Site icon Maatamanti

Q&A about Trifo Robo Cleaner||Trifo రోబో క్లీనర్ గురించి మీ సందేహాలకు నా సమాధానాలు

అందరికీ నమస్కారం. నేను ఈ మధ్య నా యూట్యూబ్ ఛానల్ లో ఒక రోబో క్లీనర్ ని రివ్యూ చేశాను. ఆ వీడియో ను చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇదే కాదండీ! ఎలాంటి వస్తువు ను రివ్యూ చేసినా దాని గురించి ముందు నేను తెలుసుకుని వేరే వారికి అర్ధం అయ్యేలా చెప్పడానికి చాలా సమయం వెచ్చిస్తాను. దీనికి ముఖ్య కారణం నేను ఎప్పుడైనా ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా ఇంటికి సంబంధించిన పని కానీ చేసే ముందు పెట్టిన డబ్బు వృధా కాకుండా పెట్టిన మందం పని చేస్తుందా లేదా అని ఒకటికి పది సార్లు అలోచించి చేస్తాను. కొనే ముందు నాకు కూడా సవాలక్ష సందేహాలు ఉంటాయి. కానీ తీర్చేవారుండరు. ఎంత విసుగొస్తుంది అంటే కొనాలా వద్దా? అని మనసు ఊగిసలాడుతుంది. చివరికి ధైర్యం చేసి కొనేస్తాను. కొన్నాక నేను చేసే మొదటి పని instruction manual ని పూర్తిగా చదివి అర్ధం చేసుకోవడం. ఆ తర్వాతే వాడడం మొదలు పెడతాను. చాలా మంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే manual సరిగ్గా చదవకుండా హడావిడిగా వాడడం మొదలు పెట్టేస్తారు. అది కాస్తా నాలుగు రోజులకు పాడై కూర్చుంటుంది.

మనకు నిజంగా అవసరమైనప్పుడు సలహా లేదా సూచనలు ఇచ్చే వ్యక్తి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలా నాకు నా తమ్ముళ్లు ఉన్నారు. నేను బెస్ట్ కంప్యూటర్ కొనాలి అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళిద్దరినీ సంప్రదించిన తర్వాతే కొంటాను. మిగతావి మాత్రం నేనే రీసెర్చ్ చేసి కొనుక్కుంటాను. ఈ బిజీ గజిబిజి జీవితంలో అంతగా రీసెర్చ్ టైమ్ అందరికీ ఉండకపోవచ్చు. అలాంటి వారికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశ్యం తోనే నేను రోజూ ఇంట్లో వాడే వస్తువుల పని తీరు గురించి రివ్యూ చేస్తుంటాను. అవి చూసి చాలా బ్రాండ్స్ వారు తమ తమ ప్రొడక్ట్స్ ని రివ్యూ చేయమని mails పెడుతుంటారు. కానీ నేను సరిగ్గా వాడని వస్తువుల గురించి అప్పటికప్పుడు ఏదో చెప్పమంటే నేను మాత్రం అలా చెప్పలేను.

సరే ఇక మొన్న నేను రివ్యూ చేసిన Trifo విషయానికొస్తే, ఆ వీడియో లో నన్ను కింద కామెంట్స్ లో అడిగిన ప్రశ్నలు కొన్నీ, నేను చెప్పాలి అనుకుని వీడియో పెద్దదిగా అయిపోతుంది అని చెప్పలేనివి కొన్నీ, అన్నింటినీ కలిపి ఇక్కడ ప్రశ్నలుగా రాసి వాటికి కింద సమాధానాలు రాస్తాను. కింద చదవగలరు. నన్ను ఈ పోస్ట్ రాయమని కంపెనీ వారు అడగలేదు. పూర్తి వివరాలు ఇవ్వడం నా బాధ్యతగా భావించి రాస్తున్నాను.

    1. ఇది ఎంత ఏరియా ను శుభ్రం చేయగలదు?

      ఒకసారి పూర్తిగా రీఛార్జ్ చేసిన తర్వాత ఈ Trifo క్లీనర్ మొత్తం 2500sqft ల ఏరియా ను క్లీన్ చేయగలదు. ఒక వేళ మీది duplex ఇల్లు అయి ఉంటే కూడా సమస్య లేదు. పైనా క్రింద కలిపి 3000 sqft ఉన్నా కూడా శుభ్రం చేస్తుంది. ఎందుకంటే 2500 sqft ఉన్న ఇంట్లో అన్ని సామాన్లు, wood వర్క్, bathrooms, కిచెన్ platform ఇలాంటివన్నీ పోగా మిగిలే స్థలం 1500-1800 sqft మాత్రమే, అందువల్ల ఇల్లు 3000 sqft వరకు ఉన్నా భయపడనవసరం లేదు.

