Site icon Maatamanti

వేసవి కాలం కబుర్లు – మీ చిన్ననాటి వేసవి రోజులు మీకు గుర్తున్నాయా?

Super Summer

Super Summer

మండే ఎండల్ని తలచుకుంటే వేసవి కాలం అంటేనే భయం వేస్తుంది ఎవరికైనా.కానీ వేసవి ఉదయాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.నాకు వేసవి కాలపు ఉదయాలంటే చాలా ఇష్టం.పగలంతా ఎంత వేడిగా ఉన్నా తెల్లవారు ఝాము సమయానికి మాత్రం వాతావరణం చల్లగా ఉంటుంది.అందుకే నేను వేసవిలో చాలా తొందరగా నిద్ర లేస్తాను.చక్కని చిక్కని కాఫీ కలుపుకొని బయట వరండాలో కూర్చుంటాను.కమ్మని కాఫీ సువాసనను ఆస్వాదిస్తూ మెల్లిగా సిప్ చేస్తూ అప్పుడే తెల్లవారుతున్న ఆకాశాన్ని చూస్తూ ఉంటాను. చల్లని పిల్ల తెమ్మెరలు శరీరాన్ని తాకుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది.పిల్ల గాలి తాకిడికి సన్నగా కులికే లేత వేపాకులను చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది.పక్షులేమో ఏదో ఆఫీసుకి వెళుతున్నట్లు పొద్దున్నే హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోతుంటాయి.ఇక కోకిల గారేమో పక్కన ఎవరూ పోటీ లేరని తెలిసి కూడా రెచ్చిపోయి పాడుతుంటారు.వారితో మనం గెలవగలమా చెప్పండి?

నేనెప్పుడూ నా చిన్నప్పటి వేసవి సెలవులనే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను.వేసవిలో ఎప్పుడూ బయటే పడుకునేవాళ్ళం.నా మంచం అయితే బొండు మల్లి చెట్టు పక్కనే వేసుకునేదాన్ని.పొద్దున్నే నిద్ర లేచే సమయానికి పూలన్నీ చక్కగా విచ్చుకొని కమ్మని పరిమళాన్ని వెదజల్లేవి.గబుక్కున చూస్తే అవి తెల్ల గులాబీలేమో అని అనిపించేంత పెద్దగా ఉండేవి.ఇంక పొద్దున్నే లేచి చకచకా  స్నానాదులు ముగించుకొని, గబగబా టిఫిన్ చేసి పిల్లలందరం ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళం.ఇప్పుడైతే పట్టుమని 10 సెకన్లయినా ఎండలో ఉండలేను కానీ, చిన్నప్పుడు మా ఆటలన్నీ ఎండలోనే.

మా అమ్మాయి, నేను పొద్దున్నే మా బాల్కనీలో

చిన్నప్పుడంత అందంగా కాకపోయినా, ఇప్పుడు మా బాల్కనీ లో  కూర్చున్నా చుట్టూ ఎంతో అందంగా ఉంటుంది.ఎదురుగా ఎడమవైపు ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది.చక్కటి wide angle view ఉంటుంది.కనీసం 270 డిగ్రీలు ఉంటుంది.పొద్దున్నే సూర్యోదయాన్ని చక్కగా చూడవచ్చు.గుంపులుగా ఎగిరే పక్షుల్ని చూడొచ్చు.పక్కన చిన్న గుట్ట మీద నెమళ్ళని చూడవచ్చు.నా బంగారుకొండ, మా మల్లు గాడిని(మా వీధిలో ఉండే కుక్క) చూడొచ్చు.స్వేచ్ఛగా ఆడుకుంటున్న చిన్న పిల్లల్ని చూడవచ్చు.సరేలే ఎలాగోలా ఉన్నదానితో సరిపెట్టుకుందాం అని అనుకుంటే ముందు నేను ఎంతగానో ప్రేమించే నా వేపచేట్టుని ఇల్లు కట్టడం కోసం కొట్టేసారు.ఆ రోజు ఎంతగానో విలవిల్లాడిపోయాను.సరేలే అనుకునేలోపలే నెమళ్ళు కనిపించే గుట్టకి అడ్డుగా ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు.అయినా సరే ఎలాగోలా నాకు నేనే సర్ది చెప్పుకొంటుంటే ఈలోపు నా wide angle view కాస్తా దిక్కుమాలిన narrow angle view గా మారింది.ఎందుకంటే ముందుకూడా ఒక పెద్ద 5 అంతస్తుల భవనం కడుతున్నారు.రోజులు గడుస్తున్న కొద్దీ అనుభవాలు తగ్గిపోయి అనుభూతులు మాత్రమే మిగులుతున్నాయి.

ఈ కింది slider లో మీరు చూస్తున్న ఫోటో లు మా బాల్కనీ నుండి తీసినవే.ఉదయాన్నే లేచి ప్రకృతిని ఆస్వాదిస్తూ, కంటికి నచ్చినవి కనిపిస్తే ఇలా క్లిక్ చేయడం నా అలవాటు.

