Site icon Maatamanti

Good Foods List-మంచి ఆహారాల లిస్ట్

Good foods list

రోజు అన్ని పోషకాలు అందేలా చూసుకోవాలి అంటే అసలు ఏ ఏ రకాల ఆహారాలు అవసరం అనేది కింద ఇస్తున్నాను చూడండి. నేను ఈ కింద ఇచ్చిన వాటిలో ఖర్జూర సిరప్ ఇంకా గ్రీన్ కాఫీ తప్ప మిగిలినవన్నీ మా ఇంట్లో ఉన్నాయి. ఇవి అన్నీ నేను రెగ్యులర్ గా వాడతాను. నాకు గుర్తు ఉన్నంత వరకు అన్నీ రాశాను. ఒకవేళ ఏదైనా మిస్ అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను.

బియ్యం మరియు పప్పు ధాన్యాలు

పైన చెప్పిన వాటిలో ఒక్క క్వినోవా మరియు బ్లాక్ రైస్ తప్ప మిగిలినవన్నీ దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటాయి. చిరు ధాన్యాలైన కొర్రలు, సామలు లాంటివి కూడా తక్కువ మంది వాడతారు. కారణం అవి ధర ఎక్కువగా ఉండడమే. కానీ నేను గమనించింది ఏంటంటే మనం 1 కేజీ బియ్యాన్ని 40-55 రూపాయల ధర చెల్లించి కొనుక్కుంటాము.  మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా మధ్యస్తంగా తినే ఇద్దరికీ కేజీ బియ్యం 2 రోజులు వస్తాయి. చిరు ధాన్యాలు 1/2 కేజీ నే 45 నుండి 50 రూపాయలు ఉంటాయి. అవి కూడా ఇద్దరికి 2 రోజులు వస్తాయి. ఎందుకంటే అన్నం తిన్నంత అవి తినలేము కాబట్టి. అన్నం తినేటప్పుడు కూర బాగుంటే ఒక రెండు ముద్దలు ఎక్కువ తింటాము. కానీ చిరు ధాన్యాలతో ఎక్కువ తినలేము. కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. రెండింటిలోనూ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రెండు చక్కెరలను విడుదల చేస్తాయి. కానీ చిరు ధాన్యాలు తిన్న వెంటనే కాకుండా మెల్లిగా విడుదల చేస్తాయి. అందువల్ల మంచివి. ఎంత పడితే అంత కాకుండా కొద్దిగా తినగలిగితే బియ్యం కూడా మంచివే.

రాజ్మా మన కన్నా నార్త్ ఇండియన్స్ ఎక్కువ వాడతారు. కానీ వాటిని ఉడక బెట్టి గుగ్గిళ్ళు లా చేసుకున్నా లేదా రాజ్మా మసాలా చేసుకున్నా రుచి బాగుంటుంది. కార్బ్స్ ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 100 గ్రాముల ఉడికించిన రాజ్మాలో ప్రోటీన్స్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వారంలో కనీసం రెండు రోజులన్నా వీటిని తినాలి. ఇక కాబూలీ శనగలు లేదా చిక్ పీస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని కూడా గుగ్గిళ్ళు చేసుకుని తినొచ్చు లేదా చోళే మసాలా చేసుకుని తినొచ్చు. ఇందులో కూడా ప్రోటీన్స్, మినరల్స్ ఉన్నాయి. మెనోపాజ్ సమస్యలతో బాధపడుతున్న స్త్రీలకు కూడా ఇవి మంచివి.  పైన చెప్పిన వాటిలో నల్ల శెనగలు, కాబూలీ శనగలు, రాజ్మా లేదా  పచ్చ పెసర పప్పు మొలకల్తో గుగ్గిళ్ళు చేసుకుని సాయంత్రం 4 లేదా 5 గంటలకు తింటే కడుపు బాగా నిండి నట్లుగా అయి రాత్రి ఎక్కువ తినలేరు. ఈ విధంగా రాత్రి పుట ఎక్కువ తినాలి అనిపించే అనే సమస్యను అధిగమించవచ్చు.

