Site icon Maatamanti

About Me

నా గురించి నేను చేసే పని గురించి:

నా పేరు హిమ బిందు. నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ చేశాను. రోజూ ఏదో ఒక్క కొత్త విషయం నేర్చుకోనిదే నాకు నిద్ర పట్టదు. ఏదైనా చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే అది జరిగే వరకు నేను ఎవరినీ పట్టించుకోను, నిద్రపోను. నేను ఏదైనా చేయలేదు అంటే అది చేయాలని నేనింకా అనుకోలేదని అర్ధం. కొద్దిగా సినిమా డైలాగ్ లా ఉన్నా అది మాత్రం నిజం. నా చివరి శ్వాస వరకు విద్యార్ధిని గా ఉండాలనేదే నా ఆశ. మనం ఏదైనా ఉపయోగపడే కొత్త విషయం తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పది అని నేనెప్పుడు నమ్ముతాను.

నేను పెళ్లయినాకే మాస్టర్స్ డిగ్రీ చేశాను. అప్పుడు మా అమ్మగారు మా ఇంట్లో ఉండి మా పాపని చూసుకునే వారు. నా రెండవ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక మా అమ్మగారు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. అది నేనస్సలు తట్టుకోలేక పోయాను. ఒక్కసారే నాకేమి చేయాలో అర్ధం కాలేదు. లైఫ్  అంతా చాలా శూన్యం గా అనిపించింది. అమ్మనే గుర్తు చేసుకుంటూ తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లాను. రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చేదాన్ని. చాలా లావయిపోయాను. ఆ డిప్రెషన్ లో నుండి బయట పడడానికే ఎప్పుడూ ఏదో కోర్స్ లో జాయిన్ అవడం, మా అమ్మాయి school కి వెళ్ళిన సమయం లో వెళ్లి నేర్చుకోవడం చేస్తుండే దాన్ని. కానీ ఉద్యోగం చేసే ఉద్దేశ్యం మాత్రం లేదు. ఇది నేను మా అయన కలిసి తీసుకున్న నిర్ణయం. మా పాప school నుండి ఇంటికి వచ్చే సరికి మా ఇద్దరిలో ఎవరో ఒకరం కచ్చితంగా ఇంట్లో ఉండాలి. డబ్బు సంపాదించక పోయినా పర్వాలేదు కానీ తనని మాత్రం జీవితంలో ఎప్పుడూ క్రష్ లో, డే కేర్ సెంటర్స్ లో, ట్యూషన్ లో, హాస్టల్ లో  కానీ వేయకూడదని అనుకున్నాము.

ఇక నా కుటుంబం గురించి చెప్పాలంటే నేను, మా హస్బెండ్ ఇంకా మా అమ్మాయి. చిన్న ఫ్యామిలీ. మా ఆయన సచిన్ వీక్ డేస్ లో software Engineer గా పనిచేస్తారు వారాంతాల్లో  వ్యవసాయం చేస్తారు. మా అమ్మాయి సహస్ర(హనీ) ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది. నేను చేసే ప్రతీ పనిలో వారిద్దరూ నాకెంతో సహాయంగా ఉంటారు. నా అతి కోపాన్ని, అసహనాన్ని, నా పిచ్చి ని సహించి నా పనికి విలువిచ్చి నా మానాన నన్ను వదిలేస్తుంటారు. రోజు ఉదయం 5.30 గంటలకు లేస్తాను మళ్ళీ రాత్రి 1 లేదా 2 గంటలకు పడుకుంటాను. మా అమ్మాయి 7.30 కు school కి వెళ్ళడంతో ఇక నా పనులు ముగించుకొని 8.30 గంటల కంతా నా వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. అవసరమైతే మధ్యాహ్నం ఓ గంటన్నర పడుకుంటాను. అంటే నేను రోజూ సుమారు 16 నుండి 18 గంటలు ఖచ్చితంగా పనిచేయాలి. రెండు వెబ్ సైట్ లు foodvedam.com & maatamanti.com ,  youtube ఛానెల్స్  foodvedamB like Bindu ఇంకా మా అమ్మాయి చదువు, ఇంటి పని చూసుకోవాలి. website లు చూసుకోవడం లేదా బ్లాగింగ్ చేయడం చాలా చాలా కష్టం. ఒక వెబ్ సైట్ ని  5 గురి నుండి సుమారు 20 మంది సభ్యుల దాకా మైంటైన్ చేస్తుంటారు. అందులో ఒక్కరే మెయింటైన్ చేయాలంటే మరీ కష్టం.