    2. మాది duplex ఇల్లు. మెట్లు ఎక్కి కానీ దిగి కానీ వెళ్లి శుభ్రం చేస్తుందా?

      ఇది మెట్లు ఎక్కడం కానీ దిగడం కానీ చేయలేదు. కింద ఇల్లు శుభ్రం చేశాక మనమే దాన్ని తీసుకెళ్లి పైన అంతస్థులో ఉంచి ON చేస్తే క్లీన్ చేస్తుంది. ఒకరిద్దరు windows  మరియు walls clean చేస్తుందా అని అడిగారు. అలా కిటికీలు, గోడలు ఇది శుభ్రం చేయదు.

    3. మెట్ల మీద నుండి కింద పడిపోతుందా?

      పడదు. ఎందుకంటే దీని అడుగు భాగంలో anti drop సెన్సార్లు ఉంటాయి. ఏదైనా లోతును గ్రహించగానే ఆటోమేటిక్ గా వెనక్కు వెళ్ళిపోతుంది.

    4. ఎంత సేపు పనిచేస్తుంది? అంటే ఒకసారి ON చేస్తే ఎంత సేపు నడుస్తుంది?

      ఒకసారి ఫుల్ గా రీఛార్జ్ చేసిన తర్వాత 120 నిముషాలు అంటే 2 గంటలు వరకు పనిచేస్తుంది.

    5. ఇది ఉపయోగించాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో wifi ఉండాలా?

      అవసరం లేదు. కానీ ఇందులో ఉన్న features అన్నింటినీ పూర్తిగా వాడాలి అనుకుంటే మాత్రం wifi తప్పని సరి. మనం Trifo Home App ను install చేసుకునేటప్పుడు ఆ ప్రాసెస్ లో ఒక దగ్గర ‘Wifi Name’ మరియు wifi password అడుగుతుంది. ఇంట్లో ఉన్న wifi పేరు మరియు password ఇస్తేనే స్క్రీన్ ముందుకు వెళ్తుంది. లేకపోతే మొబైల్ App ను install చేసుకోలేము.  App ను ఇన్స్టాల్ చేసుకోకపోతే అందులో ఉన్న ఒక్క ఫీచర్ ను కూడా వాడలేము. ఉదాహరణకు మీరు ఇందులో ఉన్న ఒక ప్రధాన ఫీచర్ అయిన home surveillance ను వాడాలి అనుకుంటే ఇంట్లో wifi ఉండాలి. అంటే మీరు ఇంట్లో లేనప్పుడు అది ఎక్కడ శుభ్రం చేస్తుందో ఎలా శుభ్రం చేస్తుందో దూరం నుండి తెలుసుకోవాలి అంటే ఆ వీడియో ను మీ మొబైల్ కు పంపడానికి ఇంట్లో wifi ఉండాలి కదా! ఇంకోటి.. మీరు రిమోట్ లొకేషన్ నుండి మీ మొబైల్ తో దీన్ని ఆపరేట్ చేయాలి అనుకుంటే Wifi ఉండాలి కదా! నేను మొన్న పొలానికి వెళ్ళినప్పుడు చక్కగా నా మొబైల్ నుండి ఇంట్లో ఎలా ఉంది? ఏంటి? అని చూశాను. క్లీన్ చేయించాను.

    6. wifi లేకపోతే ఎలా ఆపరేట్ చేయాలి?

      మన మొబైల్ డేటా తో personal hotspot use చేసి install చేసుకోవచ్చు. అలా చేయాలి అనుకుంటే మనం ఏ ఫోన్ లో అయితే App ను వేసుకోవాలి అనుకుంటున్నామో అందులోని hotspot కాకుండా వేరే మొబైల్ ను  hotspot గా ఉంచి install చేసుకోవచ్చు. బాక్స్ లో నుండి తీయగానే ముందు దాన్ని వాడకుండా ఫుల్ గా ఛార్జింగ్ పెట్టి ఆ తర్వాత పవర్ బటన్ నొక్కి క్లీన్ చేయించాలి. ఆఫీసులకు వెళ్లే వారికి, ఒకవేళ ఇంట్లో పెద్ద వారు వాడుతుంటే అలాంటివారికి వైఫై లేకపోతే ఇబ్బంది అవుతుంది. wifi ఉంటే తేలిగ్గా వాడుకోవచ్చు.

