Site icon Maatamanti

పాత సినిమా హాలు, పార్వతమ్మ – నా జ్ఞాపకాలు

నా చిన్నప్పుడు మేము ఒరిస్సా లో ఉండే వారము. అక్కడ పాఠశాలల్లో మొదటి భాష ఒరియా ఉండేది. నాన్న ఉద్యోగ రీత్యా అటూ ఇటూ ఊర్లు తిరగాల్సి వస్తుండడంతో  మా అమ్మా నాన్నలు నాకు తెలుగు భాష అబ్బడం లేదని నన్ను ఒక సంవత్సరం మా అమ్మమ్మగారి ఊరిలో ఉంచి చదివించారు.  నేను అక్కడ 3వ తరగతి తెలుగు మీడియం లో చదువు కున్నాను. అక్కడ ఉన్నది సంవత్సరమే కానీ ఆ ఒక్క సంవత్సరం నాకు జీవిత కాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇచ్చింది.

పాత సినిమా హాలు ఊరికి ఒక చివరన ఉండేది. ఆ సినిమా హాలు నుండి సుమారు పది ఇళ్ల ఇవతల మా అమ్మమ్మ గారి ఇల్లు ఉండేది. మేము బయట మంచాలు వేసుకుని పడుకున్నప్పుడు రాత్రి రెండవ ఆట సమయంలో మాకు పాటలు, ఫైట్లు  వినిపించేవి.

పాత సినిమా హాలు కు ఒక పేరు ఉందో లేదో నాకు తెలీదు కానీ అందరూ దాన్ని ‘పాత సినిమా హాలు’ అనే అనేవారు. దాన్ని అలా అనాలి అంటే కొత్త సినిమా హాలు ఉండాలి కదా! అప్పుడు కొత్త సినిమా హాలు లేదు అయినా దాన్ని అలానే పిలిచేవారు.  నేను వెళ్ళాక కొన్ని రోజులకు కట్టారు కొత్త సినిమా హాలు దాని పేరు ‘హిమగిరి’ థియేటర్. ఇది ఊరికి ఇంకో చివర పచ్చని పంట పొలాల మధ్యలో ఉండేది.  ఈ పేరా రాసేటప్పుడు గుర్తుకొచ్చి గూగుల్ మ్యాప్స్ తెరిచి చూశాను. పాత సినిమా హాలు ఇప్పుడు లేదు ఎప్పుడో తీసేశారు. అయినా దాని ముందు ఉన్న రోడ్డు ఇప్పటికీ ఆ పేరుతోనే రాసి ఉంది మ్యాప్స్ లో. ఆ స్క్రీన్ షాట్స్ తీసి కింద పెట్టాను. చూడగలరు.

 

ఇక పాత సినిమా హాలు గురించి చెప్పాలి. పేరుకు తగ్గట్లే చాలా పాతగా పెద్దగా కళా కాంతులు లేకుండా ఉండేది. రేకుల షెడ్డు. చుట్టూరా గోడలకు బదులు తడికెలు ఉండేవి. ఆ తడికల పైన కర్టెన్ లా కుట్టిన గోనె సంచులు ఉండేవి. సినిమా హాలు లోపల ఒక మసకబారిన తెర ఉండేది. ఇక లోపలంతా ఇసుక ఉండేది. నేల టిక్కెట్టు, బెంచీ టిక్కెట్టు ఉండేవి. హాలు నిలువుగా పార్టిషన్ చేసి ఉండేది. పార్టిషన్ అంటే మళ్ళీ మీ ఊహల్లో గోడ కట్టేయకండి. అడ్డంగా రెండు వరసల బొంగు కర్రలు కట్టి ఉండేవి అదే పార్టిషన్.

