Site icon Maatamanti

About Intermittent Fasting Telugu-ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి?

Intermittent Fasting Telugu

Intermittent Fasting అనే మాట ఈ మధ్య మన దగ్గర బాగా వినిపిస్తున్న మాట. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీరమాచినేని గారి డైట్ ప్రాచుర్యం లోకి వచ్చినప్పుడే ఇది కూడా బాగా  ప్రాచుర్యం పొందింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అదేదో డైట్ అనుకునేరు. ఇది డైట్ కానే కాదు. అది ఒక మంచి ఆహారపు అలవాటు. ఎటువంటి డైట్ అయినా ఒక పర్టికులర్ పర్పస్ ని సర్వ్ చేస్తుంది. అంటే బరువు పెరగడానికో లేదా తగ్గడానికో, కంటి చూపు మెరుగవడానికి  లేదా కిడ్నీ సమస్యల నుండి త్వరగా బయట పడడానికో ఇలా దేనికి సంబంధించి దానికి కొన్ని ప్రత్యేక ఆహార నియమాలను పాటిస్తే ఆ సమస్య నుండి త్వరగా బయట పడతారు. సో దీన్ని బట్టి డైట్ అనేది ఆహారపు అలవాటు కాదు అది ఒక ఆహార నియమం. అది కొద్ది రోజులు పాటిస్తే సరిపోతుంది. కానీ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మీరు జీవితాంతం పాటించినా ఏమి కాదు.  ఎందుకంటే ఇది ఒక మంచి ఆహారపు అలవాటు లేదా ఆహార శైలి(eating pattern). రోజులో ఉన్న 24 గంటలలో ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా కొన్ని గంటలలో మాత్రమే మనం తినాలనుకున్నది తినడం IF. అంటే 12 గంటలు ఏమి తినకుండా ఉండి ఇంకో 12 గంటలలో మాత్రం 2 సార్లుగా మనం తినాలనుకున్నది తినడం. లేదా 16 గంటలు ఏమి తినకుండా ఉండి మిగిలిన 8 గంటలలో మాత్రమే 2 సార్లుగా తినడం.

మన పూర్వీకులు మనకు కొన్ని అమృత వచనాలు చెప్పారు. అందులో ఒకటి “లంకణం పరమావుషాధం” అని. అంటే  ఫాస్టింగ్ కన్నా మంచి మెడిసిన్ లేదు అని దాని అర్ధం. మన చెడు ఆహారపు  అలవాట్ల వల్ల  మన అపసవ్యమైన జీవన శైలి వల్ల మన శరీరం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. వాటిలో చాలా మటుకు మనకు తేలీకుండా మన శరీర అంతర్గత వ్యవస్థ వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని తిప్పి కొడుతుంది. మనమేమో అంతా బాగానే ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటాము.  కానీ ఒక్కో సారి మన శరీరం కూడా అలసిపోయి అంతర్గత సమస్యలను ఎదుర్కోలేని నిస్సహాయ స్థితికి వస్తుంది. అప్పుడు అవి ఒక్కొక్కటిగా ఆరోగ్య సమస్యల రూపంలో బయట పడి మనని బాధిస్తుంటాయి. కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. మన బాధలకు మనమే పూర్తి బాధ్యులము.

మనం తిన్న చెత్త  అంతటిని అరిగించడమే కాక మన అంతర్గత వ్యవస్థకు లోపల చక్కబెట్టాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. అది అర్ధం చేసుకోకుండా మనం ఇష్టం వచ్చినప్పుడల్లా ఎంత పడితే అంత తినేస్తుంటాము. రుచి నోటికి మాత్రమే కడుపుకి కాదు అనే విషయాన్ని అస్సలు పట్టించుకోము. మన నోటికి టేస్ట్ అనిపించేదంతా పొట్ట లోకి వెళ్ళాక వేస్ట్ అని మనం తెలుసుకోవాలి. మనం అలా ఇష్టం వచ్చినట్లు ఎక్కువెక్కువ తినేస్తుంటే మన అంతర్గత వ్యవస్థ యొక్క సమయం, సామర్ధ్యం రెండింటినీ మనం తిన్నది అరిగించడానికే ఉపయోగిస్తుంది. ఇంకా మిగిలిన లోపాలను చక్కబెట్టే సామర్థ్యం ఎక్కడ ఉంటుంది చెప్పండి ? సో అటువంటి తప్పు జరగకుండా మన శరీరానికి మనం తిన్న ఆహారాన్ని అరిగించడమే కాకుండా అంతర్గత సమస్యలను సరిదిద్దుకునేందుకు తగినంత సమయం ఇవ్వడమే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.