    7. ఇది ఎలాంటి floors మీద పనిచేస్తుంది?

      మార్బుల్, గతుకులు లేకుండా సమంగా ఉన్న ఏదైనా ఉపరితలం మీద అంటే wooden flooring, టైల్స్ మీద పనిచేస్తుంది. ఇంట్లో carpets ఉంటే వాటిని కూడా శుభ్రం చేస్తుంది. ఫ్లోర్ నుండి కార్పెట్ మందం 2cm ఎత్తు ఉన్నా ఎక్కి శుభ్రం చేస్తుంది. డోర్ mats ఉంటే ఒక్కోసారి వాటి మీద కు ఎక్కి శుభ్రం చేసి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి దానితో పాటు ఈడ్చుకుపోతుంది లేదా కొన్ని సార్లు అక్కడే కాస్త పక్కకు జరిపినట్లుగా చేసి పోతుంది. ఇదే కాదు నేను ఆల్రెడీ ఇంట్లో వాడుతున్న ఇంకోటి కూడా అలానే చేస్తుంది.

    8. ఇంటి బయట ఓపెన్/outdoor  లో వరండా లు అవి శుభ్రం చేయించొచ్చా?

      No. ఇది కేవలం indoor లో వాడడం కొరకు మాత్రమే. బయట గచ్చు మీద పెడితే పక్కనే ఉన్న మట్టిలోకి వెళ్లి పాడయిపోతుంది. నేను ఇంతకు ముందు వాడుతుంది అయితే ఇంట్లోకి ఎండ పడుతుంటే ఆ ఎండ పడిన చోటులోకి అస్సలు వెళ్ళదు. నీడ ఉన్నవరకు వెళ్లి వెనక్కు వచ్చేస్తుంది. Trifo మాత్రం డైనింగ్ రూమ్ లో పక్క బాల్కనీ లో నుండి ఎండ పడుతున్నా శుభ్రం చేసింది.

    9.  bathrooms శుభ్రం చేస్తుందా?

      ఇది ఇంట్లో తిరిగేటప్పుడు పొరబాటున కూడా bathroom డోర్స్ ఓపెన్ చేసి ఉంచకూడదు. అలా ఉంటే మెయిన్ ఫ్లోర్ నుండి బాత్రూం 2-3 cm లోతు ఉన్నా లోపలికి వెళ్ళిపోతుంది. కింద మెయిన్ బ్రష్ మొత్తం తడిగా అయిపోతుంది. ఒకవేళ పొరబాటున తడిగా ఉన్న జుట్టు ఉంటే అదంతా లాగేసుకుంటుంది. మళ్ళీ అదే తడితో ఇంట్లోకి వచ్చి అదంతా అంటిస్తూ తిరుగుతుంది. ఒకవేళ బాత్రూమ్ నుండి మళ్ళీ మెయిన్ రూమ్ లోకి ఎక్క లేకపోతే అక్కడే ఒక దగ్గర ఆగిపోతుంది. నాకు ఇలా పొరబాటున 2 సార్లు జరిగింది. దీంతో కాదు నేను ఇంతకుముందు వాడుతున్న నా పాత దానితో. అందుకే బాత్రూం డోర్స్ లాక్ చేసి ఉంచాలి.

    10. ఇది big papers, chocolate wrappers, biscuit covers ను శుభ్రం చేస్తుందా?

