Site icon Maatamanti

వ్యవసాయ భూమి ఎలా కొనాలి??

నేను నా ఇంతకు ముందు పోస్ట్ లో మా వ్యవసాయ ప్రయాణం వెనుక కథ గురించి రాశాను. ఒకవేళ మీరు చదవక పోయి ఉంటే ఇప్పుడు చదవగలరు. నిన్న రాసిన వ్యాసంలో మేము పొలం ఎలా కొన్నామో వివరించాను కదా. ఇక ఈ వ్యాసంలో మీరు కొనాలి అంటే ఎలా కొనుక్కోవాలి అనేది నాకు తెలిసినంత వరకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను.

ముందుగా మీరు పొలం కొనాలి అని అనుకున్నప్పుడు మీరు దాన్ని ఇన్వెస్ట్మెంట్ లా భావించి కొంటున్నారా లేదా వ్యవసాయం చేయడానికి కొంటున్నారా అనే దాని మీద మీకు ఒక క్లారిటీ ఉండాలి.

పై రెండింటిలో మీరు భూమిని దేని కోసం కొన్నా తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. మన రెవెన్యూ మరియు భూమి రికార్డుల శాఖ మొత్తం చాలా లోపభూయిష్టంగా ఉండేది ఇంకా ఇప్పటికీ ఉంది. దాని వల్ల భూ విక్రయాల్లో ఎన్నో అక్రమాలు జరుగుతుంటాయి. కానీ మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆయా శాఖల్లోని లోపాలను సవరించడానికి సంస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. అది అంత తేలికైన విషయం కాదు. కొంత సమయం పడుతుంది. కొన్ని వందల సంవత్సరాలుగా తప్పులు తడకలుగా ఉన్న రికార్డు లను ఇప్పుడు “సమగ్ర సర్వే” ద్వారా వెరిఫై చేసి,  కబ్జాలకు, అక్రమాలకు తావు లేకుండా చేసి కొత్త “పట్టాదార్ పాస్ పుస్తకాలను” అందచేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే ఇకమీదట అక్రమాలకు తావు లేకుండా పరిపూర్ణ పారదర్శకత ఉంటుంది అనుకుంటున్నాను.

ఇదంతా అవ్వడానికి ఇంకా చాలా రోజులు పట్టొచ్చు. కానీ ఈలోపు మీరు భూమి కొనాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తాను. దాని కన్నా ముందు భూమిని ఎక్కడ కొనుక్కుంటే మంచిది అనేది చెప్తాను. ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ లో పొలం వీడియో లు పెట్టడం మొదలు పెట్టిన దగ్గర నుండి నన్ను ఎక్కువ మంది వాకబు చేసింది ఉద్యోగస్తులే. అంటే ఉద్యోగం చేస్తూనే కొంత సమయం వ్యవసాయానికి కేటాయించాలి అనుకునేవారు. అలా ఉద్యోగం చేస్తూ వ్యవసాయం చేయాలి అనుకునే వారు, వారు నివసిస్తున్న ప్రాంతం నుండి 50 లేదా 60 కిలో మీటర్ల పరిధిలో భూమి కొనుక్కుంటే మంచిది. అంతకంటే దూరం లో కొనుక్కుంటే మీకు మొదటి 4 వారాలు సరదాగా అనిపించి వెళ్లినా కొన్ని రోజులయేసరికి అంత దూరం వెళ్లే ఓపిక లేక వదిలేసే అవకాశం ఉంది.

ఒకసారి ఏదైనా భూమి కొన్నారు అంటే ఎట్టి పరిస్థితిలోనూ అక్కడకు తరచూ మీరు వెళ్లి వస్తున్నట్లుగా మీ పక్క పొలాల వారికి, మిమ్మల్ని అక్కడ గమనించే వారికి, ముఖ్యంగా మీకు అమ్మిన వారికి తెలుస్తుండాలి. మీరు వెళ్లడం మానేశారు అంటే ఈసారి మీరు వెళ్లేసరికి వేరే ఓనర్ ఉంటారు. ఇక ఆ తర్వాత ఏడ్చుకుంటూ కూర్చోవాలి. పైన చెప్పిన మూడురకాల వ్యక్తులలో మనం కొన్న భూమిని మళ్ళీ ఇంకొకరికి అమ్మే పాజిబులిటీ ఎక్కువ మనకు అమ్మిన వారికే ఉంటుంది. అందువల్ల మీరు తరచూ వెళ్లగలిగినంత దూరంలోనే కొనుక్కోండి లేదా కొద్దిగా దూరమైతే మీకు నమ్మకస్తులెవరైనా అక్కడ ఉండేలా చూసుకోండి. ఇది ఒకే అనుకుంటేనే మీరు అసలు కొనడం గురించి ఆలోచించడం మొదలు పెట్టండి.

