్దాము అనుకున్నాము కానీ రాలేదు. ఆ పని అంతా సాఫీగా జరిగాక ఒక తృప్తి.

ఇక్కడితో అయిపోలేదు…ఇప్పుడు అసలు పని మొదలయింది …కొన్న పొలాన్ని ఒక షేప్ కు తేవడం….అది మాములు విషయం కాదు. అదంతా నేను మీకు పొలం ట్రాన్స్ఫర్మేషన్ వివరిస్తూ యూట్యూబ్ లో ఒక వీడియో పెడతాను. పొలం కొని దాన్ని ఒక షేప్ కు తేవడానికి మాకు అయిన మొత్తం ఖర్చు సుమారుగా 40 లక్షలు. నేను పైన రాసింది అంతా నాకు వీడియో లో చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే నా వ్యూయర్స్ అందరికీ ఇది తెలుసుకోవాలని లేకపోవచ్చు. ఇది మాటల్లో చెప్పాలి అంటే చాలా సేపు పడుతుంది. నాకేమో ఏదైనా చెప్తే పూర్తిగా చెప్పే అలవాటు. తలా తోకా లేకుండా చెప్పలేను. అందుకే ఇలా పోస్ట్ రాశాను. ఇప్పుడేదో పొలం వీడియోస్ లో అటూ ఇటూ తిరుగుతున్నట్లు అంతా హ్యాపీగా ఉన్నట్లు చూసేవారికి అనిపిస్తుంది. కానీ దాని వెనుక మేము పడిన శ్రమ నిజంగా మాకు మాత్రమే తెలుసు.

అంత చేశాక అక్కడ ఆ ప్లేస్ కి ఒక కళ వచ్చింది. మేము పొలం కొన్నప్పుడు మెయిన్ రోడ్ మీద నుండి మా పొలానికి మట్టి దారి ఉండేది. సరిగ్గా 2 నెలల్లో bT రోడ్ వేశారు. అసలా స్థలం ఉంది అని కూడా తెలీని వారు అక్కడకు రావడం మొదలు పెట్టారు. మేము వెళ్లిన ప్రతీ సారి వీకెండ్స్ లో జనాలు ఎక్కడెక్కడి నుండో కార్లలో వచ్చేవారు. డెవలప్ చేసిన మా ల్యాండ్ చూపించి ఆ ఊరి వారు ఆ పక్క పక్కనే ఉన్న ల్యాండ్ లను మంచి రెట్టింపు ధరలకు అమ్ముకున్నారు. అందరు ట్రాక్టర్ లు జేసీబీ లు కొనుక్కున్నారు. అప్పటిదాకా పని కోసం 20 kms బస్సు లో వెళ్లి విత్తనాల కంపెనీ లో పనిచేసే ఆడవారికి మా పొలంలో పని దొరికింది. మాకు పొలం అమ్మిన అతను కూడా తానే స్వయంగా వచ్చి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. మీకు నా పొలం అమ్మాక నా కష్టాలు అన్నీ పోయాయి. నేను హ్యాపీ గా ఉన్నాను అని చెప్తాడు.

వ్యవసాయ భూమి ఎలా కొనాలి??ఎక్కడ కొనాలి??అనేది ఇక్కడ రాశాను.చదవగలరు.

 

Exit mobile version