ఆడవారు ఒక వైపు, మగవారు ఒక వైపు కూర్చోవాలి. భార్యాభర్తలు వెళ్లినా వేరుగానే కూర్చోవాలి. సాయంత్రం 5.30 గంటలకు టికెట్ కౌంటర్ తెరిచారు అన్న దానికి సంకేతంగా మైకులో పాటలు పెట్టేవారు. ఆ హాలుకి ముందు ఒక పెద్ద చెట్టు, దానికో లౌడ్ స్పీకర్ కట్టి ఉండేది. అందులో నుండి “నమో వెంకటేశా, నమో తిరుమలేశా , మహానందమాయే ఓ మహా దేవ దేవా” ఘంటసాల గారి పాట, ఆ తర్వాత “శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దము రారండి” పాట, ఆ తర్వాత “బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే” రక్త సంబంధం సినిమా లోని పాటలు వచ్చేవి. ఆ వయసులో నాకు అవి  ఎవరు పాడారు ఏ సినిమాలో పాటలు అని తెలీదు. పెద్దయ్యాక నేను నా జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నప్పుడు తెలుసుకున్నాను. అలాంటి సినిమా హాళ్లని టూరింగ్ టాకీసు అంటారు అనుకుంటా.

నేను సినిమాలకు చిన్న మామయ్య తో కలిసి వెళ్లేదాన్ని. కొన్ని సార్లు నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అన్ని సినిమాలు దాదాపు చిరంజీవి సినిమాలే. మరి నేనొక్కదాన్నే వెళ్ళినప్పుడు నాకు డబ్బులెక్కడివి? టిక్కెట్టు లేకుండా ఎలా వెళ్ళాను? ఉద్యోగాల్లో  స్పోర్ట్స్ కోటా, ex-సర్వీస్ కోటా, ఉమెన్స్ కోటాలు ఉన్నట్లే నాకు మా ‘పార్వతమ్మ’ కోటా ఉండేది.

పార్వతమ్మ అలియాస్ పార్వతాం,  ఆ సినిమా హాలులో టిక్కెట్లు చింపి పంపే టికెట్ checker గా పార్ట్-టైమ్ ఉద్యోగం చేసేది. ఆవిడ నాకెలా తెలుసు అంటే ఆవిడ మా అమ్మమ్మ గారి ఇంట్లో పని చేసేది. అచ్చు పాత సినిమాల్లో రమణారెడ్డి గారి లా బక్క పలుచని దేహం, గోచీ పెట్టిన కోక, పళ్ళు లేని బోసి నోరు. అయినా చాలా దృఢంగా ఉండేది.

ఆవిడ మా ఇంట్లో గిన్నెలు తోమేది. బట్టలు ఉతికేది. ప్రతీ సోమవారం నాకు తలంటు స్నానం చేయించేది.  నాకు అక్కడ బడి లో సోమవారం శెలవు దినం. ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లు చెప్పడం, ఒకరి మాటలు ఇంకొకరికి చెప్పడం, ఆ తర్వాత గొడవలాడుకోవడం ఊర్లలో పరిపాటి. కానీ మా అమ్మమ్మ ఆ కోవ లోకి రాదు. అలా చేయాలన్న ఆలోచన/తెలివి కూడా తనకు లేదు. ఎప్పుడైనా ఇంటి ముందు ఊడ్చుకుంటున్నపుడు పక్క ఇంటి ప్రభావతమ్మ గారు పలికరిస్తే తను కాసేపు చీపురు అలాగే పట్టుకుని పిచ్చాపాటి మాట్లాడేది. ప్రభావతమ్మ గారు కూడా అంతే ఎవరి జోలికి పోయే మనిషి కాదు.