ఎప్పుడు ఎవరిని నాకిది నేర్పించమని అడగలేదు. ఇంకొకరి మీద ఆధార పడడం అంటే నాకు చాలా చిరాకు(ఒక్క మా ఆయన మీద తప్ప 😜). వెబ్ ఆర్టికల్స్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతగా వారి యాడ్స్ ని క్లిక్ చేసి నాకవసరమైనవి షాపింగ్ కార్ట్ లో యాడ్ చేసుకుంటాను. youtube లో అయితే వారి వీడియోస్ చూసే టప్పుడు యాడ్స్ వస్తే స్కిప్ చేయకుండా చూస్తాను. దీని వల్ల వారికి కొంత డబ్బు వస్తుంది. వారు నాకవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆమాత్రం కూడా చేయకపోతే ఎలా?

వెబ్ సైట్స్ స్టార్ట్ చేసే ముందు అసలు ఏమి చేయాలో ఎలా చేయాలో కొద్దిగా కాదు కదా ఒక్క ముక్క కూడా ఐడియా లేదు. కంటెంట్ రాయడం వచ్చు కానీ వెబ్ సైట్ తయారు చేయడం రాదు. బయట అడిగితే నాకు కావాల్సిన Functionality కి 2 1/2 లక్షలు అడిగారు. నేను డబ్బు సంపాదించక పోయినా పర్వాలేదు కానీ వృధా మాత్రం చేయ కూడదని ఎలా అయినా నేనే స్వంతంగా తయారు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. రాత్రిళ్ళు నిద్ర పోకుండా గంటలు గంటలు వాటి గురించి చదివి wordpress గురించి తెలుసుకున్నాను.తక్కువ ఖర్చుతో మొదలు పెట్టాను. మొదట్లో చాలా చాలా కష్టపడ్డాను. మొదట్లో  ఒకసారి అయితే వెబ్ సైట్ బ్యాక్ అప్ చేసుకోక పోవడం వల్ల బ్యాక్ ఎండ్ లో plugins misconfiguration వల్ల సైట్ మొత్తం ఎగిరి పోయింది.ఆ రోజు రాత్రంతా కూర్చుని ఏడ్చాను. మా ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తో మళ్ళీ పని మొదలు పెట్టాను. గూగుల్ cached పేజెస్ సహాయంతో మళ్ళీ కంటెంట్ అంతా create చేసుకున్నాను. దీని తర్వాత బ్యాక్ అప్ చేసుకోవడం ఎప్పుడూ మర్చిపోలేదు.

ఇదంతా విడమర్చి ఇంతగా నా గురించి చెప్పానంటే, ఈ నాలుగేళ్ళలో వీటిని ఈ స్థితికి తీసుకు రావడానికి నేనెంతో శ్రమ పడ్డాను. ఒక వెబ్ సైట్ గానీ youtube చానెల్ కానీ స్టార్ట్ ఎవైరనా స్టార్ట్ చేయ వచ్చు.కానీ వాటిని మైంటైన్ చేయడం చాలా చాలా కష్టం. పైగా కేవలం డబ్బు కోసమే అయితే మాత్రం వేరే దారి చూసుకోవడం మంచిది. ఎందుకంటే మొదలు పెట్టిన వెంటనే అసలు డబ్బు రాదు. డబ్బు గురించి ఆలోచించకుండా నిరంతరం అలుపు లేకుండా శ్రమిస్తూనే ఉండాలి.ఇవాళ మొదలు పెట్టగానే రేపు డబ్బులు రావాలనుకునే వారు అసలు వీటి గురించి ఆలోచించక పోవడమే మంచిది.

