Site icon Maatamanti

Baingan Biryani Telugu Recipe-గుత్తి వంకాయ బిర్యానీ తయారీ

Baingan Biryani telugu recipe

Baingan Biryani Telugu Recipe with step by step instructions.English Version.

అన్నీ ఉండి ఏమీ తినలేకపొతే అంతకన్నా బాధ ఇంకోటి లేదు. ఇలా అంటున్నానేంటా అనుకుంటున్నారా? ఈ బిర్యానీ చేసినప్పుడు నేను keto డైట్ లో ఉన్నాను. తినకుండా ఉండడానికి ఎంత ఇబ్బంది పడ్డానో చెప్పలేను. అదిరిపోయే సువాసన, చూడడానికి సూపర్ గా ఉండడంతో నోరూరిపోయింది.ఇంకో 15 రోజులలో ఈ డైట్ ఆపేస్తున్నాను అప్పుడు మాత్రం ముందుగా ఇదే చేసుకుని కొద్దిగా అయినా సరే తింటాను.

మా అమ్మాయికి సరిపడా ఉంచి మిగిలింది మా ఆయన వాళ్ళ కొలీగ్స్ కి పంపించాను.వారు తిని చాలా రుచిగా ఉందని చెప్పారు. ఎప్పుడూ అన్నం గంటల తరబడి నమిలే మా అమ్మాయి సరిగ్గా 5 నిమిషాలలో తినేసింది.తనకి కూడా బాగా నచ్చిందట.ప్రతీ ముద్దకొకసారి “అమ్మా సూపర్” అంటూ తినింది :).

ఈ రెసిపీ ని నేను రెండు సంవత్సరాల ముందే ట్రై చేశాను. కానీ అప్పుడు సరిగ్గా కుదరలేదు. అందుకే వదిలేశాను. అప్పటికి ఇంకా వంకాయ బిర్యానీ ఎవరూ చేయలేదు. ఇప్పుడు బయట హోటల్స్ లో వంకాయ బిర్యానీ బాగా పాపులర్ అయింది. నేనయితే బయట ఎక్కడా టేస్ట్ చేయలేదు కానీ మా ఆయన చెప్పారు. తను టీమ్ లంచ్ కి వెళ్ళినప్పుడు అక్కడ తన శాకాహార స్నేహితులు ఆర్డర్ చేశారంట. వాళ్ళకది బాగా నచ్చిందని చెప్పారట. సర్లే మనం కూడా ట్రై చేస్తే బాగుంటుందని ఈసారి మళ్ళీ ప్రయత్నించాను. చాలా సూపర్ గా కుదిరింది.

మామూలుగా అయితే వంకాయలని ప్లస్ ఆకారంలో గాట్లు పెట్టి నేరుగా బిర్యానీ మారినేషన్  మిశ్రమం లో వేస్తారు. కానీ ఇంకా కొద్దిగా రుచిగా చేయడం కోసం నేను వంకయాలలో గుత్తి వంకాయ కూరలో పెట్టే స్టఫ్ పెట్టి చేశాను. మీకు ఇష్టం లేకపోతే మీరు ఈ స్టెప్ ని స్కిప్ చేసి మామూలుగా చేసుకోవచ్చు. స్టఫింగ్ మసాలా కొద్దిగా మిగిలింది.

ఈ బిర్యానీ చేయడానికి వెడల్పు తక్కువగా ఉన్న మందపాటి పాత్ర ఉపయోగిస్తే మంచిది.వెడల్పు తక్కువగా ఉండడం వల్ల బిర్యానీ మారినేషన్ మిశ్రమం కొద్దిగా ఎక్కువ నిండి వంకాయలు మునిగేటట్లుగా ఉపయోగపడుతుంది.అప్పుడు వంకాయలు చక్కగా ఉడకడమే కాకుండా ఆ మసాలాలన్నీ బాగా పడతాయి.ఈ బిర్యానీ ని సిమ్ లో ఉంచి మాత్రమే 20 నుండి 25 ఉడికించాలి.అప్పటికీ వంకాయలు ఉడకక బిర్యానీ మసాలా మిశ్రమము అడుగంటుతున్నట్లు అనిపిస్తే స్టవ్ కట్టేసి మరిగే నీటిపై బిర్యానీ పాత్ర ను కాసేపు ఉంచి ఉడికించాలి.