పిండి

గోధుమ పిండి కూడా మన ప్రధాన ఆహారాల్లో ఒకటి కాబట్టి తీసుకోవచ్చు. మైదా పిండి మర్చిపోండి. గోధుమ పిండితో కూడా బాగా నూనె వేసి పరాఠా లు, చపాతీలు కాకుండా పుల్కాలు చేసుకుంటే మంచిది. జొన్న పిండితో జొన్న రొట్టెలు చేసుకోగలిగితే పర్లేదు. రాదు అంటే సింపుల్ గా గోధుమ పిండిలో కలిపేసి చేసుకోవడమే. 1 కప్పు గోధుమ పిండికి ఒక కప్పు జొన్న పిండి లేదా రాగి పిండి కలిపి పుల్కాలు వేసుకుని రాజ్మా మసాలా కూర గానీ, చోళే కానీ లేదా పనీర్ లేదా పుట్టగొడుగు ల కూర…వేరే ఇతర కూరగాయల తో చేసిన కూరలు కానీ చేసుకుని రాత్రి 7.30 నుండి 8 గంటల లోపు తినగలిగితే మంచిది. ఇలా వారంలో 2 రోజలు చేసి మిగిలిన రోజులు ఇంకోలా తినాలి. కొబ్బరి పిండి ఏంటి అది ఎలా వాడాలి అనుకుంటున్నారా? నాకూ ఇంతకు ముందు తెలీదు. నేను కీటో డైట్ చేసినప్పుడు తెలిసింది. ఈ కోకోనట్ ఫ్లోర్ ను కొబ్బరి నుండి పాలు, నూనె లాంటివి అన్నీ తీసేశాక మిగిలిన పిప్పితో తో చేస్తారు. అయినా కూడా ఆ పిండిలో ప్రోటీన్స్ ఉంటాయి. పీచు పదార్ధం ఉంటుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. మీరు కేకులు, బిస్కెట్లు, పాన్ కేక్ లు లాంటివి చేసుకోవాలి అంటే హ్యాపీగా దీనితో చేసుకోవచ్చు. సొయా పిండి చేదుగా ఉంటుంది. నేను ఇది జావ పొడి లో కలుపుతాను. ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సొయా పిండిలో. అలాగే కావాలంటే గోధుమ పిండిలో కూడా కలుపు కోవచ్చు. కానీ 1 కేజీ గోధుమ పిండిలో 50 గ్రాములు మాత్రమే కలపాలి అంత కంటే ఎక్కువ అయితే పిండి చేదుగా అవుతుంది.

నూనెలు

ఈ ఆలివ్ ఆయిల్ ఇవన్నీ ఈ మధ్య అంటే ఈ దశాబ్దం లో ప్రసిద్దిలోకి వచ్చాయి కానీ ఇంతకు ముందు ఎవరూ మన భారత దేశంలో పెద్దగా వాడేవారు కాదు. పైన ఉన్న వాటిలో ఆలివ్ ఆయిల్, కుసుమ నూనె చాలా శ్రేష్టమైనవి. వీటిలో saturated ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి. కాకపోతే వీటి ధర ఎక్కువగా ఉండడం వల్ల అందరు వాడాలి అంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మిగతా నూనెలు కూడా మంచివే కానీ పైన వాటితో పోలిస్తే కొద్దిగా saturated కొవ్వులు ఎక్కువ ఉంటాయి. ఆలివ్ ఆయిల్ ను ఒకసారి కాచినా మళ్ళీ దానిని వేరే వంటకంలో వాడొచ్చు. కానీ మిగతా నూనెల్ని అలా వాడకూడదు. డీప్ ఫ్రై కి ఉపయోగించిన నూనె అస్సలు వాడకూడదు. కాక నూనె వాడితే కాన్సర్ లాంటి రోగాల బారిన పడక తప్పదు. అలాంటి నూనెలో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. అందుకే డీప్ ఫ్రై వంటకాలు పూర్తిగా మానేయాలి. కొంతమంది నూనె కంపెనీ వాళ్ళు నూనె quantity ని పెంచాడనికి Argemone ఆయిల్ కలుపుతారు. మీరు నూనె కొనే ప్రతీసారి ఇది ఉందేమో అని లేబిల్ మీద చూసి మరీ కొనుక్కోవాలి. దీనినే తెలుగులో పిచ్చి కుసుమ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఇక మీకు కుదిరితే మీ ఏరియా లో cold pressed ఆయిల్స్ ఎక్కడ తయారు చేస్తారో తెలుసుకొని అక్కడ కొనుక్కుంటే మంచిది. మాములు నూనె కి cold pressed కి తేడా ఏంటి అనేది ఇంకో పోస్ట్ లో వివరంగా చెప్తాను. ఆలివ్ ఆయిల్ రిఫైన్డ్ ది వాడినా పర్లేదు. రోజువారీ వంటలకు వర్జిన్ లేదా ఎక్స్ట్రా వర్జిన్ లు బాగోవు.అవి కేవలం సలాడ్స్ కి మాత్రమే బాగుంటాయి. రిఫైన్డ్ ఆలివ్ పర్లేదు అని ఎందుకు అన్నాను అంటే రిఫైన్ చేసిన కింద ఉన్న నూనెల కన్నా రిఫైన్ చేసిన ఆలివ్ నూనె కాస్త మంచిది. అంటే ఉన్న చెడ్డ వాటిలో కాస్త మంచి చెడ్డ దాన్ని ఎంచుకోవడం అన్నమాట :).