వీటన్నింటి కంటే ముందు దాదాపు సంవత్సరంన్నర్ర GROUP-2 పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను. కానీ సాధించలేకపోయాను. అది అంత తేలిక కాదని నాకు తెలుసు. ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలీదు.  అసలు నేను దాని గురించే ఆలోచించ లేదు. నాకు కావలిసింది ఖాళీగా ఉండకుండా ఉండడం మాత్రమే. చేసే పని నా ప్రయత్న లోపం లేకుండా నిబద్ధతతో చేయడమే నాకు తెలుసు. అంతకు ముందు బయట కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో .Net Framework కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలి అని వెంటనే గ్రూప్స్ లో జాయిన్ అయ్యాను. మా ఆయన, మా అమ్మాయి, మా నాన్న తప్ప చాలా మంది నన్ను ఎగతాళి చేశారు. చదవగానే నీకేదో ఉద్యోగం వచ్చేసినట్లు అనే భావంతో. కానీ వాళ్ళని చూసి నేను మనసులో నవ్వుకునేదాన్ని. విద్యార్జన కేవలం ధనార్జన కోసం కాదు జ్ఞానార్జన కోసమని పాపం వాళ్లకు తెలీదు కదా. చదివిన చదువుతో డబ్బు సంపాదించ లేకపోతే అసలా చదువే వృధా అనే దురభిప్రాయం ఈ సమాజంలో చాలా మందికి ఉంది.

చదువును డబ్బుతో తూకం వేయడం అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. కానీ నా ప్రిపరషన్ అయ్యే సరికి నేను, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ లో చాలా తెలుసుకున్నాను. ఎకానమీ మాత్రం లో నేను చాలా చాలా వీక్. మా అమ్మాయికి ఏది కావాలంటే అది హ్యాపీ గా నేనే చెప్తాను.తనకి ఇంతవరకు ట్యూషన్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. అసలు నేను చదివేటప్పుడే మా అమ్మాయి కూడా నాతో పాటు అవన్నీ చాలా మటుకు నేర్చేసుకుంది. ఇంత పెద్ద explanation నన్ను చూసి నవ్వుకున్న వాళ్లకి నేను ఇవ్వలేదు. మూర్ఖులని మార్చే ఉద్దేశ్యం నాకు లేదు.

నాకు అంత్యంత ఇష్టమైనవి

నేనంటే నాకు చాలా ఇష్టం. ఏకాంతంగా ఉండడం అంటే ఇష్టం. ఏకాంతంలో ప్రశాంతత ఉంటుంది. మనతో మనం ఎన్నో మాట్లాడుకోవచ్చు, తిట్టుకోవచ్చు, తర్కించుకోవచ్చు, మనల్ని మనం సరిచేసుకోవచ్చు. జ్ఞానం సంపాదించవచ్చు. మనతో మనం స్నేహం చేయవచ్చు. మన గురించి మనం బాగా తెలుసుకోవచ్చు. ఇదేదో పిచ్చి మాటల్లా ఉన్నా నిజంగా నిజం. ఇది అర్ధం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుంది చాలా అందంగా అనిపిస్తుంది. ఎవరైనా నన్ను “ఎప్పుడు ఒక్కదానివే ఉంటావు బోర్ కొట్టదా నీకు?” అంటే నవ్వి ఊరుకుంటాను. ఎలా చెప్పాలి వాళ్లకి ఇంకొకరి వల్ల కలిగే ఆనందం వారితోనే వెళ్ళిపోతుందని. వాళ్ళ వలన కలిగిన దుఃఖం వాళ్ళు వెళ్ళిపోయినా పోదని. 

