Site icon Maatamanti

కీటో డైట్ ను ఎలా ప్రారంభించాలి?How to start Keto Diet?

How to start Keto Diet

కీటో డైట్ ను ప్రారంభించటానికి ఒక పధ్ధతి ఉంది. ఉన్న పళంగా కార్బోహైడ్రేట్స్ ని పూర్తిగా కట్ చేసి మొత్తం కొవ్వు/ఫ్యాట్ ఇంకా ప్రోటీన్ ఇస్తే మన శరీరం ఈ ఆకస్మిక మార్పును అలవాటు చేసుకునే ప్రక్రియలో మనల్ని కొంత ఇబ్బందికి గురి చేస్తుంది. అందుకే ఇవాళ అనుకుంటే రేపు అకస్మాత్తుగా కీటో డైట్ ను మొదలు పెట్టకూడదు.

కీటో డైట్ లోకి మారడానికి ఒక వారం సమయం తీసుకోండి. ముందుగా ఒక ప్రణాళిక ను సిద్ధం చేసుకోండి. ప్రణాళిక లేదా ప్లాన్ ను ఎలా చేసుకోవాలి అనేది మీరు ఈ లింక్ ను క్లిక్ చేస్తే చదివితే కొంత అవగాహన వస్తుంది. ప్రణాళిక సిద్ధం చేసుకున్నాక మరుసటి రోజు నుండి ప్రారంభించండి. కీటో డైట్ లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ, అంటే  రోజుకి 20 గ్రాములకి మించి లేకుండా చూసుకోవాలి. కానీ మొదటి రోజే మీరు మొత్తం పిండిపదార్ధాలు/కార్బోహైడ్రేట్స్ ని 20 గ్రాములకు కట్ చేసి కొవ్వు తీసుకుంటే శరీరం కొద్దిగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఒక్క రోజులో కాక వారం రోజుల్లో కొద్ది కొద్దిగా కట్ చేస్తూ 7 వ రోజు నుండి పూర్తి కీటో డైట్ లోకి మారాలి.

ఇప్పటి వరకు వైట్ రైస్/తెల్ల అన్నం తింటూ వచ్చాము కదా! ఇక ఇప్పుడు అది పూర్తిగా మానేయాలి. చిరు ధాన్యాలు/మిల్లెట్స్ వాడడం మొదలు పెట్టాలి. మొదటి వారం రోజులు ఎలా తినాలో కింద ఇస్తున్నాను చూడండి.

