Maatamanti

Mahanati Telugu Movie Review-మహానటి సినిమా సమీక్ష

Mahanati Telugu Movie Review

నటీ నటులు:కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, నరేష్, షాలిని పాండే, భానుప్రియ, దివ్య వాణి తదితరులు.
సంగీతం : మిక్కి జె మేయర్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ : డానీ
ఆర్ట్ డైరెక్టర్ : కొల్లా అవినాష్
ప్రొడ్యూసర్ : ప్రియాంక దత్, స్వప్నా దత్
దర్శకత్వం : నాగ్ అశ్విన్

కథ:

ఓ పత్రికా ఆఫీసులో జర్నలిస్ట్ గా పనిచేసే మధురవాణికి(సమంత) మంచి గుర్తింపు నిచ్చే ఆర్టికల్స్ రాయాలని తనేంటో నిరూపించుకోవాలని కోరిక. ఒక రోజు సావిత్రి గారి కోమా వార్తను కవర్ చేయమని ఆ పత్రికా సంపాదకుడు(తనికెళ్ళ భరణి) మధురవాణికి పురమాయిస్తాడు. “ఇందులో రాయడానికేముంది” అని ఫోటోగ్రాఫర్ అంటోనీ(విజయ్ దేవరకొండ) తో కలిసి అయిష్టంగానే అక్కడికి వెళ్తుంది.

వారు సావిత్రి గారి ఇంటికి వెళ్ళాక ఆవిడ గురించిన ఆసక్తి కరమైన సమాచారమేమీ దొరక్క ఎలానా అని ఆలోచిస్తుంటారు. ఇంతలో వారు సావిత్రి గారి ఇంటి లోపలకు రాకుండా గేటు మీదే  పుష్ప గుచ్చాన్ని వదిలి వెళ్తున్న ఒక వ్యక్తిని(నరేష్) చూస్తారు. ఆయనను అనుసరిస్తే ఏదైనా సమాచారం దొరకవచ్చు అనే ఉద్దేశ్యం తో అతనిని అనుసరించి వెనుకే వెళ్తారు. ఆయన ఒక ఫోటో స్టూడియో లోకి వెళ్తారు. వారు కూడా లోపలి వెళ్తారు. “సార్! సావిత్రి ఇంటి దగ్గర మిమ్మల్ని చూశాను” అంటుంది మధురవాణి. “ఎవరిల్లు?” అంటాడు ఫోటో స్టూడియో ఆయన. ” అదే సినిమా యాక్టర్ సావిత్రి” అంటుంది. “నాకు సావిత్రి తెలీదు. సావిత్రి గారు మాత్రమే తెలుసు” అంటాడు ఫోటో స్టూడియో ఆయన. ” సారీ! సావిత్రి గారు” అని నొచ్చుకున్నట్లుగా  తల వంచుకుని అంటుంది మధురవాణి.

అప్పుడు “పెద్దవాళ్ళని గౌరవించాలి. సావిత్రి గారిని పెద్ద వాళ్ళు కూడా గౌరవించాలి” అని అంటాడు స్టూడియో ఆయన. “మరి మీరు కనీసం ఇంటి లోపలి కూడా రాకుండా వెళ్ళిపోయారు?” అని ప్రశ్నిస్తున్నట్లుగా అంటాడు ఆంటోనీ. ” తట్టుకోలేనేమోనని” అంటాడు స్టూడియో ఆయన. “అయినా మీరెవరు?” అంటాడు. “ప్రజావాణి పత్రిక నుండి వచ్చాం.సావిత్రి గారి కథ రాయడానికి” అని చెప్తారు. ” ఆమెను గురించి రాయడానికి మీకేం అర్హత ఉంది” అని అంటాడు స్టూడియో ఆయన.

“కథ రాయడానికి అర్హత ఎందుకండీ” అంటుంది మధురవాణి. “కథ రాయడానికైతే అవసరం లేదు కానీ వ్యక్తిత్వం గురించి రాయడానికి మాత్రం అర్హత ఉండాలి” అంటాడు స్టూడియో ఆయన. “అర్హత సంపాదించుకుని రాస్తాను.ఆమె గురించి మీకు తెలిసింది చెప్పమని” అర్థిస్తుంది మధురవాణి.

25 సంవత్సరాల క్రితం వాహిని స్టూడియోస్ లో తను మొదటి సారి సావిత్రమ్మ గారిని కలిసిన విషయం చెప్తాడు. “10 రూపాయలు ఉంటే అర్థ రూపాయి ఇవ్వడానికి ఆలోచించే ఈ రోజుల్లో ఆమె తన అవార్డులను అమ్మి నాకు సాయం చేశారు” అని చెప్పి సావిత్రి గారు తనకు చివరిగా రాసిన ఉత్తరం బయట పెడతాడు స్టూడియో ఆయన.  ఉత్తరం రాసిన తేది చూసి “మే 11 అంటే సరిగ్గా సంవత్సరం క్రితం సావిత్రి గారు కోమాలోకి వెళ్ళిన రోజు. ఉత్తరం చదవొచ్చా” అని అడుగుతుంది మధురవాణి.అంగీకరిస్తాడు స్టూడియో ఆయన.