నాకు నాతో పాటు పల్లెటూర్లు, అటవీ ప్రాంతాలు, అందమైన ప్రకృతి, చెట్లు, కుక్కలు, ఆవులు, గేదెలు, వ్యవసాయం. నా ఏకాంతంలో ఇవి ఇప్పుడు ఉంటాయి. వీటిలో ఏది కనిపించినా నన్ను నేను మర్చిపోతాను.

ఆహారం లో అయితే అరటి ఆకులో వడ్డించిన ఆంధ్రా భోజనం, మా అమ్మ కలిపిచ్చే కమ్మని కాఫీ(ఇప్పుడు లేదు 🙁 ), చాకొలెట్లు( మా అమ్మయి దగ్గర లాక్కొని తినేవి ఇంకా బాగుంటాయి 🙂 ), మా ఆయన నాకు ప్రేమతో తినిపించే పప్పన్నం.

టీవీ లో అయితే పాత బ్లాక్ & వైట్ తెలుగు సినిమాలు అంటే చచ్చేంత పిచ్చి. మా ఆయనకీ, మా అమ్మాయికి కూడా అలవాటు చేశాను. డోరేమాన్, షిన్ చాన్, టామ్&జెర్రీ, పింక్ పాంథర్, మోటు పత్లు కార్టూన్స్, ఇంకా ఇంగ్లీష్  మూవీ చానల్స్ అంటే ఇష్టం.

ఎప్పుడూ చిలిపిగా ఉంటూ అల్లరి పనులు చేయడం అంటే నాకిష్టం. మా అమ్మాయి రాస్తుంటే తన చేయి కదిలించడం, నీళ్లు తాగుతుంటే నీళ్లు ముఖం మీద పడేలా గ్లాస్ ను కొట్టడం, నీళ్లు తాగి మా అమ్మాయి మీద మా ఆయన మీద ఊయడం లాంటి పిచ్చి పనులు. మా హనీ ని నేనే  గిచ్చి తనే నన్ను గిచ్చిందని సచిన్ కి అబద్దం చెప్పడం. ఆటల్లో తొండి చేయడం నాకిష్టం. ఏదో ఒక నోటికొచ్చిన అబద్దం చెప్పి హనీని మా ఆయనతో తిట్టించడం భలే ఉంటుంది. నా చాకోలెట్లు ముందే  గబ గబా తినేసి దొంగతనంగా మా హనీ చాకోలెట్లు కూడా తినడం బాగుంటుంది. మా అమ్మాయి హోమ్ వర్క్ diary లో సైన్ చేయమంటే రోజుకోలా చేస్తాను. టీచర్ మా అమ్మాయే సైన్  చేసిందనే అనుమానంతో దాన్ని పనిష్  చేయాలని. మొదట రెండు మూడు సార్లు అనుమానించినా ఇక టీచర్స్ కి కూడా తెలిసిపోయి నేను ఎంత ఛండాలంగా పెట్టినా  ఏమి అనేవారు కాదు.

నాకు అస్సలు ఇష్టం లేనివి

పక్కింటి వాళ్ళతో ఎదవ సోది మాట్లాడడం. నేను ఎవరింటికీ వెళ్ళను. వాళ్ళ పర్సనల్ విషయాల్లో అసలు జోక్యం చేసుకోను. అతి చొరవ తీసుకోను. నా హద్దుల్లో నేను ఉంటాను. ఒకవేళ తప్పని పరిస్తితులలో మొహమాటానికి ఏదైనా  వినాల్సి వస్తే విని వెంటనే వదిలేస్తాను. 5 నిమిషాలకు మించి ఎవరైనా ఏదైనా నాకు ఇష్టం లేని విషయాలు మాట్లాడుతుంటే చాలా ఇబ్బంది పడతాను.  3 వ వ్యక్తి గురించి మాట్లాడితే వినడం నాకిష్టం లేదు. అసలు నాకలాంటివి వినే టైమే ఉండదు. చాలా చాలా చిరాకు నాకు. మా అమ్మ నాకు అలా ఉండడం అలవాటు చేశారు. తను కూడా టిపికల్ హౌస్ వైఫ్ లా ఒకరి మీద ఒకరికి చెప్పడం లాంటివి చేసేవారు కాదు.