గింజలు

ఈ పైన చెప్పిన గింజలన్నింటి లోను ఎన్నో పోషక విలువలుంటాయి. ప్రోటీన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. చియా సబ్జా ఒకలానే అనిపించినా దేనికుండాల్సిన పోషక విలువలు దానికి ఉంటాయి. రెండు వేరు వేరు. కానీ రెండు చాలా మంచివి. ఇక అల్ఫాఫా గింజలేంటి అనుకుంటున్నారా ?? వీటిని నానబెట్టి మొలకలు చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. గోధుమలు ఎందుకు రాశాను అంటే మనమే ఇంట్లో గోధుమ గడ్డిని పెంచుకుని wheat grass juice చేసుకుని తాగొచ్చు. గుమ్మడి గింజలు తింటానికి బాగున్నాయి కదా అని ఎక్కువ తినకూడదు ఒక రోజుకి 1 tbsp కన్నా ఎక్కువ తినకూడదు. నువ్వుల లో  కాల్షియమ్ ఉంటుంది. ఇంక జుట్టు చర్మం మెరుగు పడతాయి. నువ్వులు వేడి చేస్తాయేమో అని చాలా మంది తినరు. కానీ నువ్వుల కారం పొడి చేసుకుని రోజు 1 tbsp ఆ కరం పొడిని అన్నం లో కలుపుకు తింటే మంచిది. అదే పొడిలో flax లేదా అవిశెలు కరివేపాకు కలిపి పొడి చేసుకుంటే అన్నీ ఒకదాంట్లోనే ఉంటాయి వేరు వేరుగా తినాల్సిన అవసరం ఉండదు. మీకు జుత్తు ఊడిపోకుండా ఒత్తుగా పెరగాలి అంటే ఈ పొడిని ప్రతి రోజూ తినాలి.

పొడి

వీట్ గ్రాస్ పౌడర్ ని కొద్దిగా నీళ్లలో కలిపి ఉదయం తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. దాని గురించి చెప్పాలి అంటే మళ్ళీ పోస్ట్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది .అందుకే ఇంకో పోస్ట్ లో వివరంగా చెప్తాను. మునగాకు పొడి మనం ఇంట్లో చేసుకున్నా పర్లేదు. లేకపోతే బయట కొనుక్కోవచ్చు. మునగాకు కారం పొడి కాకుండా అచ్ఛంగా మునగాకు పొడి దొరుకుతుంది. కేజీ 1000 రూపాయలు ఉంటుంది. నెలకు 1/4 కేజీ లేదా 200 గ్రాములు సరిపోతుంది. అన్నంలో మొదటి ముద్ద నేను పైన చెప్పిన నువ్వులు, అవిశెలు, కరివేపాకు కారం పొడితో ఒక రోజు మునగాకు కారం పొడి తో ఒక రోజు మార్చి మార్చి తింటుండాలి. 1 tbsp కదా ఏమి చేస్తుంది అనుకోకండి. ఈ రెండుకారం పొడులు అద్భుతం. ఎండు కొబ్బరి పొడి వేపుడు కూరల్లో, కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి వాడొచ్చు. అందులో కూడా చాలా పోషక విలువలుంటాయి.

డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్

ఇవి రోజు రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లో తినాలి. 6 బాదం పప్పులు, 1 అంజీర, 1 ఖర్జుర లేదా 1 ఆప్రికాట్ నానబెట్టుకుని తినాలి.

పాలు మరియు పాల పదార్ధాలు

నేను గత రెండు సంవత్సరాల నుండి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వని గేదెల నుండి సేకరించిన ఆర్గానిక్ మిల్క్ వాడుతున్నాను. కొద్దిగా ధర ఎక్కువ గానే ఉంటాయి. కానీ మన ఆరోగ్యానికి మించినది ఏది లేదు. నేను sid’s farm మిల్క్ ఇంకా కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన Milchy milk  వాడుతూ ఉంటాను. ఇవి pure ఆర్గానిక్ మిల్క్. ఛీజ్, పనీర్, క్రీమ్ లాంటివి వారంలో రెండు లేదా మూడు సార్లు 30 గ్రాముల చొప్పున తీసుకోవచ్చు. నెయ్యి రోజుకి 1 లేదా 2 tsp లు వాడొచ్చు.

