Site icon Maatamanti

పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగడానికి గల కారణాలు ఏంటి?

criminal mentality in children

అన్నింటికన్నా కష్టమైన పని ఏంటి అని నన్నడిగితే  క్షణం కూడా ఆలోచించకుండా పిల్లల్ని పెంచడం అని చెప్పేస్తాను.నాకు ఇది కష్టమనిపిస్తే వేరొకరికి ఎవరెస్ట్ ఎక్కడం అన్నింటికన్నా కష్టమనిపించవచ్చు.నిజమేనండి ఎవరెస్ట్ ఎక్కడం అత్యంత కష్టమైన పనే.అది ఎక్కి బతికి బయట పడ్డారంటే వాళ్ళు నిజంగా గొప్పే.అయితే, ఒక వ్యక్తి ఎవరెస్ట్ ఎక్కకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు కానీ ఒక పిల్లవాణ్ణి సరిగ్గా పెంచకపోతే అది వాడికి ఇంకా సమాజానికి కూడా నష్టం.

రోజు పేపర్ లో వార్తలు చూస్తుంటే చాలా భయం వేస్తుంది.చిన్న చిన్న పిల్లలు కూడా నేర ప్రవృత్తి తో ఉంటున్నారు.వారి వయసుకు తగని అసహజమైన, అసహ్యమైన, అసభ్యమైన పనులు చేస్తున్నారు.మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారన్న వార్త ఈ మధ్య నన్ను చాలా కలచి వేసింది.మొన్నటికి మొన్న ఒక 16 సంవత్సరాల వయసు గల యువకుడు 8 ఏళ్ల బాలుడి పైన అసహజమైన రీతిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు.అంతే కాకుండా విషయం ఎక్కడ బయటకు పొక్కుతుందోనని ఆ బాలుడిని కర్కశంగా చంపేసాడు.వినడానికే ఇంత బాధగా ఉంటే ఆ పసివాడు ఎంత నరకం అనుభవించి ఉంటాడు?

అమ్మ ఒడిలో ఆడుకుంటూ, ముద్దు ముద్దు మాటలు చెప్తూ పెరిగే ఈ పిల్లలు ముద్దాయిలుగా ఎందుకు మారుతున్నారు?అసలు దీనంతటికీ కారణం ఎవరు?ఈ ప్రశ్నకి మీ సమాధానం ఏదైనా కావొచ్చు కానీ నా సమాధానం మాత్రం ఒక్కటే.అది తల్లిదండ్రులు.

సరిగ్గా పెంచడం చేతకాని తల్లిదండ్రులకి అసలు కనే హక్కు ఎక్కడిది?ఈ మధ్య నాకు ఏ పిల్లల్ల్ని చూసినా వాళ్ళు తప్పుగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది.ఒక క్రమశిక్షణ గానీ, ఒక బిహేవియర్ కానీ ఉండడం లేదు.అలాంటి పిల్లల్ని చూసినదానికన్నా, ఏమీ పట్టనట్లు గా వదిలేసే పేరెంట్స్ ని  చూస్తే చెప్పలేనంత కోపం వస్తుంది.నేనే మరీ ఎక్కువగా అలోచిస్తునానేమో!నాదే తప్పేమో అని ఎంత మనసుకి సర్ది చెప్పుకున్దామన్నా నావల్ల కావడం లేదు.

నేను, నా భర్త  మా అమ్మాయిని చిన్నప్పటి నుండి చాలా క్రమశిక్షణగా పెంచుతున్నాము.అయినా తను కూడా అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంది.కాకపొతే  ఆ తప్పులు కేవలం తనకి మాత్రమే నష్టం కలిగించేవిగా ఉంటాయి కానీ ఇతరులకు హాని కలిగించవు, ఇతరులను ఇబ్బంది పెట్టవు.ఏ మహాత్మాగాంధీ లానో, మదర్ థెరిస్సా లానో పెంచనవసరం లేదు.ఎవరికీ హాని కలిగించని విధంగా పెంచితే చాలు.

పెద్ద పెద్ద నేరాలు చేయడం అనేది  చిన్న చిన్న తప్పుల నుండే మొదలవుతుంది.చిన్న చిన్న తప్పులు చేయడం అనేది చిన్న వయసులోనే మొదలవుతుంది.తల్లిదండ్రులు అది గమనించి కూడా సరిచేయకపోతే వారికి తప్పులు చేయడం అనేది ఒక అలవాటుగా మారిపోతుంది.ఆ చిన్న తప్పులే పెద్ద నేరాలకి దారి తీస్తాయి.

పిల్లల్లో నేర ప్రవృత్తికి పూర్తిగా వారినే బాధ్యుల్ని చేయలేము.తల్లిదండ్రులు పిల్లల్ని సరిచేయడం సంగతి అటుంచి అసలు వారే చెడ్డగా ప్రవర్తిస్తే ఇంక ఆ పసివాళ్ళు ఏం కావాలి?పిల్లలు పెరిగే కొద్దీ చెడ్డవారుగా మారడానికి గల నాకు తెలిసిన కొన్ని కారణాలు చెప్తాను.