మేక్ అప్ చేసుకోవడం అంటే ఇష్టం లేదు. అసలు ఎలా వేసుకోవాలో కూడా నాకు తెలీదు. నేనెప్పుడూ దాని జోలికి పోలేదు.beauty parlors కి వెళ్ళను.నా హెయిర్ కట్ కి కూడా మా ఆయన వెళ్ళే మెన్స్ సెలూన్ కి వెళ్తాను. అద్దం ముందు అర నిమిషం నిలుచున్నా టైమ్ వేస్ట్ అనిపిస్తుంది నాకు.

భారీగా నగలు వేసుకోవడం, దుస్తులు ధరించడం ఇష్టం ఉండదు. ఒక్క మా ఆయన  తయారవమని అడిగితే తయారవుతాను తప్ప ఇంకెవరు ఏమి అనుకున్నా అసలు పట్టించుకోను. పొడవాటి జుట్టు ఇంకా పూలు తలలో పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదు. అవి అందంగా చెట్టు మీదే ఉంటే ఎంతో బాగుంటాయి.

హ్యాండ్ బాగ్ తగిలించుకోవడం ఇష్టం లేదు. ఒక వేళ బలవంతగా తగిలించుకున్నా కచ్చితంగా ఎక్కడ పెడితే అక్కడ మర్చిపోయి వస్తాను.

టీవీ సీరియల్స్, వాటిలో పాత్ర దారులు ప్రదర్శించే అతి క్రూరమైన హావ భావాలు చూస్తే నాకు పరమ కంపరం. ఈ మధ్య చవకబారు ద్వందార్దపు డైలాగులతో కూడిన కొన్ని ప్రోగ్రాములు వస్తున్నాయి. అవంటే ఇంకా అసహ్యం. మా ఇంట్లో అలాంటివి  పూర్తిగా నిషిద్దం.

ఫోన్ వాడడం, ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడడం నాకు విపరీతమైన allergy. అసలు నేను ఎవ్వరికీ ఫోన్ చేయను. ఈ విషయంలో నావాళ్లందరికీ థాంక్స్ చెప్పాల్సిందే. నన్ను అర్ధం చేసుకుంటారు. నా ఫోన్ లో ఫీడ్ అయిన నంబర్స్ నాకు తెలిసిన నంబర్స్ వస్తేనే కాల్ అటెండ్ చేస్తాను. అప్పుడప్పుడు మా తమ్ముడికి తప్ప ఎవరికీ కాల్ చేయను. facebook లాంటివి వాడను. అది ఓపెన్ చేసి 2 సంవత్సరాలవుతోంది.

నా భయాలు ఫోబియాలు

కాలింగ్ బెల్ శబ్దం, సెల్ ఫోన్ శబ్దం, గుర్ఖా విజిల్, సినిమా హాల్ లో సౌండ్స్  అస్సలు పడదు. కొద్దిసేపు వినగానే చెమటలు పట్టేస్తాయి. గుండె దడ దడా కొట్టుకుంటుంది. దీనినే ఫోనో ఫోబియా అంటారు. అందుకే మా ఇంట్లో కాలింగ్ బెల్ ఉండదు. నా ఫోన్ దాదాపు మ్యూట్ లోనే ఉంటుంది. సినిమా కి వెళ్లడం అరుదు. thank god గూర్ఖాలు ఇప్పుడు లేరు.