  1. ఒకటవ రోజు —  ఉదయం బ్రష్ చేసుకోగానే ఒక గ్లాసు నీళ్ళల్లో నిమ్మరసం పిండుకొని తాగాలి. తర్వాత 30 నిమిషాల వరకు ఏమి తినకూడదు తాగకూడదు. అరగంట తర్వాత ఒక కప్పు బ్లాక్ టీ కానీ బ్లాక్  కాఫీ కానీ తాగవచ్చు అలవాటు ఉంటే(చక్కెర  లేకుండా). ఉదయం 10.30 లేదా 11 గంటలకు మధ్యలో 2 గంటల పాటు నానబెట్టిన ఊదలు లేదా  సామలు లేదా కొర్రలతో అన్నం వండుకుని 1 కప్పు కొలతతో అన్నం పెట్టుకోవాలి. అరకప్పు లేదా ఆకలి ఎక్కువగా ఉంటే కప్పు కూర పెట్టుకోవాలి. నాన్ వెజ్ తినే వారయితే ఒక ఉడికించిన గుడ్డు కూడా పెట్టుకోవాలి. కూరతో కలుపుకోగా అన్నం మిగిలితే పల్చని నీళ్ల లాంటి మజ్జిగ తో కలుపుకుని తినాలి. ఇక మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక గ్రీన్ టీ విత్ నాన్ బెట్టిన బాదం పప్పులు, లేదా వాల్ నట్స్ (7-10)  లేదా కీర దోసకాయ తినవచ్చు. సాయంత్రం 6.30 లేదా 7 గంటల ప్రాంతంలో మళ్ళీ అన్నం పొద్దున్న లాగానే తినాలి. ఇక ఆ తర్వాత మరుసటి రోజు 10.30 గంటల వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు ఒక్క మంచి నీళ్లు తప్ప.
  2. రెండవ రోజు — మొదటి రోజున పాటించిన విధంగానే పాటించాలి.
  3. మూడవ రోజు — తినవలసిన ఆహారం ఇంకా సమయం పైన చెప్పిన విధంగానే తీసుకోవాలి. కాకపోతే ఒక్క చిన్న మార్పు. ఉదయం 10.30 గంటలకు  ఇంకా రాత్రి 7 గంటకు మీరు తీసుకునే మిల్లెట్ రైస్ యొక్క పరిమాణాన్ని 1 కప్పు నుండి 1/2 కప్పుకు తగ్గించాలి. తగ్గిన పరిమాణం యొక్క లోటుని భర్తీ చేసేందుకు కూర ను పెంచాలి.
  4. నాల్గవ రోజు — కూడా మూడవ రోజు మాదిరిగానే పాటించాలి.
  5. ఐదవ రోజు — తినాల్సిన ఆహరం, సమయం అన్నీ మూడవ రోజు లానే పాటించాలి కాకపోతే రాత్రి 7 గంటలకు తీసుకోవాల్సిన మిల్లెట్ రైస్ తీసుకో కూడదు. రాత్రి మానేయాలి. ఉత్తి కూర, ఒక గుడ్డు, పల్చని మజ్జిగ తీసుకోవాలి.
  6. ఆరవ రోజు —  కూడా ఐదవ రోజులానే పాటించాలి.
  7. ఏడవ రోజు — పూర్తిగా మిల్లెట్ రైస్ మానేయాలి. ఆ మిల్లెట్ రైస్ స్థానంలో కీటో డైట్ కి సంబంధించిన ఆహారం మాత్రమే తీసుకోవాలి.

ఏడవ రోజు నుండి మీరు పూర్తిగా కీటో డైట్ లోకి మారిపోయారు. మీరు నెమ్మదిగా కార్బోహైడ్రేట్స్ ను కట్ చేస్తూ రావడం వల్ల శరీరం నెమ్మదిగా ఇబ్బంది లేకుండా ఈ కొత్త డైట్ ను స్వీకరిస్తుంది. ఈ వారం రోజులలో మీరు బరువు తగ్గుతారని ఆశించవద్దు. ఈ వారం మీరు చేసింది బరువు తగ్గించుకునేందుకు కాదు. శరీరానికి ఆరోగ్యకరమైన ఆహార శైలిని అలవాటు చేయడానికి. గుర్తుంచుకోండి ముందు మీరు ఆరోగ్యం గా ఉంటేనే బరువు తగ్గుతారు.

సరే ఇప్పుడు మీకు కీటో డైట్ ని ఎలా మొదలు పెట్టాలో తెలిసింది కదా! తర్వాత మీరు తెలుసుకోవాల్సింది కీటో డైట్ ని ఎలా పాటించాలి? కీటో డైట్ లో ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి? ఏవి తీసుకో కూడదు లాంటివి నా తర్వాతి వ్యాసం లో చెప్తాను. వ్యాసం రాయగానే మీకు క్రింద లింక్ ఇస్తాను. మీరు నేరుగా ఈ పేజీ కి వచ్చినట్లయితే దీని కన్నా ముందు మీరు చదవాల్సిన ముఖ్యమైన వ్యాసాలు కొన్ని ఉన్నాయి వాటి లింక్ లు కింద ఇస్తున్నాను. చదవండి.

About Ketogenic Diet in Telugu- కీటోజెనిక్ డైట్ అంటే ఏమిటి? 

Weight loss Plan Telugu-బరువు తగ్గించుకునేందుకు ప్రణాళిక

Weight loss Telugu Tips Part-1 వెయిట్ లాస్ టిప్స్

అధిక బరువు-మీరు అర్ధం చేసుకోవాల్సిన విషయాలు

Exit mobile version