అంతే కాదు ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ కి మరొక ముఖ్య ఉపయోగం కూడా ఉంది. అది ఇన్సులిన్ ఉత్పత్తిని సాధ్యమైనంత వరకు తగ్గించడం లేదా నియంత్రించడం. మనం తిన్న ప్రతీ సారీ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ తింటే ఎక్కువ ఇన్సులిన్ ని విడుదల చేయాలి. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారంలో ఉన్న పిండి పదార్ధాల(carbohydrates)  నుండి విడుదలైన చక్కెరలను(షుగర్స్) నియంత్రించాలి కదా. రోజంతా ఎప్పుడు బడితే అప్పుడు తింటూ ఉంటే ఇన్సులిన్ కూడా ఉత్పత్తి అవుతూనే ఉండాలి.

ఇన్సులిన్ మనం అధికంగా తీసుకున్న ఆహారంలో నుండి విడుదలయిన అధిక చక్కెరలను (షుగర్స్ ను )  రెండు రకాలుగా శరీరం లో స్టోర్ చేయడానికి సహకరిస్తుంది.

1) ఆ రోజు శరీర అవసరాలకు సరిపోగా మిగిలిన చక్కెరలను ‘గ్లైకోజెన్’ గా మార్చి కాలేయం లోను శరీర కండరాల్లో ను నిల్వ ఉంచుతుంది. కానీ దీనికి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితికి మించి గ్లైకోజెన్ గా మార్చలేదు.

2) ఆ పరిమితిని దాటి ఉన్న గ్లూకోస్ ను గ్లైకోజెన్ లా కాకుండా ఫ్యాట్ రూపంలో  లివర్ లో దాస్తుంది. అంతే ఇక కొవ్వు  ఎక్కువ అవుతున్న కొద్దీ శరీరం లో ఎక్కడ బడితే అక్కడ దాచేస్తుంది 😆😆😆😆😆. దురదృష్టవశాత్తూ గ్లైకోజెన్ కి పరిమితి ఉన్నట్లుగా కొవ్వు కి పరిమితి లేదు. మన శరీరం ఎంత కొవ్వునైనా చక్కగా దాచిపెట్టుకోగలదు .

అందువల్ల మనం ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ద్వారా చేయాల్సింది ఏంటంటే సాధ్యమైనంత ఎక్కువ సేపు తినకుండా ఉండగలగడం. అంటే మనం తినే ఆహార సమయాన్ని రోజులో కొద్ది గంటలకు మాత్రమే పరిమితం చేయడం లేదా కుదించడం. మిగిలిన సమయం అంతా ఏమి తినకుండా ఉండడం. ఇలా చేయడం వల్ల శరీరం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయాల్సిన అవసరం గణనీయంగా తగ్గిపోతుంది. అంతే కాకుండా శక్తి అవసరమైనప్పుడు మన శరీరం లో ఇంతకు ముందే నిల్వ ఉన్న కొవ్వుని ఉపయోగించుకుని తద్వారా శక్తిని విడుదల చేస్తుంది. అందువల్ల మనం బరువు తగ్గుతాము.

ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనం ఏదైనా పని చేసే ముందు దాని మీద పూర్తి అవగాహనతో ఉండాలి. పూర్తి అవగాహనతో చేసినప్పుడు మాత్రమే మనం 100 శాతం ఫలితాలను పొందగలుగుతాము. అవగాహన లేకుండా నేను చెప్పాననో లేదా ఇంకెవరో చెప్పారనో ఇష్టం వచ్చినట్లు చేసేస్తే ఎవరు చెప్పింది వినాలో ఎందుకు చేయాలో ఎలా చేయాలో తెలియక తికమక పడతారు. చివరికి మీరు అనుకున్నది సాధించ లేకపోయామని బాధ పడతారు. అందుకే దేని గురించి అయినా పూర్తిగా తెలుసుకుని మాత్రమే మొదలు పెట్టాలి.

ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ వల్ల ఉపయోగాలు

  1. శరీర బరువును తగ్గించుకోవచ్చు తర్వాత పెరగకుండా నియంత్రించుకోవచ్చు.
  2. దీని వల్ల మన జీవిత కాలం పెరుగుతుంది.
  3. మెదడు చురుగ్గా పని చేయడం మొదలు పెడుతుంది.
  4. టైప్ 2 డయాబెటిస్ నుండి కాపాడుతుంది.
  5. శరీర అంతర్గత వ్యవస్థను మెరుగు పడేలా చేస్తుంది.

సో ఇప్పుడు మీకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటో అవగాహన వచ్చింది కదా తర్వత మీరు తెలుసుకోవాల్సింది. ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ఎలా చేయాలి. ఏమి తినాలి? ఎంత తినాలి? ,  ఎప్పుడు తినాలి?  ఇవి తెలుసుకోవాలంటే ఈ వ్యాసం తప్పకుండా చదవండి ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ ఎలా చేయాలి ?

Exit mobile version