క్యూ లో నిల్చోవాలంటే భయం. అందుకే రద్దీగా ఉండే గుడికి వెళ్ళలేను. పబ్లిక్ transport యూస్ చేయలేను. ప్రయాణాలంటే భయం ఆక్సిడెంట్ అవుతుందేమోనని.. చావంటే భయం లేదు కానీ అలా చావడం మాత్రం ఇష్టం లేదు. బయట ఎవరైనా ఇంట్లో కానీ షాపింగ్ మాల్స్ లో కానీ టాయిలెట్స్ వాడాలంటే ఇంకా భయం.

అతి శుభ్రం. నన్ను ఎవరైనా ముట్టుకుంటే భయం. మా అమ్మాయిని కూడా ముట్టుకోనివ్వను. స్కూల్ లో విపరీతంగా ఆడుకుని  వస్తుంది కదా క్రిములు ఉంటాయేమోనని భయం. ఎవరింటికీ వెళ్ళడానికి వేరే ఊరు వెళ్ళడానికి ఇష్టపడను. అక్కడ నాకు నచ్చినట్లు శుభ్రంగా ఉండదని నా భయం. నా రోజులో కనీసం రెండు గంటలైనా ఇంటిని శుభ్రం చేయడానికి కేటాయిస్తాను. సమస్య ఏంటంటే శుభ్రంగా ఉన్నా శుభ్రం చేస్తాను. బాగా అలసిపోతాను.  ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు గోడల మీద చేతులు పెట్టినా, సోఫాలో కాళ్ళు పెట్టినా ఇష్టం ఉండదు. గోడల మీద మరకలు పడతాయేమోనని భయం. మరకలు, గీతలు ఉన్న గోడల్ని చూడలేను. వాళ్ళ కాళ్లకు ఉన్న క్రిములు అన్నీ సోఫాలో పాకుతూ ఉంటాయేమోనని టెన్షన్ పడతాను. మా అమ్మ, నాన్న, మా ఆయన, మా అమ్మాయి హనీ, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రశాంతి మాత్రమే నాలా అతి శుభ్రంగా గా ఉంటారని నాకు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే వాళ్లకు కూడా నాలానే అతి శుభ్రం జబ్బు ఉండడం వల్ల వాళ్ళు  నా టీమ్ లో ఉంటారు. మిగిలిన అందరు ఏలియన్స్ నాకు😜.

కానీ ఎందుకో ఇంత అతి శుభ్రం జబ్బు ఉన్నా వీధి కుక్కల్ని మాత్రం బాగా ముద్దు చేస్తాను. అవి ఎంత మురికిగా ఉన్నా ముట్టుకుంటాను. ఒక్కోసారి ముట్టుకున్న వెంటనే చేయి కడుక్కునే అవకాశం లేదు అని తెలిసి నప్పుడు దూరం నుండే ముద్దు చేస్తాను. మా అమ్మాయికి ఎంత కోపమో. నీకు నాకన్నా ఆ కుక్కలే ఎక్కువా  అంటుంది.పేద ముసలి వారు రోడ్ మీద కనిపిస్తే వారు ఎంత మురికిగా ఉన్నా పట్టించుకోను. ఆ రెండు సందర్భాలలో నా అతి శుభ్రాన్ని కష్టమైనా వదిలేస్తాను.

నా గురించి చాలా ఎక్కువ రాశాను కదూ! ఇంత అవసరమా అంటే అవసరమే. మీరు సరిగ్గా అర్ధం చేసుకుంటే మొత్తం కాకపోయినా ఎంతో కొంత సందేశం దాగి ఉంది. ఎప్పుడు ఎదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలని, ఖాళీగా ఉండకూడదని, ఎవరి మీద  ఆధారపడకూడదని, మనల్ని మనం ప్రేమించుకోవాలని, ఎంత వయసు వచ్చినా చిన్న పిల్లలాగానే ఉండాలని, Hmm వీటిన్నింటికి మించి బాగా శుభ్రంగా ఉండాలని సందేశం ఉంది. అవునా? కాదా ?😜🤗😊😊😘

 

Exit mobile version