Site icon Maatamanti

How to fight Corona??కరోనాను ఎదుర్కోవాలంటే ఒకటే మార్గం

fight corona

కరోనా వచ్చింది అందరి కొంపలు ముంచింది. క్వారంటైన్ అంటే కొద్దీ రోజులేగా అని సరిపెట్టుకునే పరిస్థితి లేదు. అసలెప్పుడు పరిస్థితి మళ్ళీ మాములుగా అవుతుందో ఊహించే పరిస్థితి లేదు . ప్రపంచం మొత్తం ఆగిపోయిందా అసలు భూమే తిరగడం మర్చిపోయిందా అన్నట్లు ఉంది. చిన్నప్పుడెప్పుడో ప్లేగు కలరా వంటి రోగాలు వస్తే ఊర్లకు ఊర్లు తుడిచిపెట్టుకు పోయేవి అని మన పెద్దవాళ్ళు చెప్తే విన్నాము.  ప్లేగు వ్యాధిని విజయవంతంగా నిర్మూలించ గలిగినందుకు విజయ చిహ్నంగా మన చారిత్రాత్మక కట్టడం చార్మినార్ ను కట్టారు అని చెప్తే వింటూ వచ్చాము. ఇప్పుడు ఈ కరోనా గురించి రేపు మన మనవళ్ల కు, ముని మనవళ్ల కు చెప్పాలేమో. చెప్పాలి అంటే ముందు మనం బతికి బట్టకట్టాలి కదా. అంటే మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఏంటో కొద్దిగా దగ్గు వచ్చినా భయంగా ఉంది. కాస్త ఒళ్ళు వేడిగా అనిపించినా ఆమ్మో వచ్చేసిందేమో అని భయం భయం గా ఉంది.

ఎన్నాళ్లని ఇళ్లల్లో దాక్కుని ఉండగలం. ఏదో ఒక రోజు తప్పని సరిగా బయటకు రావాల్సిందే. కరోనా ను ఎదురించాలంటే ఒకటే మార్గం దాన్ని  ఎదుర్కోవలసిందే.  టీవీ ల్లో రేడియో ల్లో సామాజిక మాధ్యమాల్లో అందరు ఇళ్లల్లోనే ఉండమని, బయటకు వచ్చినా సామజిక దూరం పాటించమని, వ్యక్తిగత దూరం పాటించమని చెప్తున్నారు. కేవలం ఇవి మాత్రమే పాటిస్తే సరిపోతుందా?? ఇంకేమి అవసరం లేదా అంటే వీటన్నింటికన్నా ముఖ్యం మనలో Immunity పవర్ లేదా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం. సరైన ఇమ్మ్యూనిటి ని సాధించడమే దీనికి శాశ్వత పరిష్కారం. మన రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా ఉంటే ఎలాంటి రోగాలు వచ్చినా త్వరగా బయట పడొచ్చు. అయితే  అసలు ఇమ్మ్యూనిటి ని పెంచుకోవాలి అంటే ఏమి చేయాలి ??