      ఇలా ఒకరిద్దరు అడిగారు. చేస్తుందా అంటే చేస్తుంది అని చెప్పాలా చేయదు అని చెప్పాలో అర్ధం కావడం లేదు. ఎందుకంటే ఇది దీని దారికి అడ్డం వచ్చిన ప్రతీ తేలికైన వస్తువును లాగేసుకుంటుంది. సేఫ్టీ pins లాంటి వాటిని కూడా. కాకపోతే పెద్ద పేపర్లు లాంటివి వచ్చినప్పుడు కూడా లాగేసుకుంటుంది కానీ ఆ పేపర్ dustbin లోపలికి వెళ్లకుండా కింద ఉన్న మెయిన్ బ్రష్ దగ్గర అడ్డుపడి ఉండిపోతుంది. అలాగే ఆ పేపర్ ను పట్టుకునే ఇల్లంతా తిరుగుతుంది. కానీ డస్ట్ ని లాక్కోదు ఎందుకంటే కింద పేపర్ అడ్డంగా ఉంది కదా. అందుకని. అసలు ఈ ప్రశ్నకు సమాధానం రాయకూడదు అనుకున్నాను బట్ రాస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో ఇలాంటి పేపర్లు, chocolate wrappers, biscuit covers వేసేది చిన్న పిల్లలే. నేనయితే అలా ఎట్టి పరిస్థితిలోనూ కింద పడేయ నివ్వకుండా dustbin లో వేయడం అలవాటు చేస్తాను. మా ఇంటికి ఎవరైనా చిన్న పిల్లలు వస్తే కూడా అలాగే నేర్పిస్తాను. వారు dustbin లో వేయగానే వారిని claps కొట్టి appreciate చేస్తాను. 3-4 టైమ్స్ చెప్పినా వినకపోతే అసలు అవి ఇవ్వను. అప్పుడు వారు next time వచ్చినప్పుడు నేను చెప్పకుండానే వెళ్లి dust bin లో వేయడం గమనించాను. సారీ! ఇక్కడ ఇలా రాయాల్సి వచ్చినందుకు క్షమించండి.

    11. దీనికి Electricity Bill ఎంత వస్తుంది?

      దీనికి సమాధానం చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను చెప్పగలరా? మీరు రోజూ ఇంట్లో ఉపయోగించే మొబైల్ ఛార్జింగ్ కి ఎంత Electricity Bill వస్తుందో ఎప్పుడైనా లెక్కవేశారా? అంటే లెక్కవేయగలమా అని? ఇదీ అంతే ఒక మంచి మొబైల్ ఛార్జింగ్ కి ఎంత ఖర్చు అవుతుందో అంతే అవుతుంది.Trifo Max లో 5200mAH బాటరీ ఉంది. మనం వాడే సెల్ ఫోన్స్ లో ఉదాహరణకు Real Me 5000mAH, Samsung Galaxy Series లో కొన్నిటికి 6000-7000mAH వరకు batteries ఉంటాయి. వాటితో పోలిస్తే దీని బాటరీ తక్కువ. అందువల్ల మనం ఇంట్లో ఒక maid ను పెట్టుకుంటే అయ్యే ఖర్చు తో పోలిస్తే అసలిది ఖర్చే కాదు. పైగా ఇది మానేయదు.

    12. tables మరియు కుర్చీల కిందకు వెళ్లి శుభ్రం చేస్తుందా?

      కాస్త logic తో ఆలోచిస్తే అది వెళ్లలేని ప్లేస్ ను అది ఎలా శుభ్రం చేయగలదు చెప్పండి? ఉదాహరణకు డైనింగ్ టేబుల్ కుర్చీలు టేబుల్ కు అనుకుని దగ్గరగా ఉన్నాయి అనుకోండి.కుర్చీల లెగ్స్ మధ్య ఉండే గ్యాప్ కనుక ఇది పట్టేంత ఉంటే కిందకు వెళ్లి నీట్ గా శుభ్రం చేస్తుంది. అంత గ్యాప్ లేకపోతే మాత్రం మనమే ఆ కుర్చీలను లేదా చిన్న చిన్న stools లాంటి వాటిని జరపాలి. సోఫాల కింద మంచాల కింద ఇది పట్టేంత గ్యాప్ ఉంటే కిందకు వెళ్లి చాలా శుభ్రంగా క్లీన్ చేస్తుంది. గ్యాప్ లేకపోతే అక్కడి చెత్త అలానే ఉంటుంది.

    13. wet mopping ఎలా పనిచేస్తుంది?