ఇక కొనాలి అంటే ఎవర్ని అడగాలి. ఎక్కడ అడగాలి. ఉదాహరణకు హైదరాబాద్ ను తీసుకోండి. అందులో ఉదాహరణకు  హైటెక్ సిటీ ప్రాంతాన్ని సెంటర్ గా తీసుకుంటే అక్కడ నుండి చుట్టూ 50-60 కిలో మీటర్ల పరిధిలో ఉన్న స్థలాలు ఏంటో మ్యాప్ లో చూసుకోవాలి. హైదరాబాద్ చేరువలో నాకు తెలిసిన కొన్ని ప్రాంతాలు చెప్తాను. పటాన్చెరు, సంగారెడ్డి, సంగారెడ్డి-మెదక్ రోడ్ , సింగూరు, సదాశివపేట, జహీరాబాద్, వికారాబాద్, చేవెళ్ల, తాండూరు(కొద్దిగా దూరం కానీ బాగుంటుంది), శంకర్ పల్లి, శంషాబాద్, నర్సాపూర్, నర్సాపూర్-మెదక్ రోడ్ ఇవి మాకు తెలిసిన వ్యవసాయ భూమి దొరికే ప్రాంతాలు. హైదరాబాద్ కాకుండా వేరే ప్రాంతాలు అంటే నేను చెప్పలేను. మీరు కాస్త తిరిగి తెలుసుకోవాల్సిందే. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఈ ప్రాంతాలన్నీ మేము బాగా తిరిగాము. మా పొలం ఉన్న నర్సాపూర్ ప్రాంతంలో ఇప్పుడు రోడ్ మీద ఎకరం కోటి పాతిక నుండి కోటి యాభై వరకు పలుకుతుంది. రోడ్ మీద నుండి లోపలకు వెళ్లిన కొద్దీ కొద్దీ కొద్దిగా తగ్గుతూ చివరికి ముప్ఫై లక్షల వరకు ఉన్నాయి. మేము మొన్నీమధ్య ఒకటి చూశాము. రోడ్డు నుండి చాలా లోపలికి ఉంది. పొలం అంతా కొండ రాళ్లు ఉన్నాయి. చాలా ఎత్తుగా కూడా ఉన్నాయి. అది వ్యవసాయం కొరకు అస్సలు పనికి రాదు. కానీ ఒక వెకేషన్ హౌస్ లా కట్టుకోవాలి అంటే మాత్రం సూపర్ గా ఉంటుంది. అది ఒక్క ఎకరమే 35 లక్షలు చెప్పారు.

అంతకు తక్కువ మేము ఈ మధ్య కాలంలో చూడలేదు. ఇంతకు ముందు మెదక్ జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. దానిని అభివృధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని వైపులా చక్కని 4 lane రోడ్ మార్గాలు వేసింది. రోడ్లు అద్భుతంగా మారాయి. వేరే జిల్లాల నుండి కనెక్టివిటీ పెరిగింది. అందువల్ల భూమి ధరలు కూడా బాగా పెరిగాయి.

భూమి కొనే ముందు పాటించవలసిన జాగ్రత్తలు.

ఈ పైన చెప్పిన పాయింట్లు అన్నీ మేము స్వానుభవంతో తెలుసుకున్న విషయాలు. ఇవి కాకుండా ఇంకా ఏవైనా పాయింట్లు కూడా ఉండి ఉండొచ్చు. ఒకవేళ తెలిస్తే అవి కూడా అప్డేట్ చేస్తాను. ఇంకా నా తర్వాత పోస్ట్ లలో వివిధ రకాల సబ్సిడీ లు ఎలా పొందాలి. ఎక్కడి నుండి పొందాలి. వ్యవసాయ భూమి ఉంటే ఎన్ని రకాలుగా దాన్ని ఉపయోగించవచ్చు వంటి విషయాలు మీతో షేర్ చేస్తాను.

Exit mobile version