రోగ నిరోధక శక్తి ని పెంచుకోవాలి అంటే తప్పకుండా పాటించాల్సిన నియమాలు

  1. సరయిన పౌష్టికాహారం ప్రతి రోజు తప్పకుండా తీసుకోవాలి. ఈ విషయంలో నిర్లక్యం ఏమాత్రం తగదు. ప్రతి రోజూ మనం తినే ఆహారంలో తగినంత కొవ్వు(శరీరానికి మేలు చేసే కొవ్వులు మాత్రమే), మాంసకృతులు అంటే ప్రోటీన్స్, పిండి పదార్ధాలు అంటే కార్బోహైడ్రేట్స్  మరియు తగినంత పీచు పదార్ధం అంటే డైటరీ ఫైబర్ ఉండాలి.  ఇవన్నీ  స్థూల పోషకాలు(macro nutrients). ఇవే కాక సూక్ష్మ పోషకాలు (micro nutrients ) కూడా ఒక రోజుకి ఎంత తీసుకోవాలో అంత తప్పకుండా తీసుకోవాలి. మన కష్టాలన్నీ మనం తీసుకునే ఆహారంతో మొదలవుతాయి. ఒక రోజులో మన శరీరానికి ఏమి కావాలో ఎంత కావాలో అవి ఇచ్చేస్తే ప్రశాంతంగా తన పని తాను చూసుకుంటుంది. మనల్ని అనేక రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. అయితే మనకు ఇవి ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది సామాన్య  ప్రజలకి తెలీదు కాబట్టి మన ప్రభుత్వం వారు, భారతీయ వైద్య పరిశోధనా మండలి ( Indian council of Medical Research) వారు కొన్ని ఆహార ప్రామాణికాలు ఇచ్చారు. దీనినే ఇంగ్లీష్ లో Recommended Dietary Allowances అంటారు. వయసును బట్టి ఏ ఆహారం ఎంత పాళ్లల్లో తీసుకోవాలి అనేది వివరంగా ఉంటుంది. ఎవరు ఎంతెంత తీసుకోవాలి తెలియడానికి నేను ప్రభుత్వం వారు ఇచ్చిన ఛార్ట్ ని ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఆ చార్ట్ ను సులువు గా అర్ధం చేసుకోవచ్చు.
  2. తగినంత సమయం నిద్రపోవాలి. కనీసం 8 గంటలు నిద్ర అనేది తప్పని సరి. కొంత మందికి వేరు వేరు పని వేళలు ఉండడం వల్ల, ఎక్కువగా టీవీ లు, సెల్ ఫోన్స్ చూడడం వల్ల, మానసిక సమస్యల వల్ల, ఒత్తిడి వల్ల సగటు మనిషి నిద్రా సమయం ఓ 4 లేదా 5 గంటలు అని చెప్పొచ్చు. ఇలా ఇంత తక్కువ సమయం నిద్రపోతే శరీర రోగ నిరోధక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. నిద్ర సరిగ్గా పోవాలంటే ఏమి చేయాలి. నిద్రలేమి సమస్యల నుండి బయట పడాలి అంటే ఏమి చేయాలి?? అనే దాని గురించి ఇక్కడ వివరంగా రాశాను చూడండి.
  3. రోజూ కాసేపు వ్యాయామం చేయాలి. రోజూ కాకపోయినా వారంలో కనీసం 3 రోజులైనా తప్పని సరిగా వ్యాయామం చేయాలి. దీనికి లావు సన్నం అన్న తేడా లేదు. ప్రతి ఒక్కరు చేయాలి. లావుగా ఉన్నవారందరూ అనారోగ్యంతో ఉంటారని, సన్నగా ఉన్నవారందరూ ఆరోగ్యంగా ఉంటారు అనుకోడానికి లేదు. వ్యాయాయం చేయడం వల్ల బరువు ఎక్కువ ఉన్నవారు తగ్గుతారు. సరిగ్గా ఉన్న వారు మరి పెరగకుండా ఉంటారు. శరీరం తేలిగ్గా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. శారీరక శ్రమ వల్ల రాత్రి పడుకోగానే నిద్ర పడుతుంది.