      ఇందులో ఉన్న wet mopping బిన్ కెపాసిటీ 100 ml. మాత్రమే. ఒక గది శుభ్రం చేయగానే అందులోని నీరు అయిపోతే మళ్ళీ నింపి పెట్టాల్సి వస్తుంది. అది నాకు నచ్చలేదు. అసలిదే కాదు వేరే ఏదైనా రోబో క్లీనర్ లో అయినా మీరు వెట్ మాపింగ్ తీసుకోవాలి అనుకుంటే మీరు తీసుకునే ముందు అలోచించి తీసుకోవాలి. ఉదాహరణకు మన ఇంట్లో ఫ్లోర్ మీద బాగా గట్టిగా అతుక్కున్న మొండి మరకలు లాంటివి ఇవి శుభ్రం చేయలేవు. ఒక్కోసారి మనం mopping stick తో క్లీన్ చేస్తేనే కొన్ని గట్టిగా తుడిస్తేనే కానీ పోవు. అలా తుడవాలి అంటే మనం ఎంత బలం పెట్టి తుడవాలి. మనం ఉండే బరువుకి మనం అంత గట్టిగా తుడవగలం. కానీ అది మన తో పోలిస్తే ఉండే కొద్ది బరువుకి ఆ మొండి మరకల్ని ఎలా తుడుస్తుంది చెప్పండి? ఉదాహరణకు మా ఇల్లు తీసుకోండి. మా ఇంట్లో కిచెన్ లో అప్పుడప్పుడు తప్ప ఎక్కడా మరకలు పడవు. అలాంటప్పుడు ఇది బాగా నీట్ గా శుభ్రం చేస్తుంది. ఒకవేళ మరీ మొండి జిడ్డు మరకల్లాంటివి కాకుండా కాస్త తుడిస్తే పోయే మరకలు ఉన్నాయి అనుకోండి వాటి మీద కాస్త వాటర్ spray చేసి ఉంచితే అది నానుతుంది. అప్పుడు ఈ రోబో లో వెట్ mop బాగా శుభ్రం చేస్తుంది.

    14. శబ్దం ఎంత వస్తుంది?

      Trifo లో Max model లో 3000 pa suction పవర్ ఉంది నేను ఆల్రెడీ ఇంట్లో వాడుతున్న దాని suction పవర్ 1200 pa మాత్రమే. మనకు ఇల్లు శుభ్రంగా చేయడానికి 1200-1500 pa సరిపోతుంది. ఎక్కువ అంటే 3000 pa లో ఉంచి క్లీన్ చేస్తే శబ్దం బాగా ఎక్కువగానే వస్తుంది. మనం ఇంట్లో లేకపోతే Turbo mode అంటే 3000 pa కి సెట్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్నప్పుడు అయితే quiet mode సరిపోతుంది. ఆ మోడ్ లో పెద్దగా సౌండ్ రాదు. అస్సలు ఇబ్బందిగా ఉండదు. మీ పని మీరు చేసుకుంటుంటే అసలది ON లో ఉన్న విషయం కూడా మర్చిపోతారు.

    15. warranty  ఎన్ని సంవత్సరాలు?

      దీనికి 1 year  Warranty ఉంది. మనం కొన్నప్పుడు మెయిన్ ఔటర్ బాక్స్ మీద ఒక లింక్ మరియు  ఒక QRCode ఉంటాయి. మన మొబైల్ లో ఆ link ను క్లిక్ చేసి అక్కడ ఈ code ను స్కాన్ చేస్తే వారంటీ లిస్ట్ లో మీ device ను రిజిస్టర్ చేసుకుంటుంది.

    16. దీని ధర ఎంత?

      ఏ వస్తువు ధర అయినా fixed గా ఉండదు. మార్కెట్ అవసరాలను బట్టి మారుస్తూ ఉంటారు. ప్రతీ వస్తువుకి ముందు ఒక MRP ఉంటుంది తర్వాత ఆ MRP అనేదాన్ని కొట్టేసి డిస్కౌంట్ అని చెప్పి ధర మార్చి ఇస్తూ ఉంటారు. ఆ డిస్కౌంట్ ధర అనేది వారంలోనే రెండు మూడు సార్లు మారుతుంటుంది. నేను దీన్ని మొదటి సారి చూసినప్పుడు 13999 ఉంది. తర్వాత చూస్తే 11990 ఉంది మళ్ళీ ఇవాళ చూస్తే 14999 ఉంది కానీ వారు Jan 19th నుండి 26 వరకు discount సేల్ లో అమ్ముతారు అట అమెజాన్ లో. కావాలి అనుకున్నవారు రేపు చూడండి.