అన్ని రకాల కూరగాయలు మరియు పండ్లు

అన్ని కూరగాయలు మంచివే. కొంత మంది ఆలుగడ్డలు తినడానికి భయపడుతూ ఉంటారు. కానీ అవి కూడా చాలా మంచివి. మీరు వాటిని ఎలా వండుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. వాటిని డీప్ ఫ్రై చేయకూడదు. ఉడికించి గుజ్జు చేసిన ఆలు లో పొటాషియం, సోడియం అధికంగా ఉంటాయి. మీరు ఇంగ్లీష్ సినిమాలు కానీ సిరీస్ కానీ చూసినప్పుడు గమనిస్తే వారి ప్లేట్స్ లో mashed పొటాటో ఖచ్చితంగా ఉంటుంది. చిలగడ దుంపలు కూడా చాలా మంచివి. బీట్ రూట్ ఆకులలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఒక రోజుకి 4700 mg పొటాషియం కావాలి. ఒక్క అరటి పండులో సుమారు 350 గ్రాములు ఉంటుంది. పండ్లని జ్యూస్ లా చేసుకుని తాగకూడదు. డైరక్ట్ గా తినాలి.

తీపి కోసం

ఒక్క డేట్ సిరప్ తప్ప మిగిలినవన్నీ నేను వాడుతున్నాను ప్రస్తుతం. పంచదార పూర్తిగా మానేశాను. 1/2 కేజీ మాత్రం కొని ఉంచుతాను. ఇంటికి ఎవరైనా వస్తే కాఫీ టీ లో ఇవ్వడానికి. ఎందుకంటే అందరికీ పైన నేను చెప్పినవి నచ్చక పోవచ్చు అందుకని. పైనవి మంచిది అన్నాను కదా అని ఎక్కువ వాడకూడదు. ఎంత అవసరమో అంతే వాడాలి. కొబ్బరి బెల్లం తాటి బెల్లం లకు low-glycemic index ఉంటుంది.అంటే లో GI ఉన్న వాటిని తీసుకున్నప్పుడు అవి మెల్లిగా అరుగుతాయి. అందువల్ల తిన్న వెంటనే రక్తంలో చక్కర స్థాయిలు పెరగవు. బెల్లం తాజాగా ఉన్నది రంగు కలపనిది కొనుక్కోవాలి. కొని తీసుకు రాగానే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం మంచిది.

మాంసాహారం

పౌల్ట్రీ కోళ్ళకి త్వరగా పెరగడానికి ఇచ్చే హార్మోన్స్ ఇస్తారు. అది మనం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు నాటు కోడి తినడం మంచిది. మటన్, బీఫ్ లాంటి మాంసం ల వల్ల cholesterol పెరిగే అవకాశం ఉంది కాబట్టి అవి తినడం బాగా తగ్గించాలి. వారంలో కనీసం 3 రోజులన్నా ఉడికించిన గుడ్డు తింటే మంచిది. శీలావతి, బొచ్చె, రవ్వ ఇలాంటి చేపలలో కన్నా సాల్మన్, ట్యూనా లాంటి చేపలతో ఉండే కొవ్వులు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇక రొయ్యలు, ఎండు చేపలు ఎండు రొయ్యలు లాంటివి కూడా కొద్దిగా తగ్గించి అంటే నెలోకసారి తీసుకోవచ్చు.  వాటిని ఉత్తిగా కాకుండా ఏదైనా కూరగాయలతో కలిపి వండుకుంటే మంచిది.

కాఫీ మరియు టీ

ఇవి లేకుండా చాలా మందికి తెల్లారదు అని  నాకు తెలుసు. నాకు కూడా తెల్లారదు :). రోజుకు ఒకసారి కాఫీ ఒకసారి టీ తాగితే ఏమి కాదు. కాకపోతే కాఫీ లేదా టీ ని మరీ చిక్కని పాలతో కాకుండా పాలల్లో కాస్త నీళ్లు కలిపి చేసుకోవాలి. పంచదార బదులు స్టీవియా డ్రాప్స్ కానీ, erythritol పొడి కానీ వేసుకొంటే మంచిది. ఇవి కాకుండా బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు కానీ బెల్లం వేయగానే పాలు విరిగిపోతాయి. అందువల్ల బెల్లంతో పాకం చేసుకుని తేనెలా స్టోర్ చేసుకుని 1 tsp వేసుకుని తాగొచ్చు. అలా చేస్తే పాలు విరగవు అని నేను అనుకుంటున్నాను. ముందు నేను ట్రై చేసి మీకు చెప్తాను.