అమ్మా నాన్నలు ఇంట్లో తరచూ తగాదా పడడం

తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపకపోవడం

తల్లిదండ్రులలో ఎవరికైనా అక్రమ సంబంధం ఉన్నట్లు పిల్లలు గమనించినా

లేదా ఎవరైనా జంట ఏకాంతంగా ఉన్నప్పుడు వారిని పిల్లలు చాటుగా చూసినా

టీవీ లలో వచ్చే హింసాత్మకమైన దృశ్యాలు చూడడం.

సామజిక మాధ్యమాల్లో అనుకోకుండా అసభ్యమైన చిత్రాలు కానీ, video లు కానీ చూడడం.

తోటి పిల్లలు అవహేళన చేయడం వల్ల అత్మనూన్యతా భావానికి గురయి వారి మీద కసి పెంచుకోవడం.

తల్లిదండ్రులు అడగకుండానే అన్నీ తెచ్చి, అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం వల్ల

పిల్లలు లైంగిక వేధింపులకు గురవడం వల్ల.

ఇలా చెప్పుకుంటూ పొతే ఈ page సరిపోదు.

పిల్లలన్నాక ఖచ్చితంగా తప్పులు చేస్తారు.వారిని సరిదిద్దడానికి ఒక్కోసారి కఠినంగా ప్రవర్తించాల్సి రావొచ్చు.అయినా సరే తల్లిదండ్రులు వెనుకాడకూడదు.పెద్దవారయి నేరాలు చేసి ఊచలు లెఖ్ఖపెట్టేకన్నా తల్లిదండ్రుల చేతిలో నాలుగు దెబ్బలు తినడమే నయం.

మీకొక ఉదాహరణ చెప్తాను.ఒక parents తమ పిల్లవాణ్ణి చిన్నప్పటి నుండి  చాలా క్రమశిక్షణతో పెంచుతారు.ఇంకో parents అసలు పిల్లవాడు ఏంచేస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో కూడా పట్టించుకోరు.అయితే, ఏదో ఒక సమయంలో క్రమశిక్షణతో పెరిగిన పిల్లవాడూ తప్పుచేస్తాడు , పెరగని పిల్లవాడూ తప్పుచేస్తాడు.ఇద్దరూ  ఖచ్చితంగా తప్పు చేసే తీరుతారు.కానీ తొందరలోనే ఇద్దరూ తమ తప్పు తాలూకు పర్యవసానాన్ని ఎదుర్కుంటారు. అప్పుడు …

క్రమశిక్షణతో పెంచిన  పిల్లవాడు తన తప్పు తెలుసుకున్నాక ఇలా అనుకుంటాడు “అరె!నేనెంత తప్పు చేసాను.అమ్మా నాన్న మొదటి నుండి జాగ్రత్త చెప్తూనే ఉన్నారు.నేను వినలేదు అందుకే అనుభవించాను.ఇకనుండైనా సరిగ్గా నడచుకోవాలి”.వాడికి కనీసం తప్పు చేసానన్న అపరాధ భావం ఉంటుంది.”అమ్మా, నాన్నా ! మీరు చెపితే వినలేదు.ఇంకెప్పుడూ ఇలా చేయను నన్ను క్షమించండి” అంటాడు.

క్రమశిక్షణతో పెంచని పిల్లవాడు తను చేసింది తప్పు అని అసలు తెలుసుకుంటాడో లేదో తెలీదు.ఒకవేళ తెలుసుకున్నా ఆ తప్పు వల్ల తనకి జరిగిన నష్టాన్ని, బాధని భరించలేక ఇలా అనుకుంటాడు “నేను తప్పు చేశాను.దానికి కారణం మీరే.మీరెప్పుడూ నాకేది తప్పో ఒప్పో చెప్పలేదు.నన్ను సరిచేయలేదు”.వీడికి తప్పు చేశానన్న అపరాధ భావం ఏమాత్రం ఉండదు. ఒకవేళ ఏ కొద్దిగో ఉన్నా రెండో తప్పు చేసే సరికి అది కూడా పూర్తిగా పోతుంది. పైగా తన తల్లిదండ్రుల మీద అసహ్యం పెంచుకుని ఇంకా రెచ్చిపోయి తప్పులు చేసే అవకాశం ఉంది.

కాబట్టి అందరి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే.దయచేసి వారికోసం కొంత సమయాన్ని కేటాయించండి.వారు ఏమి చేస్తున్నారో ఎవరితో  స్నేహం చేస్తున్నారో గమనించండి.వారి తప్పుల్ని ఆదిలోనే తుంచేయండి.నేను కూడా  నా బిడ్డని చక్కగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాను.తనని ఉన్నత స్థానంలో నిలబెట్టేవరకు శ్రమిస్తూనే ఉంటాను.అది నా బాధ్యత.

Exit mobile version