Site icon Maatamanti

నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు Part-3/అప్పర్ సీలేరు విశేషాలు

ఉదాహరణ 3

పైన ఉదాహరణ లో మా నాన్నకు సీలేరు ట్రాన్స్ ఫర్ అయిందని చెప్పాను కదా.వేసవి సెలవులు రాగానే నాన్న వచ్చి నన్ను, అక్కని, అమ్మను సీలేరు తీసుకెళ్ళేవారు.అక్కడ అప్పర్ సీలేరు లో ఇచ్చారు నాన్నకి ఇల్లు.ఆ ఇల్లు ఊరి చివర కొండ పైన ఇన్స్పెక్షన్ బంగ్లా కి వెళ్లే దారిలో కొండ ఎక్కగానే ఎడమ వైపు ఉండేది.పెద్ద మండువా లోగిలి ఇల్లు.కాకపొతే మండువా లోగిలి ఇంటికి నాలుగు వైపులా గదులు ఉండి మధ్యలో ఖాళీగా ఉంటుంది.కానీ ఈ ఇంటికి ఒక వైపు గదులుండవు.ఇల్లు మాత్రం సూపర్ గా ఉండేది.కొండ మీద ఉండేది కనుక ఇంటిని ఆనుకుని చిక్కని అడవి ఉండేది.రాత్రి పూట పులులు కూడా వచ్చేవట.మేము ఉన్నపుడు ఒక రాత్రి పులి వచ్చి నట్లుంది.పొద్దున్న లేచే సరికి వరండాలో సగం తిని వదిలేసిన మేక ఉంది.కానీ మేము అస్సలు భయపడలేదు.చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది.

అసలు రాత్రి అయితే ఆ ఊర్లో పులుల భయానికి ఇంట్లో నుండి బయటకే వచ్చే వారు కాదు.కానీ నేను అక్క మాత్రం ఎంచక్కా ఇంటి ముందు లాన్ లో కుర్చీలు వేసుకొని దిగువలో కనిపిస్తున్న ఊరుని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఆనందించే వాళ్ళం.కుందేళ్ళు అయితే పొదల్లో నుండి బయటకు వచ్చేవి.మేము వాటిని గమనిస్తున్నాం అని తెలియ గానే గెంతుకుంటూ పొదల్లోకి వెళ్లిపోయేవి.ఆ కుందేళ్ళు గోధుమ రంగులో ఉండేవి.పొదల్లోకి  చూస్తే వాటి కళ్ళు మెరుస్తూ కనిపించేవి.నాన్న టీవీ vcp రెంట్ కి తెచ్చి బోలెడు సినిమా క్యాసెట్లు తెచ్చేవారు.టీవీ బయట వరండాలో పెట్టించుకుని స్నాక్స్ తింటూ సినిమాలు చూసే వాళ్ళం.అప్పుడు కుందేళ్ళు పక్కనే తిరుగుతుండేవి ఏదో ఒకటి తింటూ ఉండేవి.

ఇక సీలేరు అందాల్ని చూడాలంటే వర్షాకాలంలో కానీ శీతాకాలం లో కానీ వెళ్ళాలి.సీలేరు నుండి నర్సీపట్నం వెళ్లే రూట్ లో దారాలమ్మ గుడి ఉండేది.అక్కడకి తరచుగా వెళ్లే వాళ్ళం.రోడ్ కి ఒక వైపు కొండ ఒక వైపు లోయ, పై నుండి జారి రోడ్డు మీద గుండా లోయ లోకి పారే చిన్ని చిన్ని జలపాతాలు.అక్కడే జీప్ ఆపేసి కాసేపు ఆ జలపాతం దగ్గర ఆడుకునేవాళ్ళం.దారాలమ్మ గుడికి వెళ్లక ముందే దారిలో చిత్రకొండ ఊరు వచ్చేది.అది ఒరిస్సా బోర్డర్.అక్కడ బలిమెల డామ్ ఉండేది.అక్కడ నదిలో నీటి ఉధృతి బాగా తక్కువగా ఉన్నప్పుడు నీళ్ళలోకి దిగి ఆడుకునేవాళ్ళం.

సీలేరులో  వాతావరణం ఆద్భుతంగా ఉంటుంది.మేము ఉన్న ఇంటి పక్క నుండి పైన కొండ అంచున ఉన్న ఇన్స్పెక్షన్ బంగ్లా కి మెట్లు ఉండేవి.రోడ్డు మార్గం లో వెళ్ళకుండా డైరెక్ట్ గా ఆ మెట్లు ఎక్కి ఇన్స్పెక్షన్ బంగ్లా కి వెళ్లేవాళ్ళం.అక్కడి నుండి ఊరు ఇంకా అందంగా కనిపించేది.అసలు వర్షాకాలంలో అయితే ఎటూ చూసినా పచ్చగా ఆద్భుతంగా చూడడానికి రెండు కళ్ళు చాలవన్నట్లు ఉండేది.మళ్ళీ ఊరికి తిరిగి వెళ్లి పోవాల్సిన రోజు వస్తుందంటేనే చాలా దిగులుగా ఉండేది.మేము ఉన్న ఇంటిలో ఎవరో DE గారు ఉండేవారట.వాళ్ళు వెళ్ళిపోయాక చాలా కాలం వరకు ఎవరూ లేరు.తర్వాత మా నాన్న పని చేస్తున్న కంపెనీ వారికి గవర్నమెంట్ వారు ఇస్తే కంపెనీ వాళ్ళు మా నాన్నకు ఇచ్చారు.ఆ ఇంట్లో మా నాన్న, మా నాన్న దగ్గర పని చేసే సూపర్ వైజర్ వాసు కుట్టన్ అనే మలయాళీ ఆయన ఉండేవారు.వేరే గదులలో అన్నీ కంపెనీ కి సంబంధించిన సామాన్లు ఉండేవి.వాటిలో ఒక గదిలో X-RAY కాన్ ఉండేది.ఆ గదిలోకి మమ్మల్ని వెళ్ళ నిచ్చేవారు కాదు.వాసు కుట్టన్ అంకులే నాకు అక్కకు చదరంగం ఆడడం నేర్పించారు.