మా అమ్మమ్మకు ఉన్న ఏకైక స్నేహతురాలు అంటే ఒక విధంగా పార్వతమ్మ అని చెప్పొచ్చు. అమ్మమ్మ ఎక్కడికి వెళ్లకపోయినా, ఎవరితో మాట్లాడకపోయినా ఊర్లో అన్ని సంగతులు తెలిసేవి నిరంతర వార్తా స్రవంతి మా పార్వతమ్మ వల్ల. పార్వతమ్మకు  ఒక అలవాటు ఉంది. ఎదుటి వారు వింటున్నా వినకపోయినా అసలక్కడ ఎవరూ లేకపోయినా ఒక్క సెకను కూడా ఆపకుండా మాట్లాడుతూనే ఉంటుంది. అమ్మమ్మ ఆపమని చెప్పినా ఆపేది కాదు. నాకు లోపల పని ఉంది వెళ్లనీ అన్నా వినేది కాదు మాట్లాడుతూనే ఉండేది. ఇక వినలేక, తప్పక లోపలకు వెళ్ళిపోయినా తను చెప్పాల్సింది మాత్రం చెప్తూనే ఉండేది.

అమ్మమ్మ తనకు తినడానికి ఏదైనా పెట్టినా తినేటప్పుడు కూడా మాట్లాడుతూ తినేది. చాలా సార్లు పొరబోయేది. అమ్మమ్మ ” ఒసే పార్వతాం! ఎందుకే వాగిన దానివి వాగుతూనే ఉంటావు. తినేటప్పుడన్నా ఆపవే. గొంతుకు మెతుకడ్డం పడి చస్తావు” అనేది. అయినా ఊహు వినేది కాదు.

నేను మా పార్వతమ్మ కోటాలో సినిమాకు వెళ్లేదాన్ని. సినిమా చూడాలి అంటే చూడాలి అంతే. వాటిలోని సంభాషణల అర్ధం కానీ , కథ కానీ తెలిసేవి  కాదు. సినిమా మధ్యలో పాటలు వచ్చినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చింపిన పేపర్లు పైకి విసిరేసేవారు. ఇంకా బెలూన్స్ కూడా పైకి  విసిరేవారు. అవి భలేగా ఉండేవి చాలా ట్రాన్ఫరెంట్ గా బెలూన్ లో నుండి కూడా తెర కనిపించేంత పారదర్శకంగా ఉండేవి.

సినిమా నుండి వచ్చాక అలాంటి బెలూన్ నాకూ కావాలని మా చిన్న మామయ్యని అడిగేదాన్ని. ఒకటి రెండు సార్లు మామయ్య తెచ్చి పెట్టారు. కానీ “ఇవి  రంగు రంగులుగా ఉన్నాయి. వాటిలా లేదు నాకు అదే కావాలి అని మారాం చేసేదాన్ని. అవి ఇక్కడ దొరకవు అమ్మా. టౌన్ లో మాత్రమే ఉంటాయి” అని చెప్పేవారు. సర్లే అనుకునేదాన్ని. మళ్ళీ సినిమాకు వెళ్ళినప్పుడు పాటల సమయం లో అవే బెలూన్స్. ” చిన్న మామయ్యా మరి వాళ్లకు ఎలా దొరికాయి?” అని విసిగించేదాన్ని.

పప్పుండలు, జీడీలు, కలర్ బలపాలు, పెప్పరు మింట్ బిళ్ళలు, తాటి తాండ్ర, ఐస్ ఫ్రూట్, పునుగులు, బజ్జీలు, బఠాణీలు  ఇలా ఒకటేంటి నేను అడిగినవి, అడగనివీ  ప్రతిదీ కొనిచ్చిన మా చిన్న మామయ్య అదొక్కటే కొనివ్వకుండా నన్ను ఎందుకు బాధ పెడుతున్నాడు అనుకునేదాన్ని. పెద్దయ్యాక కూడా జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనసులో అనుకునేదాన్ని.