 

మేము చిన్నప్పుడు వేసవిలో చేసిన కొన్ని పనులు ఇప్పుడు తలుచుకుంటే నాకు చాలా నవ్వొస్తుంది.ఆ సంవత్సరం తరగతులు ముగియగానే ఇక ఆ నోటు పుస్తకాలు వేస్ట్ కదండీ!అందుకే వాటి పై అట్టల్ని పీకేసి, వృత్తలేఖినితో(కంపాస్)  చిన్న వృత్తం గీసి, దాన్ని కత్తిరించి పక్కన పెట్టుకునే వాళ్ళం.పల్లెటూర్లలో దాదాపు అందరి ఇళ్ళలో మల్లె, గులాబీ, కనకాంబరాలు, మందార చెట్లు ఉంటాయి.ఆడపిల్లలందరం ఒకచోట పోగయ్యి ఏ రోజు ఎవరికీ పూలు ఇవ్వాలో ముందే డిసైడ్ చేసుకునే వాళ్ళం.ఆ ప్రకారం ఒక రోజు అందరి ఇళ్ళలో పూసిన పూలన్నీ ఒకరకి ఇవ్వాలి.అందరూ కలిసి ముందే కత్తిరించి పెట్టుకున్న వృత్తాకారపు అట్టముక్కకు పూలు కుట్టేవాళ్ళం.ఆ విధంగా చక్కటి పూల జడను తయారు చేసేవాళ్ళం.ఇక జడని తలకి ఎవరో ఒక పెద్దవాళ్ళు కుట్టేవారు.పూల జడ వేసుకోగానే తీసెయ్యలేము కదా,అంత కష్టపడి అల్లిన జడను వెంటనే తీసేస్తే ఎలా?అందుకే రెండు మూడు రోజులు ఉంచుకునేదాన్ని.పూల జడ ఎండిపోయాక కూడా అందంగా అనిపిస్తుంది కదండీ!ఇక ఆ రెండు రోజులూ నాకు తిప్పలే.తలంతా ఒకటే బరువు.జుట్టు పీక్కు పోతున్నట్లుగా అనిపించేది.జడ బరువుకి తల వెనక్కి వంగిపోయేది.విపరీతంగా తలనొప్పి వచ్చేది.కనుగుడ్లు బయటికి వచ్చేస్తాయేమో అనిపించేది.స్నానం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉండేది.ఇంతా చేసి ఆ పూల జడ నాకు కనిపించి చస్తుందా అంటే అదీ లేదు.మరెందుకు అనవసరంగా అంత కష్టపడి ఆ పూలజడ వేసుకోవడం?ఈ ముక్కేదో అప్పుడే అలోచించి ఉంటే ఆ తిప్పలు నాకు తప్పేవి కదండీ!పోనీ ఇప్పటి పిల్లల్లా ఆ దిక్కుమాలిన సెల్ఫీ లో కుల్ఫీలో తీసుకుందామంటే అప్పుడు సెల్ ఫోన్ లు లేవు కదా మరీ.

ఇక వేసవి కాలం అంటేనే పెళ్ళిళ్ళ సీజన్.దాదాపు రోజూ ఏదో ఒక పిలుపు ఉండేది.అందుకే భోజనాలు ఇంట్లో కన్నా బయటే ఎక్కువ.ఇప్పటికీ నేను మా పిన్నికి ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒక ఫంక్షన్ లో ఉన్నానని చెప్తుంది.కరెక్ట్ గా చెప్పాలంటే ఎండాకాలంలో మా పిన్ని మహా అయితే అప్పుడప్పుడు కలిపి ఒక వారం లేదా పది రోజులు వంట చేయాల్సి వస్తుందేమో.ఆ పది రోజులు కూడా తనకి ఓపిక లేక వెళ్ళదు.ఇక మిగతా అన్ని రోజులు బయట ఫంక్షన్ భోజనాలే.మా తమ్ముడు ఎప్పుడు మా పిన్నికి ఫోన్ చేసినా నన్ను కూడా కలిపి conference కాల్ చేస్తాడు.ఏమి చేస్తున్నావ్ అని అడిగితే “అబ్బబ్బా!పెళ్ళి భోజనాలకి వెళ్లి వెళ్ళీ అలసిపోయాను” అని చెప్తుంది.ఇక నేను వాడు విపరీతంగా నవ్వుకుంటాము.

ఈతకాయల్ని చూశారా?ఎంత బాగున్నాయో కదూ!చిన్నప్పుడు పచ్చి ఈత గెలల్ని తెంచుకొని గడ్డివాములో మగ్గపెట్టి అవి పండాక తినేవాళ్ళం.మాస్టర్ గారు బెత్తం తెమ్మని చెప్తే ఈత మట్టను విరిచి ఈనెలను తేసేసి ఈత బెత్తం తయారు చేసి పట్టుకు వెళ్లేవాళ్ళం.దాంతో కొడితే ఇంక అంతే సంగతులు.అప్పుడప్పుడు ఆ బెత్తాలతో కొడుతున్నట్లుగా నటిస్తూ మేము టీచర్ ఆట ఆడుకునేవాళ్ళం.ఇప్పుడు ఈత చెట్లూ లేవు ఈత కాయలూ లేవు.వాటిని చూడాలంటే ఏ ఊరికో వెళ్ళాలి.ఎప్పుడు కుదిరేను అవన్నీ?మొన్న మార్కెట్ కి వెళ్ళినపుడు అనుకోకుండా ఈత కాయలు కనిపించాయి.చూడగానే ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేను.వెంటనే కొని ఇంటికి తీసుకొచ్చి వాటిని ఇలా ఫోటో తీశాను.