దానిని వృధా చేయకుండా నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేయించి, కొద్దిగా చింతపండు రసం, రెండు ఉడికించిన టమాటో లు, ఉప్పు, కారం, పసుపు, ఈ మిగిలిన మసాలా వేసి బిర్యానీ గ్రేవీ తయారు చేశాను.చాలా బాగా కుదిరింది. వంకాయ బిర్యానీ తో కాంబినేషన్ గా బాగుంది.రెగ్యులర్ బిర్యానీ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా వంకాయ బిర్యాని చేసుకుని తినవచ్చు. లేదా కొన్ని పండగల సమయంలో మాంసాహారం తినకూదడనే నియమం ఉంటుంది కదా. అలాంటప్పుడు బిర్యానీ తినాలనిపిస్తే ఈ బిర్యానీ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ గుత్తి వంకాయ బిర్యానీ ని తయారు చేస్తారని ఆశిస్తున్నాను.ఒకవేళ తయారు చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు.

మీకు నచ్చే మరికొన్ని వంటలు

Bongulo Chicken Biryani Recipe in Telugu
Pressure Cooker Biryani Recipe in Telugu
Chicken Biryani Recipe in Telugu
Ulavacharu Chicken Biryani Recipe in Telugu
Fish Biryani Recipe in Telugu
Mutton Biryani Recipe in Telugu
Prawns Biryani Recipe in Telugu
Prawns Pulao Recipe in Telugu

Click here for the English Version of this Recipe

Text version of Baingan Biryani Telugu Recipe

Baingan Biryani Telugu Recipe
Prep Time
25 mins
Cook Time
30 mins
Total Time
55 mins
 