ఆ ఉత్తరంలో సావిత్రి గారు ” ఒకసారి శంకరయ్య దగ్గరకి వెళ్లి వస్తాను. సతీష్ కూడా కలిసినట్లు ఉంటుంది.ఆయనే అంతా చూసుకుంటాడని నమ్మకం ఉంది” అని రాస్తారు. ఆ విషయమే మధురవాణి పత్రికా సంపాదకునికి చెప్తుంది. ఆయన “అసలు శంకరయ్య అంటే ఎవరు? దర్శకుడా? యాక్టరా? అభిమానా? అప్పులోడా? అసలా కథేంటో తెలుసుకో” మని మధురవాణి కి కాకుండా ఒక సీనియర్ జర్నలిస్ట్ కి పురమాయిస్తాడు.

దీంతో మధురవాణి డీలా పడిపోతుంది.అప్పుడు ఆంటోని “కథను ప్రేమించాలి. ఎవరు అవునన్నా కాదన్నా ఆ కథ నీదే. నువ్వే రాయాలి” అని ఆమెను ప్రోత్సహిస్తాడు. అలా శంకరయ్య ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో సావిత్రి గారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది. తనని తాను కూడా తెలుసుకుంటుంది మధురవాణి.

విశ్లేషణ:

ఇప్పటి వరకు చాలా మంది జీవితాలను సినిమాలుగా మలచి ఉండవచ్చు. కానీ సావిత్రమ్మ గారి జీవితాన్ని సినిమా గా మలచడం అన్నది చాలా గొప్ప సాహసం తో కూడుకున్న విషయం. అందుకు దర్శకుడు నాగ అశ్విన్ గారిని ఆయనకు సహకరించిన సినిమా యూనిట్ ని మనస్ఫూర్తిగా అభినందించాలి.

సినిమా చూస్తున్నంత సేపు మనం మన ఉనికిని మర్చిపోయి సావిత్రి గారి తో పాటు ఆ కాలంలో అక్కడే ఉన్న ఫీల్ ని కలగజేస్తుంది. సావిత్రి గారి పాత్రకు కీర్తి సురేష్ గారిని ఎంపిక చేసుకోవడం, పాత్రకి తగ్గట్లుగా ఆమే సావిత్రి గారా అన్నంతగా ఆ పాత్రలో ఒదిగి పోవడం, ఎక్కడా చిన్న లోపం కూడా లేకుండా ఒక్క చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా ఆ కాలాన్ని తలపించేలా సెట్లు వేయడం, దుస్తులు, ఆభరణాలు, మేకప్(ముఖ్యంగా కీర్తి సురేష్ గారి మేక్ అప్), ఇతర నటీ నటులు, సంగీతం, ఇతర సాంకేతిక వర్గం, వీటన్నింటినీ సరిగ్గా సమన్వయ పరచిన దర్శకుడు ఈ సినిమా అద్భుతమైన విజయానికి కారణాలుగా చెప్పవచ్చు.

సావిత్రిగా కీర్తి సురేష్ కళ్ళు తిప్పు కోలేనంత అందంగా ఉన్నారు. కొన్ని కొన్ని సన్నివేశాలలో అయితే నిజం గా సావిత్రి గారే తిరిగొచ్చి నటిస్తున్నారా అనుకునేంత అద్భుతంగా ఉంది. దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశ్ న్ గా బాగా చేశారు. మిగిలిన నటీ నటులు కూడా వారి వారి పాత్రలలో అద్భుతంగా ఒదిగిపోయారు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ మరియు కీర్తి సురేష్ కలిసి నటించిన సన్ని వేశాలు ఆకట్టుకున్నాయి. సమంతా మధురవాణి గా అందరినీ మెప్పించారు. మొదటి సారి తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. మొదటి సారే అయినా చాలా బాగా చెప్పారు.కాకపొతే రెండు మూడు సార్లు “శంకరయ్య” అనే పదాన్ని “సంకరయ్య” అని ఉచ్ఛరించారు. ఆమెకు తెలుగు మాట్లాడడం వచ్చినా పుట్టుకతో  తెలుగు వారు కాదు కాబట్టి కొన్ని కొన్ని పదాలు ఎలా పలకాలో సరిగ్గా తెలిసి ఉండకపోవచ్చు. డబ్బింగ్ సమయం లో ఎవరైనా సరి చేసి ఉండాల్సింది. సరి చేసి ఉంటే ఆమె ఖచ్చితంగా సరిగ్గా చెప్పేవారు.

 

“చిలిపితనం, అమాయకత్వం, వాక్చాతుర్యం, మొండి తనం, పట్టుదల, జాలి, అతి దయా గుణం, ప్రేమ, అందం, అభినయం ” లాంటి అద్భుతమైన సుగుణాల కలబోతే సావిత్రి గారు. ఈ సుగుణాలన్ని ఉన్నాయి కాబట్టే ఆవిడ మద్యానికి బానిస అయినా ఆమె అభిమానులందరూ ఆమె గురించి బాధ పడగలరే కానీ ఎవరూ విమర్శించలేరు. ఒకవేళ ఆవిడ బానిస అయినా అది పూర్తిగా ఆమె వ్యక్తి గతం. దాని వల్ల ఆవిడ తప్ప ఎవరూ నష్ట పోలేదు. అందుకే ఆవిడను విమర్శించే హక్కు ఎవరికీ ఉండదు. కాకపోతే ఒకటే బాధ. ఆమె కష్ట సమయాలలో మద్యానికి బానిస అవకుండా ధృడ చిత్తం తో ఉండి ఉంటే ఇంకా చాలా కాలం నటించే వారు.ఎంతో మందికి ఆ మానవతామూర్తి స్ఫూర్తిగా నిలిచేవారు.

 

Related Post

Please Share this post if you like