నేను చిన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడే కొత్త సినిమా హాలు “హిమగిరి థియేటర్” కట్టారు అని చెప్పాను కదా. అది అద్భుతంగా కట్టారు. చుట్టూరా పొలాలు ఉండేవి. నేను చూసినప్పుడు ఆ థియేటర్ కి  ఒక వైపు గులాబీ తోట, ఇంకో వైపు మల్లె తోట, లిల్లీ పూల తోట ఉండేవి. సాధారణంగా సినిమా ఆట వేసినప్పుడు తలుపులు మూసేస్తారు కదా. కానీ ఆ థియేటర్ లో అలా మూసే వారు కాదు. తలుపులు తెరిచే ఉంచేవారు. చుట్టూరా ఉన్న పూల తోటల నుండి గాలి వీచినప్పుడల్లా మధురమైన పరిమళం వచ్చేది. ఇప్పుడు మల్టీప్లెక్స్ లో recliner లలో కూర్చుని సినిమా చూసినా కూడా ఆ ఆనందానికి, అనుభూతికి ఏమాత్రం సాటి రాదు. నాకసలు ఇప్పటి సినిమా హాళ్లల్లో  ఊపిరాడదు, అంత సేపు కదలకుండా చీకట్లో నేను కూర్చోలేను. చివరి సారి నేను థియేటర్ లో అతి కష్టం మీద కూర్చుని చూసిన సినిమా రోబో-2 అనుకుంటా. అసలు వెళ్లడమే అరుదు వెళ్లినా మధ్యలో లేచి వచ్చేద్దామన్న ఆలోచనను పక్కన ఉన్న ఇద్దరినీ చూసి బలవంతంగా ఆపుకుంటాను.

సాధారణంగా అప్పట్లో సినిమా హాళ్లలో ఎక్కడ చూసినా చెత్త కాగితాలు, కిళ్లీ ఉమ్ములు గోడల మీద, కింద కాల్చి పారేసిన బీడీ, చుట్ట, సిగరెట్లు కనిపించేవి. కానీ హిమగిరి థియేటర్ దానికి విరుద్ధం. అక్కడ హాలు ముందు షాపులో కిళ్లీ, బీడీ, సిగరెట్లు అమ్మేవారు కాదు. సమోసాలు, సోడా, పాప్ కార్న్  మాత్రమే పెట్టేవారు. ఉమ్ములు ఊసినా, చెత్త వేసినా ఊరుకునేవారు కాదు. ఎవరైనా రహస్యంగా బీడీలు కాలుస్తున్నారేమో అని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండేవారు.

నాకు పాప పుట్టిన చాలా సంవత్సరాల తర్వాత ఒకసారి మా అమ్మమ్మ గారి ఊరు వెళ్ళాను. అప్పటికే అమ్మమ్మ, తాతయ్య, పెద్ద మామయ్య చనిపోయారు. అక్కడ ఇల్లు స్థలం అన్నీ అమ్మేశారు. ఆ రోజు నా చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మా చిన్న మామయ్యతో పాత సినిమా హాలు, పార్వతమ్మ, తను కొనివ్వని బెలూన్స్ ని గుర్తుచేశాను. “మామయ్యా! నువ్వు నాకు చిన్నప్పుడు నేనడిగిన ప్రతిదీ కొనిచ్చావు. బాగా గారాబం చేశావు.కానీ నేను అడిగిన ఆ transparent బెలూన్ మాత్రం కొనివ్వలేదు” అన్నాను.

అప్పుడు మా చిన్న మామయ్య పెద్దగా నవ్వి “అమ్మాయ్ అది నువ్వింకా మర్చిపోలేదా! ఒసే పిచ్చి కుంకా! అది బెలూన్ కాదే. నిరోధ్ కండోమ్స్. చిన్నప్పుడు నీకు చెప్తే అర్ధం కాదు అని టౌన్ లో ఉంటాయి ఇక్కడ దొరకవు అని చెప్పేవాడిని ” అని చెప్పారు. నేను ఒక్క నిమిషం నివ్వెరపోయాను. పక్కనే ఉన్న సచిన్  వైపు చూశాను. ముగ్గురం ఒక్కసారే పెద్దగా నవ్వాము.

ముగింపు: తర్వాత నాకు పార్వతమ్మ చనిపోయిన విషయం తెలిసింది. తను ఎలా చనిపోయిందో తెలుసా? అన్నం తినేటప్పుడు మాట్లాడడం వల్ల, మెతుకు అడ్డం పడి పొరబోయి ఊపిరాడక చనిపోయింది.

Exit mobile version