  4. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మద్యం సేవించడం, పొగ తాగడం లాంటివి మానుకోవాలి.  తాగడానికి వెళ్లకపోతే ఫ్రెండ్ బాధపడతాడు, పక్కింటి పిన్ని గారు బాధపడతారు …ఇలాంటి పనికిమాలిన వంకలు వెతుక్కోకుండా ఇలాంటి విషయాల్లో హద్దులు పాటించడం మంచిది. ఎందుకంటే రేపు మనకేదైనా అయితే వాళ్లెవరు బాధపడరు. మన బాధ మనమే పడాలి. నాలుగు మాటల్లో ఇక్కడ నేను ఒకరి వ్యసనాల్ని మార్చలేను. కానీ తగ్గించుకోమని మాత్రం చెప్ప గలను. మానేయాలి అనుకుంటే ఇంకా ఎక్కువ తాగాలి అనిపిస్తుంది. మనసు కోతి కదా. వద్దంటే ఎక్కువ చేస్తుంది. అదే తగ్గించుకోవాలి అనుకుంటే పర్లేదు ట్రై చేద్దాం తగ్గించి చూద్దాం అనిపిస్తుంది. ఇది బెటర్ కదా. ఇప్పుడు చూడండి ఈ లాక్ డౌన్ ఎత్తేయ గానే కిరాణా సామాన్లు పెట్రోల్ బంకుల్లో, గుళ్ళల్లో ఉండే క్యూ ల కన్నా మందు షాప్ క్యూలే పెద్దగా ఉంటాయి 🙂 :). చెడు అలవాట్లు అంటే కేవలం మందు సిగరెట్లే కాదు. టీ, కాఫీలు కూడా. కొంతమంది గంట గంటకు తాగేస్తుంటారు. ఇది మానుకోవాలి. రోజుకి ఒకసారి కాఫీ ఒకసారి టీ మాత్రమే తీసుకుంటే బెటర్.
  5. వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రతను తప్పక పాటించాలి. ఈ అలవాట్లను కేవలం లాక్ డౌన్ వరకు మాత్రమే పరిమితం చేయకుండా వాటిని జీవిత కాలపు అలవాట్లుగా చేసుకోవాలి. చేతులు, కాళ్ళు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి. అలాగే నోరు కూడా. కేవలం మనం శుభ్రంగా ఉంటే సరిపోదు మన పరిసరాలు, మనం పని చేసే చోటు ప్రతిదీ శుభ్రంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయడం, ఎక్కడ బడితే అక్కడ ఉమ్మడం లాంటివి పూర్తిగా మానేయాలి. వీటన్నింటి తో పాటు మనసును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
  6. కొన్ని రోజులు కొత్త డైట్ ల జోలికి పోకండి. ప్రస్తుతానికి కీటో డైట్, కాటేసే డైట్, ఇంకో డైట్ లాంటి వాటి జోలికి పోవద్దు దయచేసి. ఇది మన శరీరం మీద ప్రయోగాలు చేసుకునే సమయం కాదు. ఉన్న ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునే సమయం. లావు ఉన్నాము అని చింతించకుండా ముందు మిమ్మల్ని మీరు accept చేసుకోండి. నేను ఎలా ఉన్నా నాకు ఓకే. ఎవరేమి అనుకున్నా పర్లేదు ఐ లవ్ మై బాడీ అనుకోండి. మనది కాని కొత్త రకం ఆహారం అలవాటు చేసుకునే ప్రక్రియ లో శరీరం కొన్ని ఇబ్బందులు పడుతుంది. వాటినే సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. ఇప్పుడేదైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తే హాస్పిటల్ కి వెళ్లి చూపించుకునే పరిస్థితి లేదు. వెళ్లినా ఉన్న రోగం తో పాటు కొత్త రోగం తగులుకునే ప్రమాదం ఉంది. అందుకే కొత్త డైట్ ల గురించి కొన్నాళ్ళు మర్చిపోండి. ప్రశాంతంగా ఉండండి.  అసలు పైన చెప్పిన సూచనలను శ్రద్ధగా పాటించ గలిగితే ఇంక వేరే ఏ డైట్ లు అవసరం లేదు. కావాలంటే ట్రై చేసి చూడండి.
  7. ఏంటి ఏడో పాయింట్ కావాలా?? ఇప్పటిదాకా చదివింది చాలు. మర్యాదగా పైన ఆరు పాయింట్లు తూ.చ తప్పకుండా పాటించే పనిలో ఉండండి😊. ఏమి చెప్పాలో తెలీనప్పుడు ఇలా ఎలాగొలా బెదిరించి బతికేయాలి. 😜😄😘


Exit mobile version