గుత్తి వంకాయలతో చేసిన రుచికరమైన హైదరాబాదీ బిర్యానీ

Course: Main Course
Cuisine: Hyderabadi
Author: బిందు
Ingredients
స్టఫింగ్ మసాలా కొరకు
  • 500 గ్రాములు గుత్తి వంకాయలు
  • 2 tbsp ధనియాలు
  • 2 tbsp పచ్చిశనగ పప్పు
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp నువ్వులు
  • 2 tbsp పల్లీలు
  • 6 లేదా 7 మెంతి గింజలు
  • 5 లేదా 10 గ్రాములు చింతపండు
  • 5 వెల్లుల్లి రెబ్బలు
  • 5 లేదా 6 ఎండుమిరపకాయలు
  • లవంగాలు
  • ½ అంగుళం దాల్చినచెక్క
మారినేషన్ కొరకు
  • ½ tsp పసుపు
  • 2 tbsp కారం
  • 1 tbsp బిర్యానీ మసాలా
  • ఉప్పు తగినంత
  • 1 ½ tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 2 tbsp పచ్చిమిర్చి తరుగు
  • ¼ కప్పు డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు
  • ¼ కప్పు పుదీనా ఆకులు
  • 500 గ్రాములు పెరుగు
  • ¼ కప్పు కొత్తిమీర
  • 2 tsp నెయ్యి
అన్నం వండుట కొరకు
  • 350 గ్రాములు బాస్మతి బియ్యం
  • 2 లేదా ౩ లీటర్ల నీళ్ళు
  • ఉప్పు తగినంత
  • అన్ని గరం మసాలా దినుసులు
  • 2 tbsp నూనె
  • గుప్పెడు పుదీనా ఆకులు
బిర్యానీ కొరకు
  • ¼ కప్పు డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు
  • ¼ కప్పు పుదీనా ఆకులు
  • 4 లేదా 5 tbsp నూనె
  • 2 tsp నెయ్యి
  • ¼ కప్పు కొత్తిమీర తరుగు
  • అల్యూమినియం ఫాయిల్
Instructions
బియ్యం నానబెట్టుట
  1. బాస్మతి బియ్యాన్ని ఒక అరగంట పాటు నీళ్ళలో నానబెట్టాలి.
  2. వండే ముందు 2 నుండి ౩ సార్లు కడగాలి.
స్టఫింగ్ మసాలా కొరకు
  1. పెనంలో నూనె వేడి చేసి ధనియాలు, పచ్చి శనగ పప్పు, పల్లీలు, ఎండు మిరపకాయలు వేసి బ్రౌన్ రంగులోకి మారే వరకు వేయించాలి.
  2. తర్వాత జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, దాల్చినచెక్క, చింతపండు వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ కట్టేసి కాసేపు చల్లారనివ్వాలి.
  3. తర్వాత మిక్సిలో కి తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి తర్వాత స్టఫ్చేయడానికి వీలుగా గట్టి ముద్దగా పేస్ట్ చేసుకోవాలి.
మారినేషన్ మిశ్రమం తయారీ
  1. ఒక గిన్నెలో పసుపు, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు, నిమ్మ రసం, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, వేయించిన ఉల్లిపాయలు, పెరుగు, నెయ్యి వేసి బాగా కలపి పక్కన పెట్టుకోవాలి.
మసాలా స్టఫ్ చేయు విధానం
  1. గుత్తి వంకాయలను శుభ్రంగా కడగాలి.
  2. వాటిని ప్లస్ ఆకారంలో కట్ చేసి లోపల పుచ్చులున్నాయేమో చూసుకోవాలి.
  3. ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను అన్ని వంకయాలలో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
అన్నం వండుట
  1. గిన్నెలో 2 నుండి ౩ లీటర్ల నీళ్ళు బాయిల్ చేయాలి.
  2. నీళ్ళ రుచి ఉప్పగా అనిపించేంత వరకు ఉప్పు వేయాలి.అన్నం అంటుకోకుండా పొడిగా రావడానికి కొద్దిగా నూనె కూడా వేయాలి.
  3. అన్ని గరం మసాలా దినుసులు, పుదీనా ఆకులు కూడా వేసి మరిగించాలి.
  4. నీళ్ళు మరగడం మొదలవగానే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేయాలి.
  5. బియ్యం వేయగానే నీళ్ళు మరగడం ఆగిపోతుంది. మళ్ళీ మరిగే వరకు ఆగాలి.
  6. మళ్ళీ మరగడం మొదలైన దగ్గర నుండి సరిగ్గా ౩ నిమిషాల సేపు ఉడికించి స్టవ్ కట్టేసి వెంటనే నీళ్ళు వార్చేయాలి.
బిర్యానీ ని అసెంబుల్ చేయుట
  1. వెడల్పు తక్కువగా ఉన్న ఒక మందపాటి పాత్రను తీసుకోవాలి.
  2. ముందుగా తయారు చేసి పెట్టుకున్న మారినేషన్ మిశ్రమాన్ని ఆ పాత్రలోకి తీసుకోవాలి.
  3. అందులో స్టఫ్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలను పెట్టాలి.
  4. పైన సగం ఉడికించిన అన్నాన్ని వేసి సమంగా సర్దాలి.
  5. కొద్దిగా పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, నెయ్యి వేసి అల్యూమినియం ఫాయిల్ తో గిన్నెను కవర్ చేయాలి.
బిర్యానీ వండుట
  1. పైన మూత పెట్టి 20 నుండి 25 నిమిషాలు సన్నని సెగ మీద ఉడికించాలి.హై ఫ్లేమ్ లో పెట్టకూడదు.
  2. ఒకవేళ వంకాయలు ఉడికినట్లు అనిపించక పొతే బిర్యానీ పాత్రను మరుగుతున్న నీటిపైన ఉంచి ఇంకాసేపు ఉడికించాలి.
  3. ఉడికాక స్టవ్ కట్టేసి మూత తెరవ కుండా కాసేపు ఉంచి తర్వాత సర్వ్ చేయాలి.

Baingan Biryani Telugu Recipe

Exit mobile version