ఇతరములు

ఆపిల్ సిడార్ వెనిగర్ రోజూ ఉదయాన్నే 2 tbsp తీసుకుని 1 గ్లాస్ నీళ్లలో కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 2 రోజులు ఇది, 2 రోజులు ఆమ్లా జ్యూస్, 2 రోజులు wheat grass జ్యూస్ ఉదయాన్నే తీసుకోగలిగితే మంచిది. వీటన్నింటి గురించి వేరే పోస్ట్ లో వివరంగా రాస్తాను. కలబంద రసం రోజు తీసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ చిన్న ముక్క తీసుకుంటే గుండె జబ్బులు రావు. కసూరి మేతి ఎందుకు రాశాను అంటే మెంతులు లేదా మెంతి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పుల్కా ల కోసం వండే ప్రతీ కూరలో నేను కసూరి మేతి వేస్తాను. అలాగే పుల్కా పిండి కలిపే తప్పుడు పిండిలో కూడా కొద్దిగా వేసి కలుపు కుంటాను. మామిడి అల్లం కూడా చాలా మంచిది. అల్లం అంటారే కానీ నిజానికి ఇది అల్లం జాతికి చెందినది కాదు. పసుపు జాతికి చెందినది. మామిడి అల్లం తో చారు, పచ్చడి, మామిడి అల్లం చికెన్, ఫిష్, పప్పు చేసుకోవచ్చు. సూపర్ గా ఉంటాయి. నేను ఈ మధ్యే ఇవన్నీ చేసి చూశాను అద్భుతంగా ఉంటాయి. దొరికితే ఒకేసారి ఎక్కువ తెచ్చి పెట్టుకోండి. చాలా కాలం నిల్వ కూడా ఉంటుంది. ఆపిల్ సిడర్ వినేగార్ నేను Bragg బ్రాండ్ వాడుతున్నాను. అది చాలా మంచిది. Dr.Eric berg అదే వాడతారు :).

స్నాక్స్

సాయంత్రం టీ తాగే సమయానికి ఆకలి అనిపిస్తే పైన ఇచ్చిన లిస్ట్ లోవి తినొచ్చు. అదీ చాలా కొద్దిగా. చిక్కి అయితే 1 మాత్రమే తినాలి. పల్లీలు 30 గ్రాములు లేదా సగం గుప్పెడు. ఫ్లేక్స్ అయితే 1 tbsp నూనెలో వేయించి తినాలి. అది కూడా 1 కప్పు. వీటిలో అన్నింటికన్నా ఉత్తమం పెసర మొలకలు తర్వాత గుగ్గిళ్ళు.

వీటన్నింటితో పాటు probiotic ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అంటే కిణ్వనం చెందిన ఆహారం తీసుకోవాలి. ఏంటి ఏదో తిట్టేశాను అనుకుంటున్నారా. కిణ్వనం అంటే ferment అయిన ఆహారం. పులిసిన ఆహారం లో మన శరీరానికి మేలు చేసే బాక్టీరియా ఉంటుంది. అది మన జీర్ణవ్యవస్థ ను మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా ఇమ్మ్యూనిటి కూడా పెరుగుతుంది. దానికోసం పులిసిన ఆహారం అంటే ఇడ్లీ, దోశ లాంటివి తీసుకోవాలి. పులియబెట్టడం వల్ల అవి మంచివే కానీ వాటిలో బియ్యం వాడటం వల్ల పొద్దున్నే రక్తం లో చక్కర స్థాయిలు ఠక్కున పెరుగుతాయి. అలా కాకుండా ఉండాలి అంటే జొన్న ఇడ్లి, మిల్లెట్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, రాగి దోశె, జొన్న దోశె, ఓట్స్ దోశ, ఓట్స్ ఇడ్లీ ఇల్లాంటివి చేసుకోవాలి. వీటి  రెసిపీ వీడియోస్ నేను ఎప్పుడో చేశాను. కానీ దురదృష్టవశాత్తు మంచి ఎవరికీ నచ్చదు కదా. ఎక్కువ మంది చూడలేదు.

ఇప్పడు ఈ పోస్ట్ లో ఏమేమి ఆహారాలు ఉండాలో చెప్పాను కదా నెక్స్ట్ పోస్ట్ లో ఏ సమయానికి ఏ ఆహారం ఎలా తీసుకుంటే మంచిదో నేను నాకు సాధ్యమైనంత వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ లోపు మీరు ఇవి అన్నీ తెచ్చి పెట్టుకుంటారు అనుకుంటున్నాను. నేను ఈ పోస్ట్ ని proof reading చేయలేదు. అందువల్ల చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. రేపటికల్లా చేసేస్తాను. ధన్యవాదములు.

Exit mobile version