    17. Demonstraion కావాలి అంటే?

      ప్రస్తుతానికి on-site demo అందుబాటులో లేదు. కానీ మీకు డెమో కావాలి అంటే virtual demo ఉంటుంది. Customer Support line కి call చేసి తెలుసుకోవచ్చు.PH:+91 6366920571

    18. ఏదైనా repairs/problem వస్తే service centers ఉన్నాయా?

      ప్రస్తుతానికి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగుళూరు లాంటి ప్రధాన నగరాల్లో మాత్రమే service centres ఉన్నాయి. ముందు ఏదైనా సమస్య వస్తే నేను పైన ఇచ్చిన కస్టమర్ support కి కాల్ చేసి చెప్పాలి. వారు సమస్య తెలుసుకుని అది solve చేసుకోవడానికి తగు సూచనలు ఇస్తారు. అయినా కూడా solve కాకపోతే వీడియో కాల్ ద్వారా పరిష్కరించడానికి చూస్తారు. అలా చేసినా కూడా అవ్వకపోతే అప్పుడు వారే దగ్గర్లో ఉన్న service center వారికి తెలియ చేస్తారు. వారు దానిని బాగు చేసి మనకు అప్పగిస్తారు. నేను పైన చెప్పిన నగరాల్లో కాకుండా వేరే ఇతర నగరాల్లో ఉండే వారికి సమస్య వస్తే వారు ముంబై సర్వీస్ సెంటర్ వారికి సమస్యని solve చేసే పనిని అప్పగిస్తారు. ఇలాంటి సందర్భంలో device pick-up and drop కూడా ఉంటుంది అని చెప్పారు.

    19. Customer Support గురించి మరికొన్ని వివరాలు?

      వారి ఫోన్ నెంబర్ +91 6366920571. వారంలో 7 రోజులు 10 a.m to 7 p.m వరకు అందుబాటులో ఉంటారు. ఒకవేళ మీరు కాల్ చేసినా కలవకపోతే  అక్కడ రికార్డు అయిన మీ ఫోన్ నెంబర్ చూసుకుని వారే 24 గంటల లోపు మీకు కాల్ చేస్తారు. ఒకవేళ మీకు 24 hours లోపు ఆగే సమయం లేకపోతే support@cambiumretail.com కి మెయిల్ చేయవచ్చు లేదా +91 9004104151 whatspp నెంబర్ కు message పెట్టవచ్చు.

    20. Trifo బ్రాండ్ లో wet mopping తో వచ్చే బెస్ట్ మోడల్ ఏంటి?

      Trifo max తో పాటు కావాలి అంటే wet mopping option ఉన్నది తీసుకోవచ్చు. అది ఎలా ఉంది అనేది మీకు వీడియోలో చూపించాను ఇంకా పైన కూడా కొన్ని వివరాలు చెప్పాను. కానీ అది కాకుండా ఇంకా ఏదైనా బెటర్ డి ఉందా అని నేను వారిని అడిగాను. వారు already ఇప్పుడు ఉన్న Max మోడల్ కి పెద్ద wet mopping ట్యాంక్ ఇచ్చి కొత్తగా విడుదల చేయబోతున్నాము అని చెప్పారు. ఇంకోటేమో Ironpie m6+. దీనికి 300ml వాటర్ ట్యాంక్ ఉంది. ఇంకొకటి Trifo Lucy కూడా త్వరలో రాబోతుంది అని చెప్పారు.


పైన రాసిన ప్రశ్నలన్నింటిలో 15 వరకు నాకు తెలిసింది రాశాను. మిగతావి మాత్రం నేను ప్రశ్నలు రాసుకుని కంపెనీ వారిని అడిగి తెలుసుకున్నాను. ఇవి మీ సందేహాలను నివృత్తి చేస్తాయి అనుకుంటున్నాను. ఇందులో నేను రాసిన చాలా మటుకు పాయింట్స్ ఈ ఒక్క రోబోకు మాత్రమే కాదు వేరే బ్రాండ్స్ లో ఉన్న మోడల్స్ కు కూడా వర్తిస్తాయి.గమనించగలరు. ఒక్కోసారి నేను రాసిన పోస్ట్ ను చదివాక మళ్ళీ ఆ లింక్ దొరకడం లేదు అని చెప్తున్నారు. మీరు నా యూట్యూబ్ ఛానల్ లో community లోకి వెళ్లి చూస్తే మీకు కనిపిస్తుంది. ఒకవేళ ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కూడా మీరుకింద కామెంట్స్ లో అడగండి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.

Exit mobile version