మామిడి రసాలు చూసారుగా.నోరూరిపోతుంది కదూ?చిన్నప్పుడు నేరుగా చెట్టుమీద నుండి పచ్చి బంగినపల్లి, కలెక్టర్ మామిడికాయలు కోసుకొని తినేవాళ్ళం.రసాలు ఇంట్లోనే ఎండుగడ్డి వేసి పండబెట్టుకొని తినేవాళ్ళం.అవి ఎంతో తీయగా అమృతంలా ఉండేవి.పెరుగన్నంతో  కూడా తినేవాళ్ళం.కానీ ఇప్పుడు మామిడికాయలను కొనుక్కుని తినాల్సి వస్తుంది.ఒకవేళ కొన్నా తినాలని ఏమాత్రం ఉండదు.అసహజమైన రీతులలో వాటిని పండిచడం వల్ల అవి రుచిగా ఉండవు.అందుకే తినబుద్ధికాదు.

పై ఫోటో లో సీమ చింతకాయలను చూసారుగా!వాటిని చూస్తే మీకేమైనా జ్ఞాపకం వస్తుందా?చిన్నప్పుడు మీరు కూడా కచ్చితంగా వీటికోసం కుస్తీ పట్టే వుంటారు.పొడవాటి గెడకర్రలతో లాగి వీటిని కోసుకు తినేవాళ్ళం.తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తిన్నాకే నోరు అదోలా ఉంటుంది.కానీ ఆరోగ్యానికి చాలా మంచివి.వీటిలో చాలా పోషక విలువలు ఉంటాయి.వీటిని తెలంగాణాలో గుబ్బకాయలు అంటారు.ఇక ఆ ప్రక్కనే ఉన్న తాటి ముంజలను చూసారా?ఇలా తీసుకొని అలా నోట్లో వేసుకోవాలనిపిస్తుంది కదూ.

మా చిన్నప్పుడు ఎవరి పొలం గట్టు మీద ఉన్న తాటిచెట్లు వాళ్ళు కొట్టుకుని తినేవాళ్ళు.ఇప్పటిలా బయట అమ్మడం నేను చిన్నప్పుడు ఎప్పుడూ చూడలేదు.నాకైతే మా చిన్న మామయ్య లేత తాటికాయలు కొడవలితో కొట్టిచ్చేవాడు.లేత కాయల్లో ముంజెలు తీయడం కన్నా,బొటన వేలితో నేరుగా నోట్లో వేసుకుంటే బాగుంటుంది.చిన్నప్పుడు తినడం రాక ముంజలో నీరంతా మీద పడేది.తినడం అయ్యాక రెండు తాటికాయల మధ్య కర్ర గుచ్చి దాన్ని బండిలా తయారు చేసి ఆడుకునేవాళ్ళం.ఆ రోజులు గుర్తుకొచ్చి మొన్న తాటికాయలు అమ్మే అబ్బాయి దగ్గరకి వెళ్లి అతని పక్కనే కింద కూర్చుని ఇక అతనితో కబుర్లు మొదలు పెట్టాను.మా అమ్మాయేమో “అమ్మా! ఇక రావొచ్చు కదా ఇంకాసేపుంటే “ఏమ్మా!డజను ఎంతకిస్తావ్ ” అని నిన్ను కూడా అడుగుతారు” అంది.ఎవరేమన్నా అనుకోని అని అక్కడే కూర్చుని, ఏ వూరు ?ఎక్కడి నుంచి గెలల్ని తెచ్చారు?ఎలా తెచ్చారు? లాంటి అడ్డమైన ప్రశ్నలన్నీ అడిగి వాళ్ళని కాసేపు విసిగించి అప్పుడు బయలుదేరాను.

వేసవికి  నా సమీకరణం (equation)

వేసవి = ఆహ్లాదకరమైన ఉదయాలు + విసుగెత్తించే మధ్యాహ్నాలు + ఫర్వాలేదనిపించే సాయంత్రాలు + టన్నులకొద్దీ మామిడికాయలు + గ్యాలన్ల కొద్దీ కొబ్బరి నీళ్లు +  ముందే ఊహించిన ఊహించని బంధువులు

ఎలా ఉందండి  నా సమీకరణం?సుమారుగా మీ సమీకరణం మాదిరిగానే ఉన్నట్లుంది కదూ .

పైన నేను రాసిందంతా మీకు కూడా ఖచ్చితంగా చిన్నప్పుడు ఎప్పుడోకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటుంది కదండీ.అయితే మీ అనుభవాలను కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.మేము కూడా తెలుసుకొని ఆనందిస్తాము.

Exit mobile version