అక్కడ జనాభా చాలా తక్కువ.పార్కులు సినిమా హాళ్ళు లాంటివి ఏమి ఉండవు.ఉన్న జనాలలో 3/4 వంతు పవర్ ప్రాజెక్ట్ లో పనిచేసేవారే.ఇక మిగిలిన వారంతా దాదాపు ఆదివాసీలే.ఆదివారం సంతలో కూరగాయలు అమ్మటానికి ఆదివాసి తెగల వారు వచ్చేవారు.కూరగాయలన్నీ చాలా డిఫరెంట్ గా ఉండేవి.వంకాయలు పొట్లకాయంత పొడవుండేవి.దోసకాయలు కూడా చాలా పెద్దగా ఉండేవి.ఇక అక్కడ మామిడికాయలు చాలా చిన్నగా ఉండేవి.చిన్నగా సపోటా సైజులో ఉండేవి.ఇక అవి అంతకన్నా పెరగవు.ఎర్ర అరటి చెట్లు కూడా ఉండేవి.

అప్పట్లో చింతూరు నుండి సీలేరు వచ్చే దాకా మధ్య దారిలో మొత్తం నక్సల్ ప్రాంతంగా ఉండేది.పోలీస్ వాహనాలని పేల్చడానికి మందు పాతరలు పెట్టేవారు రోడ్డు మీద.ఒకసారి మా నాన్న సీలేరు నుండి బయలుదేరానని, రాత్రి 11 నుండి 12 లోపు ఇంటికి వచ్చేస్తానని చెప్పారు.అంటే ఆయన అక్కడ సాయంత్రం ఏ 6 ఇంటికో బయలుదేరాలి.అదే రోజు వార్తల్లో సీలేరు ఫారెస్ట్ రోడ్ లో నక్సల్స్ బాంబు పెట్టి జీప్ ని పెల్చేసారని చెప్పారు.నాన్న వస్తున్న జీప్ ఏమో అని చాలా భయం వేసింది.కానీ నాన్న మేము కంగారు పడతామని “మాకు ఏమి కాలేదు ముందున్న పోలీస్ జీప్ పేలిపోయింది” అని  మోతుగూడెం నుండో డొంకరాయి నుండో ఫోన్ చేసి చెప్పారు.అప్పుడు కానీ మా ప్రాణం కుదుట పడలేదు.ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాము.అయినా పోలీస్ వారు చనిపోయినందుకు చాలా బాధ అనిపించింది.

అక్కడి కెళ్ళి నప్పుడల్లా నాన్న లోయర్ సీలేరు లో ఉన్న పవర్ ప్రాజెక్ట్ కి తీసుకెళ్ళి అక్కడ penstock లైన్స్ నుండి నీళ్ళు ఎలా turbines లోకి వస్తాయో, turbine వేగంగా తిరగడం వల్ల పవర్ ఎలా generate అవుతుందో వివరంగా చెప్పేవారు.నాకు అవన్నీ వినడం అంటే ఎంతో ఇంట్రెస్ట్ గా, ఉత్సాహంగా ఉండేది.

అదే ఉత్సాహంతో పెళ్ళయినాక రెండు నెలలకే మా ఆయనతో కలిసి Yamaha RX-100 మీద Jd చక్రవర్తి, మహేశ్వరీ రేంజ్ లో సాంగ్స్ పాడుతూ ఆ అందమైన ప్రకృతిని ఆస్వాదిద్దాం అని వెళితే నాకు షాకింగ్ గా అనిపించింది.అసలు నేను వెళ్ళింది సీలేరు కేనా అనిపించింది.మేము ఉన్న ఇల్లుని ఇప్పుడు కాలేజీ చేశారు.బహుశా ఎండా కాలం లో వెళ్ళడం వల్లో ఏమో చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి.అసలు పచ్చదనమే లేదు.ఇక ప్రాజెక్ట్ హాస్టల్, ఇన్స్పెక్షన్ బంగ్లా లు అయితే మెయింటేనన్స్ లేక భూత్ బంగ్లాల్లా తయారయ్యాయి.ఏది ఏమైనా కానీ నా పాత జ్ఞాపకాలలో ఉన్న సీలేరు కి తర్వాత నేను చూసిన సీలేరు కి అసలు పోలికే లేదు.మళ్ళీ బాధ తప్ప ఏమి మిగల లేదు.అందంగా ఉండే హీరోయిన్ ముసలిగా అయ్యాక ఎలా ఉంటుందో అలా ఉంది సీలేరు.oh my గాడ్.ఇదేమి పోలిక?నా మొహం లా ఉంది :(.

 నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-1
 నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-2
 నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-4
 నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు PART-5

 

Exit mobile version